పండుగ ఆఫర్లు మిస్ అయ్యారా..? ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల రేట్లు పెరిగిపోతున్నాయ్ బాసూ..

పండుగ ఆఫర్లు మిస్ అయ్యారా..? ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల రేట్లు పెరిగిపోతున్నాయ్ బాసూ..

సాధారణంగా భారతదేశంలో చాలా మంది దసరా–దీపావళి వంటి పండుగ సీజన్‌లో కొత్త ఫోన్లు కొంటుంటారు. అయితే పండుగ ఆఫర్ల సమయంలో కొనలేకపోయిన వినియోగదారులు ఇకపై ఎక్కువ చెల్లించాల్సిందే. మెుబైల్ హ్యాండ్‌సెట్ తయారీ కంపెనీలు తమ పాపులర్ మోడళ్ల ధరలను పెంచాయి. ప్రస్తుతం ఉన్న మోడళ్ల రేట్లను రూ.2వేల వరకు పెంచగా.. ఇక కొత్త ప్రీమియం ఫోన్లపై రూ.6వేలకు పైగా ధరలు పెంచాలని చూస్తున్నట్లు వెల్లడైంది. 

ప్రధానంగా మెమరీ చిప్‌ల కొరత, సరఫరా గొలుసు ఒత్తిడి, రూపాయి విలువ పడిపోవడం వంటివి రేట్ల పెరుగుదలకు కారణాలుగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మధ్య, ఎంట్రీ స్థాయి ఫోన్లలో ఉపయోగించే మొబైల్ మెమరీ చిప్‌ల సరఫరా తగ్గడంతో ఈ ఒత్తిడి మరింత పెరిగిపోతోందని వెల్లడైంది. ఈ క్రమంలోనే చైనాకు చెందిన ఓప్పో, వివో, షియోమీ.. అలాగే సౌత్ కొరియాకు చెందిన సామ్‌సంగ్ ఇప్పటికే తమ ఫోన్ ధరలను పెంచేశాయి. వచ్చే వారంలో వన్‌ప్లస్, మెుటొరోలా, రియల్మీ కూడా ధరల రేట్లను పెంచబోతున్నాయి. షియోమీ డిస్కౌంట్‌లు నిలిపివేసి, డిసెంబర్‌లో విడుదల కానున్న నోట్ సిరీస్ ఫోన్లు అధిక ధరలతో రావచ్చని సమాచారం. 

కొన్ని మోడళ్లపై పెరిగిన రేట్లు ఇలా..

చైనా బ్రాండ్ ఓప్పో తన F31 (8GB/128GB, 8GB/256GB) మోడళ్లకు రూ.వెయ్యి.., రెనో14, రెనో14 ప్రోకు రూ.2వేలు పెంపు చేసింది. వివో తన T4 లైట్, T4x ఫోన్ల ధరలను రూ.500 వరకు పెంచింది. సామ్‌సంగ్ గెలాక్సీ A17 మోడల్‌కు రూ.500 పెంచటంతో పాటు బాక్స్‌లో ఉండే రూ.వెయ్యి విలువైన చార్జర్‌ను తొలగించడంతో యూజర్లపై భారం రూ.15వందలు పెంచేసింది.

►Also Read : ఒక్క గెలుపుతో కోట్లు కురుస్తున్నాయ్

పండుగల సమయంలో కంపెనీలు భారీగా షిప్‌మెంట్‌లు జరిపి స్టాక్ పెంచుకున్నాయి. అయితే అమ్మకాలు అంతగా జరగకపోవడంతో అదనపు ఇన్వెంటరీ ఒత్తిడి ఏర్పడిందని ఐడీసీ తెలిపింది. ఇదే సమయంలో భాగాలు ఖరీదవడంతో ఈ నెలలో ధరల పెరుగుదలకు కంపెనీలు వెళ్లినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2026లో ప్రీమియం ఫోన్లను కంపెనీ మరింత రేట్లు పెంచే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. 

రిటైలర్లు మాత్రం కంపెనీలు తీసుకున్న రేట్ల పెంపు నిర్ణయం నవంబర్, డిసెంబర్ నెలల్లో విక్రయాలను తగ్గిస్తాయని హెచ్చరిస్తున్నారు. పండుగల సీజన్ తర్వాత వచ్చిన ఈ ధరల పెంపులు వినియోగదారుల కొనుగోలు ఉత్సాహాన్ని తగ్గించవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.