ఒక్క ఫోన్ కాల్ చేసి నిండా మునిగిన బీటెక్‌ బాబులు

ఒక్క ఫోన్ కాల్ చేసి నిండా మునిగిన బీటెక్‌ బాబులు
  • ఉద్యోగాల కోసం గూగుల్ లో వెదుకులాడారు
  • ఉద్యోగం కావాలంటే పోస్టును బట్టి ఖర్చులకు డబ్బు అడిగితే ఆన్ లైన్ లో పంపారు
  • మొత్తం 40 మంది దగ్గర రూ.27.30 లక్షలు వసూలయ్యాక ఫోన్ స్విచాఫ్
  • లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించిన బీటెక్ బాబులు

హైదరాబాద్: వారంతా ఇంజనీరింగ్ కోర్సులు చదివిన నిరుద్యోగులు. కుటుంబ పరిస్థితుల కారణంగా పై చదువుల కంటే ముందు ఏదైనా ఉద్యోగం చూసుకోవాలనే ఉద్దేశంతో గూగుల్ లో వెదుకులాట ప్రారంభించారు. ఒక వెబ్ సైట్ లో ఆకర్షణీయమైన ప్రకటన కనిపించింది. చదవిన కోర్సులో మార్కులను చూసి కాకుండా.. ముందుగా పనితీరు ఆధారంగా వేతనాలు నిర్ణయిస్తామంటూ ప్రకటించారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెంబరులో సంప్రదించమని సూచించారు. 
ఇంకేముంది ఉద్యోగం దొరకుతుందని సంబరపడ్డారు. అంతేకాదు మార్కుల కంటే ఉద్యోగంలో మనం చూపే పనితీరు ఆధారంగా వేతనాలు ఇస్తామనే షరతులు చూసి మరింత పొంగిపోయారు. గూగుల్ సెర్చ్ లోని ఒక వెబ్ సైట్ లో వచ్చిన ప్రకటన ఫోన్ నెంబర్ కు కాల్ చేశారు. ఫోన్ కాల్ ఎత్తిన వ్యక్తి హుందాగా మాట్లాడారు. నేనే సీఈఓను.. లిమిటెక్స్ పేరుతో మాదాపూర్ వద్ద  ఓ పెద్ద కంపెనీ పెట్టాను.. నేనే స్వయంగా ఉద్యోగులను తీసుకుంటున్నానని నమ్మబలికాడు. 
మన తెలంగాణ రాజధాని బంజారాహిల్స్ నడిబొడ్డులో మాదాపూర్  వద్ద ఉన్న ఆఫీసులో ఉద్యోగం దొరికినట్లేనని సంబరపడ్డారు. ఫోన్ లో చెప్పిన వ్యక్తికి ఆలస్యం చేయకుండా తమ తాహతుకు తగిన పోస్టు కోరుకుంటూ.. ఆన్ లైన్ లో సూచించినట్లు రూ.50 వేలు, లక్ష వరకు పంపుకున్నారు. డబ్బులు ఆన్ లైన్ లో ట్రాన్స్ ఫర్ చేశాక.. అదిగో.. ఇదిగో అంటూ అపాయింట్ మెంట్ లెటర్ కోసం కాలయాపన చేస్తుంటే వీరికి అనుమానం వచ్చింది. గట్టిగా నిలదీసేసరికి ఆ ఫోన్ స్విచాఫ్ లో పెట్టేశాడు. 
అనుమానంతో మాదాపూర్ ఏరియాలో వెదికిన వారికి, తెలిసిన వారితో ఆరా తీస్తే అక్కడ.. ఆ ప్రాంతంలో ఎక్కడా ‘లిమిటెక్స్’ పేరుతో ఎలాంటి ఆఫీసు లేదని తేలింది. మోసపోయామని గుర్తించిన పలువురు బీటెక్ అభ్యర్థులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు. బ్యాంకు అకౌంట్ నెంబర్ ఆధారంగా లిమిటెక్స్ కంపెనీ పేరుతో ఉన్న బ్యాంక్ ఖాతా వివరాల పై ఆరా తీశారు. ఉద్యోగ ప్రకటన చూసి దాదాపు 40 మంది ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు దాదాపు రూ.27.30 లక్షలు ఇచ్చుకున్నట్లు తేలింది. డబ్బులు పంపిన వారంతా ఉద్యోగంలో ఎప్పుడు చేరాలంటే మరుసటి రోజునుండే ఫోన్లు చేసి అడుగుతుంటే.. సదరు మోసగాడు.. దాట వేస్తూ వచ్చాడు. కొద్ది రోజుల తర్వాత ఏకంగా స్విచాఫ్ చేయడంతో అనుమానం నిజమేనని తేలింది. ఇప్పటి వరకు తేలిన బాధితులే కాకుండా మరికొంత మంది మోసపోయి ఉంటారని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.