హామీలు అమలు చేయకుంటే ఎక్కడికక్కడ నిలదీస్తం : బండి సంజయ్​

హామీలు అమలు చేయకుంటే ఎక్కడికక్కడ నిలదీస్తం  : బండి సంజయ్​
  • ప్రజలతో కలిసి మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటం: బండి సంజయ్​
  • రాష్ట్ర ప్రభుత్వం పాలనపై చేతులెత్తేసింది
  • సీఎం రేవంత్​ వ్యాఖ్యలతో కాంగ్రెస్ ఖేల్ ఖతమైంది
  • ఆ పార్టీ ఎమ్మె ల్యేలకూ భయం పట్టుకున్నది
  • రాజీవ్ రహదారిని వంకరటింకరగా నిర్మించింది కాంగ్రెస్సేనని కామెంట్​ 

రాజన్న సిరిసిల్ల, వెలుగు: కాంగ్రెస్​ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రజలతో కలిసి మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తాను  ఏమీ చేయలేని స్థితిలో ఉన్నానని, రాష్ట్రం దివాలా తీసిందంటూ  మాట్లాడటం సిగ్గు చేటని విమర్శించారు. 

మంగళవారం  రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో బండి సంజయ్​ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పైసా అప్పు పుట్టడంలేదని, ఢిల్లీకి  పోతే చెప్పులెత్తుకుపోయే  దొంగలాగా చూస్తున్నారంటూ  సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తెలంగాణలో కాంగ్రెస్ ఖేల్ ఖతం .. దుకాణం బంద్ అయినట్టు తేలిపోయిందని అన్నారు.  ఎన్నికల్లో ప్రజలకిచ్చిన  హామీలను  అమలు చేయలేమని  చెప్పేశారన్నారు.

 వృద్ధులకు  రూ.4 వేల పింఛన్​, మహిళలకు నెలనెలా రూ.2,500 , తులం బంగారం, నిరుద్యోగులకు రూ.4 వేల భృతి, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇక ఇవ్వరని సీఎం మాటలతో తేలిపోయిందన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను పరిష్కరించలేమని స్పష్టంగా చెప్పారని, ఇక ప్రజలే ఆలోచించుకోవాలని సంజయ్​అన్నారు.   తెలంగాణకు ఇచ్చిన  హామీలు  అమలు చేస్తానని  చేతిలో రాజ్యాంగం పట్టుకుని చెప్పిన రాహుల్​గాంధీ  ఇప్పుడేమంటారని  ప్రశ్నించారు. సీఎం వ్యాఖ్యలపై మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో భయం పట్టుకున్నదని చెప్పారు.  

చెప్పులెత్తుకుపోవడం ఏందో 

ఢిల్లీకి పోతే అపాయింట్ మెంట్ ఇస్తలేరని సీఎం చెప్పడం పచ్చి అబద్ధం అని బండి సంజయ్​అన్నారు.  రేవంత్​రెడ్డి చాలాసార్లు ప్రధానిని  కలిశారని,   కేంద్ర మంత్రులను ఎప్పుడంటే అప్పుడు కలుస్తూనే ఉన్నారని చెప్పారు. ‘వీడొస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతరేమోననే భయంతో దగ్గరికి కూడా రానీయడం లేదని’ రేవంత్​ మాట్లాడడం  విడ్డూరంగా ఉందన్నారు. ఈ చెప్పులెత్తుకుపోవడమేందో  తనకు  అర్థంకాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఇదేనేమోనని ఎద్దేవాచేశారు. 

 ఎన్నికలకు ముందు కూడా  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని రేవంత్ రెడ్డి చెప్పారని,  అయినా వంద రోజుల్లోనే 6 గ్యారంటీలు  అమలు చేస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. రాష్ట్రానికి కేంద్రం ఏమీ చేయలేదంటూ ఆరోపణలు చేయడం తగదని,  రాష్ట్రంలో  అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే జరుగుతున్నదని చెప్పారు.  రోడ్ల కోసమే రూ. 1.2 లక్షల కోట్లు  ఖర్చు చేశామని,  రైల్వేలకు  రూ. 32 వేల కోట్లు, వడ్ల కొనుగోలు కోసం లక్షన్నర కోట్లు ఇచ్చామని తెలిపారు. 

 కమీషన్లు కక్కుర్తి పడి కాంట్రాక్టర్ తో కలిసి రాజీవ్ రహదారిని వంకరటింకరగా నిర్మించింది కాంగ్రెస్సేనని ఆరోపించారు. ఇప్పుడు ఈ  రహదారిని 6 లేన్స్​ చేయాలని కేంద్రానికి ఓ మంత్రి లేఖ రాశాడని,  ఇదేం పద్ధతి అని సంజయ్​ ప్రశ్నించారు. ఈ రహదారిని  8 లేన్స్​గా విస్తరించకుండా  కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నదని  నిందలేస్తున్నారని  మండిపడ్డారు.  ఈ రోడ్డును విస్తరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నదని, ఈ విషయం  2022లోనే అప్పటి  బీఆర్ఎస్ ప్రభుత్వానికి  చెప్పామన్నారు.  కాంట్రాక్టర్ తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం కారణంగా విస్తరణ ముందుకు కదలలేదని చెప్పారు. కలిసి పనిచేసేందుకు తాము సిద్ధమని తెలిపారు.