
- ఖాళీ బిందెలతో రోడ్డెకుతున్న మహిళలు.. ఆఫీసుల ఎదుట ధర్నాలు
- కిన్నెరసాని నీళ్లు వారానికోసారే.. ట్యాంకర్లతో సరఫరా అంతంత మాత్రమే..
- ముందస్తు సమీక్షలు పెట్టారు.. చర్యలు చేపట్టడం మరిచారు..
- రూ. 20కోట్లతో కిన్నెరసాని పాత పైప్లైన్లు మార్చే పనులు
- రూ. 120కోట్లతో అమృత్ స్కీం వర్క్స్
- నత్తనడకన పనులు.. పట్టించుకోని అధికారులు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణ ప్రజలు తాగునీటి కోసం తండ్లాడుతున్నారు. పట్టణానికి ప్రధాన నీటి వనరైన కిన్నెరసాని నీళ్లు వారానికోసారి సరఫరా అవుతున్నాయి. ట్యాంకర్లతో అరకొరగా నీళ్లను సప్లై చేస్తున్నా పెద్దగా ఫలితం ఏమీ ఉండడం లేదు. వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మున్సిపాలిటీ, ఇరిగేషన్, మిషన్ భగీరథతో పాటు పలు శాఖల ఆఫీసర్లతో పలుమార్లు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సమీక్షలు నిర్వహించినా తాగునీటి సమస్యను మాత్రం పరిష్కరించలేకపోయారు. దీంతో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కుతున్నారు.. ఆఫీస్ల ఎదుట ధర్నాలు చేస్తున్నారు.
ప్రణాళిక లోపం.. పట్టణ వాసులకు శాపం..
కొత్తగూడెం పట్టణ వాసులకు మున్సిపాలిటీ ఆఫీసర్లు తాగునీటి సప్లై విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం విఫలమైయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పట్టణంలో 35 వార్డులున్నాయి. దాదాపు లక్షకు పైగా జనాభా ఉంది. తాగునీటి ఎద్దడి నివారణ కోసం చేపట్టిన కిన్నెరసాని తాగునీటి పథకం అస్తవ్యస్తంగా మారింది. ఆఫీసర్ల ప్రణాళిక లోపంతో మిషన్ భగీరథ నీళ్లు పూర్తి స్థాయిలో తీసుకోలేని పరిస్థితి నెలకొంది. పట్టణ వాసులకు రోజూ కనీసం 9 నుంచి 10 ఎంఎల్డీ నీళ్లు అవసరం కాగా, 5 నుంచి 6 ఎంఎల్ డీ లోపు మాత్రమే నీళ్లు సప్లై అవుతున్నాయి. దాదాపు 30 శాతం పైప్లైన్ల లీకేజీల ద్వారా తాగునీరు వృథాగా పోతోంది. వాటి రిపేర్లకు ప్రతీ ఏడాది రూ. లక్షల్లో ఖర్చు చేస్తున్నా పెద్దగా ఉపయోగం లేకుండా పోతోంది.
కిన్నెరసాని నుంచి వచ్చే పాత పైప్లైన్లను మార్చేందుకు ప్రభుత్వం సాంక్షన్ చేసిన రూ. 20కోట్లకు పైగా నిధులతో చేపట్టిన పనులు, రూ. 120కోట్లతో చేపట్టిన అమృత్ స్కీం పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. రామవరంలో ఏడాది కిందట ఓవర్ హెడ్ ట్యాంక్ పూర్తి అయినప్పటికీ చిన్న చిన్న పెండింగ్ పనుల కారణంగా అధికారులు ఇప్పటికీ వినియోగంలోకి తీసుకురాలేకపోతున్నారు. ఈ ప్రాంత ప్రజలు సింగరేణి వాటర్ తోనే కాలం వెళ్లదీస్తున్నారు. బూడిదగడ్డ, కూలీ లైన్, హనుమాన్ బస్తీ, రామవరం, మధుర బస్తీ, రామా టాకీస్ రోడ్, పాత కొత్తగూడెం, సింగరేణి మెయిన్ హాస్పిటల్ సెంటర్, మేదరబస్తీ ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. సమ్మర్ లో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పలుమార్లు మున్సిపల్, మిషన్ భగీరథ ఆఫీసర్లు రివ్యూ మీటింగ్లు నిర్వహించినా అమలు చేయడంలో విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి.
వారం రోజులకోసారి నీళ్లొస్తే ఎలా..?
కిన్నెరసాని నీళ్లు వారం, పదిరోజులకోసారి వస్తే ఎలా కాలం వెళ్లదీయాలి. ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం పనులు పూర్తి అయి ఏడాది అయింది. కానీ ఇంకా ఓపెన్ చేయడం లేదు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి మా సమస్యను పరిష్కరించాలి.
పద్మ, రామవరం
నీళ్ల కోసం సచ్చిబతుకుతున్నాం..
వారానికోసారి వచ్చే కిన్నెరసాని నీళ్లును ఆదా చేసుకోలేక సచ్చి బతుకుతున్నాం. ఈ విషయాన్ని అధికారులు దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఓట్ల కోసం వచ్చే నాయకులు.. ఇప్పుడు ఎందుకు కనపడడం లేదు.. ఇప్పటికైనా నీటి సమస్యల లేకుండా చూడాలి.
రాజేశ్వరి, బూడిదగడ్డ ఏరియా
పనులు చేస్తున్నాం..
కిన్నెరసాని పైప్ లైన్లను మార్చే పనులు జరుగుతున్నాయి. దీంతో నీటి సప్లై కొంత ఇబ్బంది అవుతోంది. అమృత్ స్కీం పనులు పబ్లిక్ హెల్త్ డిపార్ట్ వాళ్లు చేస్తున్నారు. కొత్త పైప్ లైన్లను వేస్తూనే లీకేజీలను అరికడతుఉన్నాం. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటి సప్లై చేస్తున్నాం.
రవి కుమార్, డీఈ, కొత్తగూడెం మున్సిపాలిటీ