పెండ్లికి ముందు.. ఫొటో షూట్​ ​ ఉండాల్సిందేనట

పెండ్లికి ముందు.. ఫొటో షూట్​ ​ ఉండాల్సిందేనట

పెళ్ళంటే..మూడు ముళ్ళు, ఏడు అడుగులు..వాటి వెంట వచ్చే బోలెడు  మధురానుభూతులు. పదిలంగా దాచుకోవాలనుకునే  జ్ఞాపకాలు. అందుకే ఆ తీపి గుర్తుల్ని ఫొటోలు, వీడియోల రూపంలో భద్రంగా బీరువాలో పెడుతుంటారు చాలామంది. ఇప్పుడు ఆ ఫొటోలు, వీడియోల్లోనూ  కొత్త ట్రెండ్​ నడుస్తోంది. పెళ్ళికి ముందు ప్రి– వెడ్డింగ్ వీడియో షూట్స్ కామన్ అయిపోయాయి. పెళ్ళిళ్ల సీజన్​ కావడంతో  ఇప్పుడు ఎక్కడ చూసినా వీటి హడావిడే కనిపిస్తోంది. కరోనా వల్ల వాయిదా పడ్డ పెళ్లిళ్లన్నీ ఇప్పుడు పీటలెక్కుతున్నాయి. ఫొటోషూట్​లకి డిమాండ్​ పెరిగింది. లాక్ డౌన్​కి ముందు లక్షా, లక్షన్నర ఉన్న ఫొటో, వీడియో  షూట్​ ప్యాకేజీలు ఇప్పుడు రెండు నుంచి ఐదులక్షలకి చేరాయి. అయినా సరే ‘నో కాంప్రమైజ్’​ అంటున్నాయి కాబోయే జంటలు. దాంతో సిటీలోని ఫొటో షూట్ స్పాట్స్ అన్నీ సందడి సందడిగా మారాయి. 
వెరైటీ థీమ్స్​తో..
 ఫొటోషూట్లను క్రియేటివ్​గా, ట్రెండ్​కి తగ్గట్టు ప్లాన్​ చేసుకుంటున్నారు కపుల్స్. వాళ్ల అభిరుచికి తగ్గట్టుగానే  ఫొటోగ్రాఫర్లు వెరైటీ థీమ్స్​ డిజైన్​ చేస్తున్నారు. అది కూడా కపుల్​ బడ్జెట్​కి తగ్గట్టుగా. సిటీకి దూరంగా పచ్చదనంతో నిండిన తోటలు, రిసార్ట్స్​, టెంపుల్స్​లో వెడ్డింగ్ ఫొటో షూట్స్ ఎక్కువగా చేస్తున్నారు. ప్యాకేజీని బట్టి లొకేషన్లు, థీమ్స్​ సెలక్ట్​ చేస్తామని చెప్తున్నారు ఫొటోగ్రాఫర్లు. కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి లొకేషన్ వరకు ప్రతిదీ అకేషన్​కి తగ్గట్టుగా సెటప్ చేస్తున్నారు . సినిమా రేంజ్​లో సెట్స్ వేసి ఫొటో షూట్స్ చేస్తున్నారు. ప్రి– వెడ్డింగ్ ఫొటో, వీడియో షూట్స్​కి స్పెషల్ బ్యాక్ గ్రౌండ్స్ కూడా ఏర్పాటు​ చేస్తున్నారు. ఆ ఫొటో, వీడియోల షూట్స్​ని సీడీగానే కాదు యూట్యూబ్ లింక్​గానూ ఇస్తున్నారు. 
స్పెషల్​ స్పాట్స్​
