మనకు ఎన్నికలు ఎలా వచ్చినా.. ఎప్పుడొచ్చినా పర్వాలేదు : సీఎం జగన్

మనకు ఎన్నికలు ఎలా వచ్చినా.. ఎప్పుడొచ్చినా పర్వాలేదు : సీఎం జగన్

సచివాలయంలో ఏపీ క్యాబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ఏపీ క్యాబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది.  భేటీలో జమిలీ ఎన్నికల ప్రస్తావన కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని మంత్రి వర్గ సహచరులకు సీఎం జగన్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కేంద్రంతో పాటు ఎన్నిలకు సిద్ధమవ్వాలని సీఎం మంత్రులకు సూచించారు. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా సిద్దంగా ఉండాలని మంత్రులకు దిశా నిర్దేశం చేశారు సీఎం జగన్.  అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు స్కాములపైనే ప్రధానంగా చర్చిద్దామని మంత్రి వర్గ సహచరులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ సమవేశాలను అందరూ సీరియస్ గా తీసుకోవాలని..  ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది.       

ఇంకా ఈ సమావేశంలో  పలు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్‌ అమలు బిల్లుకు ఆమోదం తెలపడంతో పాటు, ఉద్యోగి రిటైర్‌ అయిన సమయానికి ఇంటి స్థలం లేనివారికి కచ్చితంగా ఇంటిస్థలం ఉండాలని, ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని నిర్ణయించింది. అలాగే రిటైర్‌ అయిన తర్వాత కూడా ఉద్యోగులు, వారి పిల్లలు కూడా ఆరోగ్య శ్రీ కింద అందరూ కవర్‌ అయ్యేలా చూడాలని, విరమణ తర్వాత కూడా పిల్లల చదువులకు ఫీజు రియింబర్స్‌‌‌మెంట్‌ కింద కూడా ప్రయోజనాలు అందేలా చూడాలని, ఇందుకు కావాల్సిన చర్యలను ప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయించింది.

ALSO READ : బీజేపీ మీడియా పాయింట్ తరలింపు : సెంటిమెంట్ అంటున్న నేతలు

రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్శిటీల చట్టంలో సవరణపై బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రఖ్యాత యూనివర్శిటీలతో సంయుక్త సర్టిఫికేషన్‌ ఉండేలా చట్ట సవరణ, ఇందులో చదువుతున్న విద్యార్థుల డిగ్రీలకు జాయింట్‌ సర్టిఫికేషన్‌, ప్రైవేటు యూనివర్శిటీల్లో కూడా నాణ్యత ఉండేలా ఈ  మార్పులను చేయడం వల్ల పిల్లలకు మంచి జరుగుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  అధ్యక్షతన జరిగిన సమావేశం ఆశాభావం వ్యక్తం చేసింది. ఇలా మొత్తం 49 అంశాల‌పై చర్చించిన ఏపీ కేబినెట్‌.. ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లు, జగనన్న ఆరోగ్య సురక్ష పథకం పనితీరు, ఆంధ్రప్రదేశ్ ఆధార్ సవరణ బిల్లు, భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లు వంటి వాటిపై చర్చించింది.