
న్యూఢిల్లీలోని ద్వారకా నార్త్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని సీఐఎస్ఎఫ్ క్యాంప్, ద్వారకా సెక్షన్ -16 లో జవాన్ ఆత్మహత్యకు సంబంధించిన కాల్ వచ్చిన వెంటనే ద్వారకా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
ఘటనాస్థలంలో జవన్ ప్లాస్టిక్ తాడుతో చెట్టుకు ఉరివేసుకుని కనిపించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని కిందకు దించి.. పోస్ట్ మార్టం కోసం ఢిల్లీలోని హరి నగర్‌లోని డీడీయూ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య చేసుకున్న జవాన్ ను శివ ప్రభుగా పోలీసులు గుర్తించారు.
27 ఏళ్ల శివ ప్రభు అనే జవాన్ తమిళనాడులోని మధురై నివాసి అని, సీఐఎస్‌ఎఫ్ మెట్రో యూనిట్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న క్రైమ్ టీమ్ ఘటనా స్థలాన్ని పరిశీలించిందని.. దర్యాప్తు ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ఈ ఘటనపై ఎస్‌డిఎం ద్వారకకు కూడా సమాచారం అందించామని పోలీసులు తెలిపారు.