- ఇద్దరికి గాయాలు
సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి శివారులోని కనకదుర్గ పారాబాయిల్డ్ రైస్ మిల్లులో బుధవారం తెల్లవారుజామున పేలుడు సంభవించింది. దీంతో సుల్తానాబాద్ పట్టణంలోని మార్కండేయ కాలనీకి చెందిన గంగారపు కుమార్, శాస్త్రి నగర్ కు చెందిన తిరుపతివారు రామస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇందులో కుమార్ పరిస్థితి విషమంగా ఉంది. స్టీమ్ ఉపయోగించడంలో నిర్లక్ష్యం, సేఫ్టీ వాల్వ్‌లో సాంకేతిక లోపం వల్ల పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. పేలుడు ధాటికి శిథిలాలు చాలాదూరం వరకు ఎగిరిపడ్డాయి. పేలుడు వల్ల రెండు గోదాములు, మిషనరీలు, వడ్లు దెబ్బతిన్నాయి. సుల్తానాబాద్ రైస్ మిల్లు ఇండస్ట్రీలో బాయిలర్ పేలిన సంఘటన ఇది నాల్గోది. పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నట్టు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
సంఘటనపై ఆరా తీసిన ఎంపీ వంశీకృష్ణ
రైస్ మిల్లులో బాయిలర్ పేలుడు సంఘటనపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ బుధవారం ఆరా తీశారు. పెద్దపల్లి ఏసీపీ కృష్ణతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ ప్రమాదం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలు, గాయపడ్డ వారి పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వారికి తక్షణ సహాయం, మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమగ్ర విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీ.. ఏసీపీని ఆదేశించారు. కాగా సంఘటన స్థలాన్ని పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ వేణు, డీఎస్‌వో శ్రీనాథ్, డీఎం శ్రీకాంత్, సీఐ సుబ్బారెడ్డి, ఎస్సైలు శ్రావణ్ కుమార్, అశోక్ రెడ్డి సందర్శించారు.
