ఆకాశంలో ఎగురుతున్న బసుమంత (సీతాకోకచిలుకలు)లను, ఈర్పెన (తూనీగలు)లను తరుముతూ పరుగెడుతున్నాడు చందు. ‘అరేయ్ ఆగరా!’ అంటూ చందు వెనుక పడ్డాడు రాజేష్. చందు చేతిలో పొరక ఉంది. ఒక్కసారిగా ఆగి వెనుకకు చూశాడు. రాజేష్ భయంతో దూరంగానే నిల్చున్నాడు. చేతిలోని పొరకతో చందు కొడతాడని భయపడ్డాడు. వెంటనే చందు రాజేష్ వెంటపడ్డాడు. రాజేష్ ముందు చందు వెనుక. పరుగెడుతూనే ఉన్నారు.
అది పాఠశాల మైదానం. సాయంత్రం నడకకు వచ్చిన బానయ్య అనే ఊరి పెద్ద వాళ్లను చాలాసేపటి నుంచి గమనిస్తున్నాడు. పరుగెడుతోన్న వాళ్లిద్దరినీ ఆపాడు. పొరకతో తనను కొట్టడానికి వస్తున్నాడని చందు మీద ఫిర్యాదు చేశాడు రాజేష్.
అదేం లేదు నేను రాజేష్ దగ్గరికి వస్తుంటే వాడు పరుగెత్తుతున్నాడు. ఆగమంటే ఆగటం లేదు. ఇప్పుడేమో నేను కొట్టడానికి వస్తున్నా అంటున్నాడు. అంతా అబద్ధం’’ అని బుంగ మూతి పెట్టాడు.
విషయం అర్థమైన బానయ్య చిరునవ్వు నవ్వాడు. చేతిలో పొరక ఉండటం వల్ల రాజేష్ భ్రమపడిన సంగతి వివరించేసరికి పిల్లలిద్దరూ ముసి ముసి నవ్వులు నవ్వారు.
‘‘అది సరే కానీ నేను చాలా సమయం నుంచి చూస్తున్నాను. నువ్వు పొరకను గాలిలో ఆడిస్తూ ఒక్కనివే ఆడుకుంటున్నావు. నువ్వాడే ఆట పేరేంది” అన్నాడు చందుతో బానయ్య.
‘‘ఓ అదా! నేను ఈర్పెనలు, బసుమంతలను పట్టుకుంటున్నాను. వాటిని అదిగో ఆ కనిపించే చెట్టు కింద బొంద పెడతాను. నాకు బోలెడు డబ్బులు వస్తాయి అన్నాడు చందు. బానయ్యకి చందు చెప్పే విషయం అర్థం కాలేదు. రాజేష్ చందు ఏమన్నాడో నీకేమైనా అర్థమైందా? అనడంతో ముందు రోజు జరిగిన విషయం అంతా చెప్పాడు. ఊళ్లో కొందరు కొంటె కోనంగులు బసుమంతల్ని, ఈర్పెనల్ని చంపి బొంద పెడితే ఐదు రోజుల తరువాత అందులో పైసలు తయారయితాయ’’ని చెప్పిన సంగతి బానయ్యకి చెప్పాడు. అప్పుడు బానయ్యకి చందు ఎందుకలా చేశాడో అర్థమయింది.
చందును, రాజేష్‌ను దగ్గరకు తీసుకున్నాడు బానయ్య. ‘‘అలా బసుమంతల్ని, ఈర్పెనలను చంపకూడదు. వాటిని బొందపెడితే డబ్బులు రావు. మీతో ఇలా చెప్పిన వాళ్లు మీకు అబద్ధం చెప్పారు. ఈ విషయం గురించి మీ అమ్మానాన్నలకు చెప్పండి. నిజమేంటో చెప్తారు. రేపు బడిలో మీ తరగతి ఉపాధ్యాయుడికి కూడా ఈ విషయం చెప్పండి. అప్పుడే నేను చెప్పేది నిజమో, మీ మిత్రులు చెప్పింది నిజమో తెలుస్తుంది. సరేనా! మన చుట్టూ అవన్నీ బతికి ఉంటేనే ప్రకృతి అందంగా ఉంటుంది. ఏ జీవినీ చంపే హక్కు మనకు లేదు.
జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి’’ అని ప్రేమగా ఇద్దరి భుజాలు తట్టాడు బానయ్య. ఆయనకి ‘బై’ చెప్పి ఇద్దరూ బయలుదేరారు.రాజేష్, చందు తెల్లారి పాఠశాలలో ముందు రోజు జరిగిన విషయం అంతా తమ ఉపాధ్యాయుడు సంతోష్ సారుకు చెప్పారు. ఆయన బానయ్య చెప్పిందే నిజమని, ‘‘ఇక నుంచి మీరెవరు కూడా అలా ఈర్పెనలను కానీ బసుమంతల్ని కానీ పక్షులను కానీ చంపకూడద’’ని అన్నాడు. వాటి గురించి ప్రత్యేకంగా ఒక పాఠమే చెప్పాడు. పాఠం వింటూనే తమ ఇళ్లల్లో తల్లిదండ్రులు చెప్పిన విషయం గురించి ఒకరికొకరు చెప్పుకున్నారు. సంతోష్ సారు పాఠం ముగించగానే స్వల్ప విరామం గంట మోగింది. మిత్రులిద్దరూ మైదానంలోకి పరుగుతీశారు. బసుమంతల్ని, ఈర్పెనల్ని రమ్మంటూ రెండు చేతులను చాచి నిలబడ్డారు. చేతి మీద వాలితే ముద్దు పెట్టుకుందామని!
తోకల రాజేశం