ప్రి– వెడ్డింగ్ ఫొటో, వీడియో షూట్స్ కోసమే స్పెషల్​ సిటీలో చాలా స్పాట్స్ ఉన్నాయి. ఆ స్పాట్స్​లో ప్రస్తుతం రోజుకి ఇరవై వెడ్డింగ్​ షూట్స్​ జరుగుతున్నాయి. సిటీల్లోనే కాదు పల్లెల్లోనూ  ఫొటో, వీడియో షూట్స్​ హడావిడి కనిపిస్తోంది.  దాంతో  సెకండ్​ వేవ్ టైం​లో పని దొరక్క ఇబ్బంది పడ్డ ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకి రెండు చేతులా పని దొరికినట్టైంది. బిజీ షెడ్యూల్​ వల్ల  చాలామంది ఫొటోగ్రాఫర్లు ఫొటోగ్రఫీ నేర్చుకుంటున్న స్టూడెంట్స్​ని ఫ్రీలాన్సర్లుగా తీసుకుంటున్నారు. వాళ్లకి ఆరుగంటలకు రెండు నుంచి మూడువేలు పేమెంట్ ఇస్తున్నారు. వేసుకున్న డ్రెస్​, లొకేషన్​కి తగ్గట్టుగా పెళ్లికూతుళ్లకి ప్రొఫెషనల్స్​తో  మేకప్​ చేయిస్తున్నారు చాలామంది ఫొటోగ్రాఫర్లు.                                                                                                                                                           :: అంజుమా మహ్మద్ , హైదరాబాద్, వెలుగు
రోజుకి నాలుగు ..
పెళ్ళిళ్ల సీజన్​ అవడంతో డైలీ నాలుగైదు వరకు​ షూటింగ్స్​​ ఉంటున్నాయి. పెళ్లివాళ్లే​ థీమ్, లొకేషన్ ఎంచుకుంటే వాళ్లు చెప్పినట్టుగా చేస్తాం. లేదంటే  మా ఐడియాల్ని చెప్తాం. మొత్తం వెడ్డింగ్ ప్యాకేజీ తీసుకుంటే ప్రి– వెడ్డింగ్ కాంప్లిమెంటరీ. ప్రి–వెడ్డింగ్, మ్యారేజ్, రిసెప్షన్, సంగీత్, ఫార్మాలిటీ ఫొటోలు..  అన్నీ ఉంటాయి. మా టీంలో 15మంది ఉన్నాం. పెళ్లి రోజు ఫ్రీలాన్సర్స్​ని తీసుకుంటాం. లొకేషన్ కి 8గంటలకు 20వేల వరకు అద్దె కట్టాల్సి వస్తుంది. అందుకే కరోనాకి ముందుతో పోలిస్తే ఇప్పుడు వెడ్డింగ్​ ప్యాకేజీ రేట్లు కాస్త పెంచాం.                                                           - ప్రేమ్ కుమార్ అందె, హైదరాబాద్​

ఆర్డర్స్​ పెరిగాయి
ఫొటోగ్రఫీ ఫీల్డ్​లో  31యేళ్ల నుంచి ఉన్నా. నా టీంలో మొత్తం ఆరుగురు ఫొటోగ్రాఫర్లు ఉన్నారు. సెకండ్ వేవ్​ టైంలో పెళ్ళిళ్లు పెద్దగా జరగకపోవడంతో  ఇబ్బందులొచ్చాయి. కానీ ఇప్పుడు కరోనా భయం కాస్త తగ్గడంతో వెడ్డింగ్​ షూట్స్ మొదలయ్యాయి. పోయిన సారితో పోలిస్తే ఆర్డర్స్​ బాగా పెరిగాయి. వెడ్డింగ్ ప్యాకేజీలు రెండున్నర నుంచి మూడు లక్షలు ఉంటాయి.  ట్రెడిషనల్, వెస్ట్రన్, సెట్​ ప్రయారిటీగా థీమ్స్ అడుగుతున్నారు.  సిటీ చుట్టు పక్కల ఏరియాలతో పాటు హైదరాబాద్​లో  కూడా షూటింగ్స్​​ చేస్తున్నాం.                                                                            - ఎం. కేదార్ రెడ్డి,  కరీంనగర్