
- బీసీ మహిళకు పోస్టు రిజర్వు
- సైలెంట్ మోడ్‌లో బీఆర్‌ఎస్
- ఆరు మండలాల నుంచి గెలిచే వారికి చాన్స్
నిజామాబాద్, వెలుగు : లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో కాంగ్రెస్, బీజేపీలు జడ్పీ కుర్చీపై ఫోకస్ పెట్టాయి. బీసీ మహిళకు రిజర్వు కాగా, అధికార కాంగ్రెస్ జడ్పీ పీఠం దక్కించుకునేందుకు వ్యూహా రచన చేస్తోంది. జడ్పీని కైవసం చేసుకునేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది.
దీంతో ఆరు మండలాల నుంచి గెలిచే వారికి పదవి దక్కే అవకాశం ఉంది. రిజర్వేషన్ ఫైనల్ కాకముందు చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నా, ఇప్పుడు భార్యలను రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు. ఇక, అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెనకబడ్డ బీఆర్‌ఎస్ మాత్రం సైలెంట్ మోడ్‌లో ఉండి, టికెట్లు దక్కని తిరుగుబాటుదారుల కోసం ఎదురుచూస్తోంది.
బోధన్, రూరల్ సెగ్మెంట్లకు నో చాన్స్..
జిల్లాలో మండలాల సంఖ్య 27 నుంచి 31కి పెరిగింది. 42 శాతం రిజర్వేషన్ ప్రకారం బీసీలకు 13 జడ్పీటీసీ స్థానాలు కేటాయించారు. అందులో ఆర్మూర్ సెగ్మెంట్‌లోని మాక్లూర్, బాల్కొండలోని మోర్తాడ్, మెండోరా, ఎర్గెట్లతో పాటు బాన్సువాడ పరిధిలోని మోస్రా, కోటగిరి సీట్లు బీసీ మహిళలకు రిజర్వ్ అయ్యాయి. ఈ ఆరు మండలాల నుంచి గెలిచే మహిళలకు జడ్పీ చైర్మన్ పదవి దక్కేవీలుంది.
బోధన్,నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ల పరిధిలో ఒక్క మండలం కూడా బీసీ మహిళలకు రిజర్వ్ కాలేదు. జనరల్ కేటగిరీలో ఉన్న 10 సీట్ల లో మహిళలకు రిజర్వ్ చేసిన ఐదు స్థానాల్లోనైనా బీసీ మహిళలకు అవకాశం కల్పిస్తారా అన్నది పార్టీల నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. ఇక మిగతా స్థానాల్లో ఎస్టీలకు 3, ఎస్సీలకు 5 కేటాయించారు.
జడ్పీ చుట్టే పాలిటిక్స్..
జిల్లాలో కీలకమైన జడ్పీ చైర్మన్పదవిపై కాంగ్రెస్, బీజేపీలు ఫోకస్ పెట్టాయి. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఈ పదవిని కాంగ్రెస్ చేజిక్కించుకోగా, ప్రస్తుత కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చైర్మన్‌గా అప్పట్లో ఉన్నారు. ఆ తర్వాత దశాబ్దం పాటు బీఆర్‌ఎస్ ఆధిపత్యం చెలాయించినా, ఇప్పుడు ఆ పార్టీ స్తబ్దతలో ఉంది. రిజర్వేషన్లు ఫైనల్ కాకముందే చాలామంది ద్వితీయ శ్రేణి నేతలు ఈ స్థానంపై కన్నేసినా, బీసీ మహిళకు కేటాయించడంతో భార్యలను రంగంలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నారు.
బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సూచనలతో ఇన్‌చార్జి మంత్రి సీతక్క పోటీదారుల పేర్లు అధిష్టానానికి సిఫారసు చేయనున్నారు. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ సొంత జిల్లా కావడంతో కాంగ్రెస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మరోవైపు, ఎంపీ అర్వింద్ గెలుపుతో క్షేత్రస్థాయిలో బలపడిన బీజేపీ, జడ్పీ పీఠంపై ప్రధాన ఫోకస్ పెట్టి శక్తివంతులైన అభ్యర్థులను కోసం కసరత్తు ప్రారంభించింది.