
హక్కులనేతగా, శాంతి చర్చల ప్రతినిధిగా, దళితుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడు.. చుండూరు, కారంచేడు, లక్ష్మీపేట ఉద్యమాలను ముందుండి నడిపిన నాయకుడు బొజ్జా తారకం. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల కోసం సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజా చైతన్యం కోసం బహుముఖ ప్రజ్ఞాశాలిగా అనేక రంగాల్లో సేవలందించిన ఘనత ఆయనకు దక్కుతుంది. అంబేద్కర్ వాదిగా అణగారిన వర్గాల గొంతులకు అండగా నిలిచి అనేక వివక్షత అంశాలను ప్రజల ముందు ఉంచారు. కారంచేడు దళితులపై జరిగిన ఊచకోతకు నిరసనగా హైకోర్టులో తాను నిర్వహిస్తున్న ప్రభుత్వ న్యాయవాద వృత్తికి రాజీనామా చేశారు. చుండూరు, కారంచేడు సంఘటనలకు స్పందించి 1985లో దళిత మహాసభ రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బహుజన సమాజ్ పార్టీ, అనంతరం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పరిచయం చేసి ఉద్యమాలు నడిపించిన నాయకుడుగా నిలిచారు.
శాంతి చర్చల ప్రతినిధి
న్యాయవాదిగా ఉంటూ నిజామాబాద్‌లో బీడీ కార్మికుల హక్కుల కోసం పోరాడారు. 1975లో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించడంతో హక్కుల నాయకులందరినీ నాటి ప్రభుత్వం అరెస్టు చేసింది. అందులో భాగంగా మీసా కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నిజామాబాద్ నుంచి చంచల్ గూడ జైలుకు తరలించారు. జైలు నుంచి విడుదలైన అనంతరం హైదరాబాద్‌కు నివాసం మార్చారు. హైదరాబాద్ హైకోర్టులో న్యాయవాద వృత్తి చేపట్టి అనేక ప్రజా ఉద్యమాలు, దళిత ఉద్యమాలలో పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నక్సలైట్లకు ప్రభుత్వానికి జరుగుతున్న యుద్ధంలో సాధారణ పౌరులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని పౌర సమాజం ముందుకు వచ్చింది. ప్రభుత్వం నక్సలైట్లతో చర్చలు జరపాలని శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేశారు. శాంతిచర్చల్లో బొజ్జా తారకం కీలక భూమిక పోషించారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కోసం కృషి
ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం కాకుండా ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తున్నారని బొజ్జా తారకం నిరసన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి సభలు, సమావేశాలు నిర్వహించారు. దేశంలోనే ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలని కోరారు. ఆ తర్వాత కాలంలో అది చట్టంగా మారింది. ప్రజా ఉద్యమాలు చేపడుతూనే న్యాయవాదిగా కొనసాగుతూ రచయితగా పత్రికా సంపాదకుడిగా సేవలందించారు. బొజ్జా తారకం కుమారుడు తెలంగాణ ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా, కూతురు డాక్టర్ మహిత ఉస్మానియా మెడికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్. 2014లో అనారోగ్యానికి గురైన బొజ్జా తారకం 16 సెప్టెంబర్ 2016 న తుది శ్వాస వదిలారు. ప్రజా ఉద్యమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహా నాయకుడు బొజ్జా తారకం వర్ధంతిని ఇయ్యాల దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
తొలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో..
బొజ్జా తారకం ఈస్ట్ గోదావరి జిల్లా కాట్రేనికోన మండలంలోని కందికుప్ప గ్రామంలో బొజ్జా అప్పలస్వామి, మావుళ్ళమ్మకు రెండో సంతానంగా 27 జూన్ 1939న జన్మించారు. బొజ్జా తారకం తండ్రి అప్పలస్వామి భారత స్వాతంత్ర్యం తరువాత దేశంలో 1952లో జరిగిన మొదటి ఎన్నికల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఏర్పాటుచేసిన షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ తరఫున శాసనసభ్యుడుగా ఎన్నికయ్యారు. ప్రముఖ రచయిత బోయి భీమన్న కూతురు డాక్టర్ విజయభారతితో వివాహం జరిగింది. డాక్టర్ విజయభారతికి నిజామాబాద్ ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా ఉద్యోగం రావడంతో నిజామాబాదుకు నివాసం మార్చారు. 1968 నుంచి 1978 వరకు నిజామాబాద్‌లోనే న్యాయవాద వృత్తి చేపట్టారు. అక్కడే తొలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు.
- అస
శ్రీరాములు