
కామారెడ్డి టౌన్, వెలుగు : ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలని, యూరియా కొరతను తీర్చాలని భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు విఠల్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, కార్యదర్శి కొమిరెడ్డి అంజన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్ రావు, ప్రతినిధులు మనోహర్ రెడ్డి, భైరవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. అనంతరం కలెక్టరేట్‌కు వెళ్లి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలో విస్తారమైన పంటలు దెబ్బతిన్నాయని, పంట నష్టపోయిన ప్రతి రైతుకు తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.