
జార్ఖండ్ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గిరిధ్ జిల్లా పరిధిలో ప్రయాణికులతో వెళ్తోన్న ఆర్టీసీ బస్సు నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో 15 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ బస్సు రాంచీ నుంచి గిరిధ్ కు వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఆగస్టు 5వ తేదీ శనివారం ఆర్టీసీ బస్సు రాంచీ నుంచి గిరిధ్ కు వెళ్తోంది. అయితే రాత్రి 8.40 గంటల సమయంలో బరాకర్ నదిపై గల వంతెన మీద నుంచి బస్సు పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 30 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి బన్నా గుప్తా స్పందించారు. నదిలో గల్లంతైన ప్రయాణికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయిని తెలిపారు. సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించిందని... క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
బస్సు ప్రమాద ఘటనపై జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ స్పందించారు. తక్షణం సహాయ చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు. రాంచీ నుంచి గిరిధ్ వెళుతున్న బస్సు.. బరాకర్ నదిలో పడిపోవడం విచారకరం అని ట్వీట్ చేశారు. జిల్లా అధికార యంత్రాంగం సహాయ చర్యలు చేపట్టిందని తెలిపారు.