
- మాస్టర్‍ప్లాన్ ఊసులేదు.. సెంట్రల్‍జైల్‍ముచ్చట లేదు.. ఐటీ హబ్ జాడలేదు
- నేడు మరోసారి గ్రేటర్ వరంగల్ పర్యటనకు మంత్రి కేటీఆర్
- వచ్చిన ప్రతిసారీ కొత్త ప్రకటనలు, శంకుస్థాపనలు
- ఇప్పటికీ పూర్తికాని పనులు
వరంగల్, వెలుగు: జిల్లాకు మంత్రి కేటీఆర్ వస్తున్నాడనగానే.. ‘20 నుంచి 30 పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. గులాబీ లీడర్ల హంగామా.. ప్రతిపక్షాల అరెస్ట్లు, చివర్లో పార్టీ సభ’ ఇవి తప్పకుండా ఉంటాయి. ప్రకటనలు, హామీలు ఇవ్వడంతో కేటీఆర్ టూర్ ముగుస్తుంది. గడిచిన ఏడెనిమిదేండ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ గ్రేటర్ వరంగల్ పర్యటనలో ఇచ్చిన ఎన్నో హామీలు ఇప్పటికీ ఉత్తముచ్చటగానే మిగిలాయి. తాము ఇచ్చిన హామీలు, చేసిన శంకుస్థాపన పనులు పూర్తి కాకముందే మంత్రి కేటీఆర్ మరోసారి గ్రేటర్లో పర్యటించనున్నారు. ఈ సారి కూడాకొన్ని శంకుస్థాపనలు చేయబోతున్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో యంగ్‍వన్‍కంపెనీ, సిటీలో కొత్త కలెక్టరేట్, వరంగల్‍బస్టాండ్, ఇన్నర్‍రింగ్‍రోడ్ పనులను ప్రారంభించి వెళ్తారు. పాతపనులకు మోక్షం లేకపోయినా.. కొత్తపనులకు పునాదిరాయి వేయడం ఏంటని స్థానిక లీడర్లు అనుకుంటున్నారు.
నేరవేరని హామీలు..
మాస్టర్ ప్లాన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సాగదీతకు ఏండ్లు గడుస్తున్నాయి. 24 అంతస్తుల హాస్పిటల్ కడుతామనే పేరుతో దేశంలోనే ఎంతో ప్రత్యేకత సంపాదించుకున్న వరంగల్ సెంట్రల్‍జైల్‍ను కూలగొట్టారు. మామునూర్ ఫోర్త్ బెటాలియన్ స్థలంలో ఓపెన్ సెంట్రల్ కడుతామని, నేరుగా తానే వచ్చి శంకుస్థాపన చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. సిటీకి ఐటీ కంపెనీలు రావాలన్నా.. హైదరాబాద్‍స్థాయిలో వరంగల్ డెవలప్ కావాలన్నా మామూనూర్ ఎయిర్పోర్ట్ రీ ఓపెన్ చేయాలని, త్వరలోనే అక్కడి నుంచి విమానాలు ఎగిరేలా చూస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‍మెట్రో లాగా వరంగల్లో నియో రైల్‍పరుగులు పెట్టిస్తామన్నారు.
శిల్పారామానికి ఇంకా స్థలమే ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం 2015లో రూ.వెయ్యి కోట్ల విలువ చేసే కాజీపేట పీఓహెచ్(పీరియాడికల్ ఓవర్‍హలింగ్), వ్యాగన్ రిపేర్కు ప్రాజెక్ట్ ఇచ్చింది. వెంటనే రూ.200 కోట్లు ఫండ్ మంజూరు చేసింది. దానికి అవసరమైన 150 ఎకరాల భూములు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వలేకపోయింది. పనులు ప్రారంభించడానికి రైల్వే అధికారులు అడిగిన 10.17 ఎకరాల స్థలం ఇవ్వక ప్రాజెక్ట్ పెండింగ్లో ఉంది.
