గుజరాత్​లో తుఫాన్ బీభత్సం...కరెంట్​ లేక వెయ్యికిపైగా ఊర్లలో చీకట్లు

గుజరాత్​లో తుఫాన్ బీభత్సం...కరెంట్​ లేక వెయ్యికిపైగా ఊర్లలో చీకట్లు
  •     నేలకు ఒరిగిన చెట్లు,  పడిపోయిన కరెంట్ పోల్స్
  •     500కు పైగా దెబ్బతిన్న ఇండ్లు
  •     రంగంలోకి ఎన్​డీఆర్ఎఫ్, ఎస్​డీఆర్ఎఫ్ టీమ్స్
  •     రాజస్థాన్ వైపు కదులుతున్న బిపర్​జాయ్

అహ్మదాబాద్: బిపర్​జాయ్ తుఫాన్ ధాటికి గుజరాత్ గజగజ వణికిపోయింది. ప్రధానంగా కచ్, సౌరాష్ట్ర రీజియన్​లో భారీ ఆస్తి నష్టం సంభవించింది. మొత్తం 5,120 ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోవడంతో 4,600 గ్రామాలకు కరెంట్ సప్లై ఆగిపోయింది. వెంటనే స్పందించిన అధికారులు శుక్రవారం నాటికి 3,580 గ్రామాలకు కరెంట్ సరఫరాను పునరుద్ధరించారు. ఇంకో వెయ్యి గ్రామాలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. అయితే, తుఫాన్ కారణంగా ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కచ్ వద్ద తీరం దాటిన తుఫాన్ రాజస్థాన్​వైపు కదులుతున్నది. తర్వాత బలహీనపడి అల్పపీడనంగా మారనుంది. శని, ఆదివారాల్లో రాజస్థాన్​లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.

కచ్ జిల్లాపైనే తీవ్ర ప్రభావం

తుఫాన్ కారణంగా స్టేట్ పవర్ సప్లై కంపెనీ ‘పశ్చిమ్ గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్’కు భారీ నష్టం సంభవించింది. 5,120 పోల్స్ విరిగిపోయాయి. అధికారులు పునరుద్ధరణ చర్యలు ప్రారంభించారు. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 9 పక్కా, 20 కచ్చా ఇండ్లు ధ్వంసం అయ్యాయి. 474 ఇండ్లు పాక్షికంగా,  65 పూరిళ్లు  పూర్తిగా ధ్వంసమయ్యాయి. నష్టపోయిన వారికి సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. 8 జిల్లాల్లో సహాయక చర్యలను కేంద్ర, రాష్ట్ర మంత్రులు పర్యవేక్షిస్తున్నారు. ఒక్క కచ్ జిల్లాలోనే 40% నష్టం సంభించింది. 18 ఎన్​డీఆర్​ఎఫ్ బృందాలు విరిగిన చెట్లు తొలగించడం, రోడ్లు వేయడం చేస్తున్నాయి. ముంబైలో 5, కర్నాటకలో 4 టీమ్స్ సేవలందిస్తున్నాయి. రాజస్థాన్​లో కూడా ఎన్​డీఆర్ఎఫ్  బృందాలను కేంద్రం మోహరించింది.

గుజరాత్ సీఎంకు మోదీ ఫోన్

గుజరాత్​ సీఎం భూపేంద్ర పటేల్​కు ప్రధాని మోదీ శుక్రవారం ఉదయం ఫోన్ చేశారు. తుఫాన్ ప్రభావాన్ని, రాష్ట్రంలో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గిర్ ఫారెస్ట్​లో జంతువుల రక్షణ కోసం తీసుకున్న చర్యల గురించి ఆరా తీశారు.

పాకిస్తాన్​కు తప్పిన భారీ నష్టం

తీరం దాటుతున్న టైంలో తుఫాన్ బలహీనపడటంతో పాకిస్తాన్​కు పెద్దగా నష్టం జరగలేదు. మాన్​సూన్, తుఫాన్ ముప్పును సింధ్ తీర ప్రాంత నగరమైన కేటీ ధైర్యంగా ఎదుర్కొన్నట్లు పాకిస్తాన్ వాతావరణ విభాగం(పీఎండీ) అధికారులు తెలిపారు. సింధ్ తీర ప్రాంతమైన సుజావాల్ ముంపునకు గురైందని క్లైమేట్ మినిస్టర్ షెర్రీ రెహ్మాన్ తెలిపారు. అప్పటికే చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. సేఫ్ క్యాంపుల్లో ఉన్న 67వేల మందిని తిరిగి వారి ఇండ్లకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

విరిగిన 600 చెట్లు.. ట్రాఫిక్ జామ్

3 రాష్ట్రాల స్టేట్ హైవేలపై సుమారు 600 చెట్లు విరిగిపడటంతో ట్రాఫిక్ స్తంభించింది. రంగంలోకి దిగిన అధికారులు చెట్లు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో పడ్డారు. కొన్నిచోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. తుఫాన్ కారణంగా 23 మందికి గాయాలయ్యాయి. తీర ప్రాంతాల్లోని లోతట్టు గ్రామాల్లో సముద్రపు నీరు వచ్చి చేరింది. తుఫాన్ ఏర్పడినప్పటి నుంచి తీరం దాటేదాకా కచ్ జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. సుమారు లక్ష మందిని సేఫ్​ ఏరియాకు తరలించామన్నారు. భావ్​నగర్ జిల్లాలో మేకలు రక్షించుకునే ప్రయత్నంలో తండ్రి కొడుకు చనిపోయారని, ఈ జిల్లా తుఫాన్ ప్రభావిత ప్రాంతం కిందికి రాదని క్లారిటీ ఇచ్చారు.