ఎగ్జిట్‌ పోల్స్‌.. కాంగ్రెస్‌లో జోష్‌

ఎగ్జిట్‌ పోల్స్‌.. కాంగ్రెస్‌లో జోష్‌
  •  పార్టీకి అనుకూలంగా రావడంపై హర్షం
  • ఇప్పటి నుంచే సెలబ్రేషన్స్‌ స్టార్ట్‌ చేయాలని రేవంత్‌ పిలుపు
  • పలు నియోజకవర్గాల్లో పటాకులు కాల్చిన కార్యకర్తలు
  • ఇప్పటి నుంచే సెలబ్రేషన్స్‌ స్టార్ట్‌ చేయాలని రేవంత్‌ పిలుపు
  • పలు నియోజకవర్గాల్లో పటాకులు కాల్చిన కార్యకర్తలు

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీలో జోష్ వచ్చింది. పార్టీ నేతలు సంబురాల మూడ్‌లోకి వెళ్లిపోయారు. అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కు అనుకూలంగా రావడం, ఇప్పటి నుంచే సంబురాలు చేసుకోవాలని పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి పిలుపునివ్వడంతో పార్టీ శ్రేణులు సెలబ్రేషన్స్‌ స్టార్ట్ చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ముందు నుంచి కాంగ్రెస్ నేతలంతా ధీమాగా ఉన్నారు. పోలింగ్ ట్రెండ్, ఎగ్జిట్ పోల్స్‌తో మరింత క్లారిటీ వచ్చేయడంతో పలు నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. పార్టీ నేతలతో పాటు కేడర్‌‌లోనూ ఎగ్జిట్ పోల్స్ ఉత్సాహాన్ని నింపాయి. ప్రచారం జరిగిన ఇన్ని రోజులు పార్టీ నేతలు, కేడర్ అంతా రాత్రింబవళ్లు కష్టపడి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అదే తమ గెలుపునకు కలసి వచ్చిందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈసారి కేసీఆర్‌‌ను దించేయాలని జనంలో ఉన్న కసి కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా మారిందని చెప్తున్నారు. అన్ని సర్వేలూ కాంగ్రెస్‌కు మంచి మెజారిటీ ఇవ్వడంతో కచ్చితంగా తామే గెలుస్తామని పార్టీ నేతలు ఫిక్స్‌ అయిపోయారు.

గ్రౌండ్‌లో లేదంటూ ప్రచారాలు..

కాంగ్రెస్ దంతా సోషల్ మీడియా హవానే గానీ.. గ్రౌండ్‌లో లేదని ఇతర పార్టీల నేతలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, సోషల్ మీడియాలోనే కాదు.. గ్రౌండ్‌లోనూ పార్టీ గట్టిగానే ఉందని అన్ని సర్వేలు తేల్చేశాయని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. యువత కూడా ఈసారి ఎక్కువ సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్నారని, అది తమకు కలసివచ్చిందని చెప్తున్నారు. పేపర్లు లీక్‌, ఉద్యోగాలు రాక ఎంతో మంది విద్యార్థులు, నిరుద్యోగులు అవస్థలు పడ్డారని, వాళ్లే సొంతూర్లకు తరలివచ్చి కాంగ్రెస్‌కు ఓట్లేశారని పేర్కొంటున్నారు. అంతేగాకుండా రాహుల్ గాంధీ చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీకి వెళ్లి, నిరుద్యోగులతో మాట్లాడటం కలసి వచ్చిందని పార్టీ సీనియర్ లీడర్లు అభిప్రాయపడుతున్నారు. నిరుద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులూ ఈసారి కాంగ్రెస్‌వైపే నిలబడ్డారని అంటున్నారు. ఉద్యోగులు, టీచర్లు కూడా తమ ఓటును కాంగ్రెస్‌కే వేశారని పలువురు లీడర్లు చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలూ జనాల్లోకి బాగా వెళ్లాయని, ఇది కూడా పార్టీకి ప్లస్ అయ్యిందని అంటున్నారు.

వార్ రూమ్‌లో ఠాక్రే రివ్యూ..

ఎన్నికల సరళిపై గురువారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్ రావు ఠాక్రే గాంధీ భవన్‌లోని వార్ రూమ్‌లో రివ్యూ చేశారు. ఎలక్షన్ అబ్జర్వర్ దీపాదాస్ మున్షి, పీసీసీ స్పోక్స్ పర్సన్ బైకాని లింగం యాదవ్ తదితరులతో కలిసి ఏ నియోజకవర్గంలో ఎన్నికలు ఎలా జరిగాయన్న విషయాలను ఆరా తీశారు. పోలింగ్ పర్సెంటేజీ ఏ పార్టీకి ఎంత వచ్చింది తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ వివరాలపైనా చర్చించారు. పార్టీ నేతలు కౌంటింగ్ జరిగే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారితో మాట్లాడినట్టు తెలిసింది.