
- రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్
- అభ్యర్థుల సందేహాలు తీర్చాలని టీజీపీఎస్సీ చైర్మన్‌కు లేఖ
న్యూఢిల్లీ, వెలుగు: గ్రూప్- 1 మెయిన్స్ ఫలితాల్లో అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. గ్రూప్ 1ను వెంటనే- రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ పరీక్షలు నిర్వహించడంపై ప్రభుత్వం దృష్టిసారించాలని కోరారు. ఈ మేరకు టీ-జీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశంకు సంజయ్ బుధవారం లేఖ రాశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ, వాల్యుయేషన్, ఫలితాల విషయంలో అనేక అవకతవకలు జరిగాయని గ్రూప్ 1 అభ్యర్థులు పలుమార్లు తన దృష్టికి తీసుకొచ్చారని అందులో పేర్కొన్నారు.
అభ్యర్థులు, ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత టీ-జీజీఎస్సీపై ఉందన్నారు. నోటిఫికేషన్‌ను ఉల్లంఘించారని, పేపర్ల వాల్యుయేషన్, మార్కుల ప్రకటనలో పొరపాట్లు జరిగాయని, ఉర్దూ మీడియంలో రాసిన అభ్యర్థులకే టాప్ ర్యాంకులు వచ్చాయని లేఖలో ప్రస్తావించారు. వీటికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని వారం రోజుల్లోగా పంపాలని టీజీపీఎస్సీ చైర్మన్‌ను కోరారు.
కరీంనగర్‌లో ఈఎస్‌ఐ ఆస్పత్రి పెట్టండి..
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటు- చేయాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను బండి సంజయ్ కోరారు. ఈ అంశంపై ఆయనతో బుధవారం మరోసారి చర్చించారు. అలాగే కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో రూ.10 కోట్ల వ్యయంతో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు- చేయాలని విజ్ఞప్తి చేశారు.
కులగణన సాహసోపేత నిర్ణయం..
దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాహసోపేతమని బండి సంజయ్ అన్నారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ విజయమంటూ ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. కుల గణనకు కాంగ్రెస్ పార్టీయే వ్యతిరేకమని విమర్శించారు. కాంగ్రెస్ 50 ఏండ్ల పాలనలో జనాభా లెక్కల్లో కులగణనను చేర్చకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. తెలంగాణ సహా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించిన కులగణన సర్వేలో పారదర్శకత లేదన్నారు.