అన్ని జిల్లాల జర్నలిస్ట్లు అసూయపడేలా వరంగ్లో మోడల్ జర్నలిస్ట్ కాలనీ కడుతామని అది ఇతర జిల్లాలకు ఆదర్శంగా ఉంటుందని సీఎం కేసీఆర్ 2016 లో చెప్పారు. 10 నెలల్లో ఇండ్లకు ఇనాగ్రేషన్ చేయాలన్నారు. ఎనిమిదేండ్లు అవుతున్నా కనీసం జాగా కేటాయించలేదు. రెండేళ్ల క్రితం మంత్రి కేటీఆర్ వచ్చి స్థలం కేటాయించాం. పనులు షురూ అవుతాయన్నారు. కాగా, అప్పటికే వేరే వాళ్లకు కేటాయించిన భూములను జర్నలిస్టులకు తెలియక ఇచ్చారని ఎమ్మెల్యేలు మాటమార్చారు.
పూర్తికాని పనులు
గ్రేటర్‍వరంగల్‍సిటీ లో సగం కాలనీల్లో డ్రైనేజీలు సరిగా లేవు. 2020 వానలకు సి టీ అతలాకుతలమైంది. మంత్రి కేటీఆర్ వచ్చిపరిశీలించారు. శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. అధికారులు 2021లో ఫీల్డ్ విజిట్ చేశారు. వరంగల్లో 52, కాజీపేట సర్కిల్‍లో 86 ముంపు కాలనీలు ఉన్నట్లు తేల్చారు. నాలాల విస్తరణ, రిటైనింగ్‍వాల్‍నిర్మాణాలు చేపడతామన్నారు. తీరాచూస్తే సకాలంలో బిల్లులు రాకపోవడంతో పనులన్నీ మధ్యలోనే ఆగాయి. ట్రైసిటీ పరిధిలో లో ఇంటిగ్రేటెడ్ వెజ్‍అండ్ నాన్‍వెజ్ మార్కెట్ పిల్లర్లు దాటడం లేదు. ప్రతిసారి రివ్యూలో మాట్లాడుకునే కాళోజీ కళాక్షేత్రం పనులు మధ్యలోనే ఆగిపోయాయి. మడికొండ బయో మైనింగ్‍పనులు చేయకపోవడంతో డంపింగ్ యార్డ్లో చెత్త మండుతోంది. కేయూ, కాజీపేట వంద ఫీట్ల రోడ్డులో చేపట్టిన పనులకు నాలుగు డెడ్‍లైన్లు దాటిన ఇంకా పూర్తికాలే.
భద్రకాళి అమ్మవారి భూములను వదలట్లే
ప్రభుత్వ, ప్రైవేట్‍భూములు అనే తేడా లేకుండా ఎక్కడా ఖాళీ జాగ కనిపిస్తే అక్కడ కబ్జాదారులు ప్రత్యక్షమవుతున్నారు. ఇందులో 80 శాతం అధికార పార్టీ ఎమ్మెల్యేల అనుచరులు, కార్పొరేటర్ల చేతిలో నడుస్తున్నాయి. ఇది నిజమన్నట్లుగా పలువురు బీఆర్‍ఎస్‍పార్టీ కార్పొరేటర్లు కబ్జాల కేసుల్లో జైల్‍వరకు వెళ్లొచ్చారు. వరంగల్ సీపీ రంగనాథ్ ఓ వైపు ఇలాంటివారి దృష్టి పెట్టినా కొందరు లీడర్లు తమ దందా ఆపడంలేదు. ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి చెరువునే కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎఫ్‍టీఎల్‍పరిధిలో రాత్రికిరాత్రి మట్టితో చదును చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు అలాంటివారికి సపోర్ట్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కట్టడి చేయాల్సిన అధికారులు అటువైపు చూడటంలేదు. దీంతో గ్రేటర్ వరంగల్‍అంటేనే భూకబ్జాల సిటీ అనే అపవాదు వస్తోంది.