కామారెడ్డిటౌన్, వెలుగు : ఆశ కార్యకర్తల పెండింగ్ బిల్లులు చెల్లించాలని సీఐటీయూ జిల్లా ప్రెసిడెంట్ చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆశ వర్కర్స్ సంఘం తరఫున డీఎంహెచ్వో విద్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నిర్వహించిన లెప్రసీ సర్వేకు డబ్బులు చెల్లించకుండానే మళ్లీ లెప్రసీ సర్వే నిర్వహించాలని అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో డ్యూటీలు నిర్వహిస్తే కూడా పైసలు ఇవ్వలేదన్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో కూడా ఆశ వర్కర్స్ డ్యూటీలు చేస్తే ఒక్క రూపాయి కూడా చెల్లించలేదన్నారు. బకాయిలు చెల్లించటంతో పాటు, ఇతర సమస్యలు పరిష్కరించాలని, క్వాలిటీ యూనిఫామ్స్ సప్లయ్చేయాలని కోరారు. ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ కీసరి ఇందిరా, ప్రతినిధులు లత, మంజుల, మమత, రాజమణి పాల్గొన్నారు.
