ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో హైదరాబాద్​కు లింక్

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో హైదరాబాద్​కు లింక్
  • సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలు
  • ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలపై కేసు నమోదు  
  • డిప్యూటీ సీఎం ఇంటితో పాటు ఏడు రాష్ట్రాల్లోని 20 చోట్ల దాడులు 
  • ఎక్సైజ్ పాలసీ వెనక రూ. కోట్లు చేతులుమారాయని ఆరోపణలు 
  • మొత్తం 16 మందిపై కేసు.. ఏ‑1గా సిసోడియా
  • ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో హైదరాబాద్​కు లింక్
  • 14వ నిందితుడిగా అరుణ్‌ రాంచంద్ర పిళ్లై.. ఆయన ఇంట్లోనూ సోదాలు

న్యూఢిల్లీ:   ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవినీతికి సంబంధించిన కేసులో సీబీఐ శుక్రవారం ఢిల్లీ డిప్యూటీ సీఎం, విద్యా, ఎక్సైజ్ శాఖల మంత్రి మనీశ్ సిసోడియా అధికారిక నివాసంలో సోదాలు నిర్వహించింది. ఉదయం 8 గంటలకు మొదలైన సోదాలు రాత్రి 8 వరకూ సుదీర్ఘంగా కొనసాగాయి. సెంట్రల్ ఢిల్లీలోని సిసోడియా అధికారిక నివాసంతో పాటు 7 రాష్ట్రాల్లోని 20 చోట్ల కూడా ఏకకాలంలో సీబీఐ దాడులు జరిగాయి. నిరుడు నవంబర్​లో తెచ్చిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీతో సంబంధం ఉన్న ఐఏఎస్ అధికారులు, ఇతరుల ఇండ్లలో తనిఖీలు కొనసాగాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవినీతిపై సీబీఐతో ఇన్వెస్టిగేషన్ చేయించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా కేంద్ర హోం మినిస్ట్రీకి సిఫారసు చేయగా.. కేంద్రం ఆదేశాల మేరకు సీబీఐ ఈ నెల 17న కేసును నమోదు చేసింది. మొత్తం 16 మందిపై నేరపూరిత కుట్ర, రికార్డుల మార్పు, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. శుక్రవారంనాటి తనిఖీల్లో ఓ పబ్లిక్ సర్వెంట్ ఇంటి నుంచి ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన సీక్రెట్ ఫైళ్లను సీబీఐ స్వాధీనం చేసుకుందని, సోదాలు కొనసాగుతాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి.  

మొదటి నిందితుడిగా సిసోడియా 

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ మొత్తం 16 నిందితుల పేర్లను నమోదు చేసింది. సిసోడియాను మొదటి నిందితుడిగా చేర్చింది. ఆ తర్వాత అప్పటి ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీ కృష్ణ, అప్పటి డిప్యూటీ కమిషనర్ ఆనంద్ కుమార్ తివారీ, అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ పంకజ్ భట్నాగర్​ల పేర్లను చేర్చింది. వీరితో పాటు సిసోడియా సన్నిహితులు, వ్యాపారవేత్తలు 9 మందిని, 2 కంపెనీలను నిందితులుగా చేర్చింది. అలాగే 16వ అక్యూజ్డ్​గా ప్రైవేట్ వ్యక్తులను పేర్కొంది. టెండర్ల తర్వాత లైసెన్స్​లు పొందినవాళ్లకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే సిసోడియా, ఇతర అధికారులు ఎక్సైజ్ పాలసీని రూపొందించారని, దీనిపై కాంపీటెంట్ అథారిటీ ఆమోదం తీసుకోలేదని సీబీఐ ఆరోపించింది.   

ఈడీ కూడా రంగంలోకి? 

ఎక్సైజ్ పాలసీ కేసులో పేర్కొన్న అక్రమ లావాదేవీలపై ఈడీ​ కూడా దృష్టిసారించనున్నట్లు  అధికారిక వర్గాలు తెలిపాయి.

ఇదీ కేసు.. 
సీబీఐ వివరాల ప్రకారం.. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021–22 రూపకల్పన, అమలులో లిక్కర్ కంపెనీలు, మధ్యవర్తులు ఇన్వాల్వ్ అయ్యారు. సిసోడియాకు సన్నిహితులైన అమిత్ అరోరా, దినేశ్ అరోరా, అర్జున్ పాండేలు లిక్కర్ లైసెన్స్​లు పొందిన బిజినెస్​మెన్ నుంచి కమీషన్ కలెక్ట్ చేసి.. పబ్లిక్ సర్వెంట్లకు ట్రాన్స్ ఫర్ చేశారు. ఇండో స్పిరిట్స్ ఓనర్ సమీర్ మహేంద్రు రూ.కోటి మొత్తాన్ని దినేశ్ ఆధ్వర్యంలోని రాధా ఇండస్ట్రీస్ కంపెనీ అకౌంట్​కు బదిలీచేశారు. అర్జున్ పాండేకు మరో 2 నుంచి 4 కోట్లు పంపారు. ఎక్సైజ్ పాలసీ తయారీ, అమలులో అక్రమాలు జరిగాయి. ఇందులో విజయ్ నాయర్, మనోజ్ రాయ్, అమన్ దీప్ ధాల్, సమీర్ మహేంద్రు కీలక పాత్ర పోషించారు. పాలసీ వల్లే సన్నీ మార్వాకు చెందిన మహదేవ్ లిక్కర్స్​కు ఎల్-1 లైసెన్స్ దక్కింది. సన్నీ మార్వా ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆఫీసర్లకు లంచాలు ఇచ్చారు. ఈ పాలసీలో అక్రమాలపై తొలుత ఢిల్లీ పోలీసు శాఖలోని ఆర్థిక నేరాల విభాగం ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. దీంతో ఈ ఏడాది జులై 30న పాలసీని విత్ డ్రా చేసుకున్నారు. తాజాగా ఎల్జీ సిఫారసుతో సీబీఐ దర్యాప్తు ప్రారంభమైంది.   

అభివృద్ధిని ఓర్వలేకే దాడులు: సిసోడియా 

గవర్నమెంట్ లిక్కర్ ఔట్​లెట్లలో అవినీతిని కట్టడి చేసేందుకే కొత్త పాలసీ తెచ్చామని సిసోడియా అన్నారు. హెల్త్, ఎడ్యుకేషన్ రంగాల్లో ఢిల్లీ ప్రభుత్వం సాధిస్తున్న అభివృద్ధిని ఓర్వలేక కేంద్రం ఆ రెండు శాఖల మంత్రులను టార్గెట్ చేస్తోందన్నారు. హెల్త్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ ఇప్పటికే  జైలులో ఉన్నారన్నారు. సీబీఐ సోదాలను ఆహ్వానిస్తున్నట్లు అంతకుముందు ఆయన ట్వీట్ చేశారు.