సుప్రీంకోర్టులో కొత్త జడ్జీల నియామకానికి కేంద్రం ఆమోదం

సుప్రీంకోర్టులో  కొత్త జడ్జీల నియామకానికి కేంద్రం ఆమోదం

అత్యున్నత న్యాయస్థానం  సుప్రీంకోర్టులో  కొత్త న్యాయమూర్తుల నియామకానికి కేంద్రం ఆమోదం తెలిపింది.  ఐదుగురు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులను కేంద్రం ఆమోదించింది.  రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్  పంకజ్ మిథాల్, పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజయ్ కరోల్, మణిపూర్ హైకోర్టు చీఫ్ జస్టిస్  పీవీ సంజయ్ కుమార్, పాట్నా హైకోర్టు న్యాయమూర్తి అహ్సానుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి మనోజ్ మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. ఈ ఐదుగురి నియామకాలకు వారంట్స్ ఆఫ్ అపాయింట్‌మెంట్ జారీ అయిన నేపథ్యంలో.. వచ్చే వారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది జడ్జీలు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం చీఫ్‌ జస్టిస్‌ సహా 27 మంది న్యాయమూర్తులు ఉన్నారు. తాజాగా ఐదుగురు కొత్తగా నియమితులు కావడంతో సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 32కు పెరిగింది.


కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు మధ్య కొలీజియం అంశంపై గత రెండు నెలలుగా వాదోపవాదాలు జరిగాయి. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల అపాయింట్‌మెంట్‌ను కేంద్రం జాప్యం చేసింది. దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎస్‌కే కౌల్, ఏఎస్ ఓకా కేంద్రంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో దిగొచ్చిన కేంద్రం కొత్త న్యాయమూర్తుల నియామకాన్ని రెండు రోజుల్లో క్లియర్‌ చేస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది.  ప్రధాన మంత్రి కార్యాలయం ఫిబ్రవరి 2న ఈ సిఫారసులకు ఆమోదం తెలిపి ..ఆ ఫైలును రాష్ట్రపతి భవన్‌కు పంపింది. రాష్ట్రపతి ఆమోదం కూడా లభించడంతో ఐదుగురు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.