దేవాలయాన్ని ధ్వంసం చేసిన యువకుడు

 దేవాలయాన్ని ధ్వంసం చేసిన యువకుడు
  • బీజేపీ, వీహెచ్ పీ నేతల దేహశుద్ధి
  • చేర్యాల పోలీసులకు దళిత సంఘాల ఫిర్యాదు

చేర్యాల, వెలుగు: మద్యం మత్తులో హనుమాన్​ ఆలయాన్ని ధ్వంసం చేసిన విషయం తెలియడంతో బీజేపీ, వీహెచ్ పీ నేతలు ఓ యువకుడికి దేహశుద్ధి చేసిన ఘటన సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. చేర్యాల మండలం  వేచరేణి ఎల్లదాస్​నగర్​కు చెందిన ఊపిరి అజయ్​కుమార్ మూడు రోజుల కింద మద్యం మత్తులో హనుమాన్​ విగ్రహాన్ని, పక్కనే ఉన్న ఇతర దేవతా విగ్రహాలను ధ్వంసం చేయడమే కాకుండా కాలితో తన్నాడు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ, వీహెచ్​పీ, ఆర్ఎస్ఎస్​నాయకులు యువకుడిని తాళ్లతో కట్టేసి, రోడ్లపై ఊరేగించి చితకబాదారు. విగ్రహాల ధ్వంసం వెనుక ఎవరైనా ఉన్నారా అని యువకున్ని ప్రశ్నించి వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. 

ఈ నేపథ్యంలో అజయ్​కుమార్​దళిత వర్గానికి (బుడగజంగాలు) చెందినందునే బీజేపీ నాయకులు దాడి చేశారని ఆరోపిస్తూ దళిత సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అజయ్​పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దేవతా విగ్రహాలను అవమానిస్తే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలే తప్ప చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని యువకుడిని చితకబాదడం అమానుషమని పేర్కొంటూ సీఐ శ్రీనుకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై సీఐ మాట్లాడుతూ సంఘటన వివరాలను పూర్తి స్థాయిలో తెలుసుకుని దాడి చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.