దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యులతో రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. దేశంలోనే తెలంగాణ వేగంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని అన్నారు. మన దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ... ఆర్థికంగా తెలంగాణ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపారు. తెలంగాణను ది ఫ్యూచర్ స్టేట్ గా పిలుస్తాన్నమని చెప్పారు రేవంత్ .
భారీ రుణ భారం తెలంగాణకు సవాల్ గా మారిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రుణ భారం రూ.6.85 లక్షల కోట్లకు చేరుకుందని... ఇందులో బడ్జెట్ రుణాలతో పాటు ఆఫ్- బడ్జెట్ రుణాలు ఉన్నాయని చెప్పారు. గత పదేళ్లలో ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుందన్నారు. రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం రుణాన్ని తిరిగి చెల్లించడానికే వెచ్చించాల్సిన పరిస్థితిని తీసుకొచ్చిందన్నారు. రుణాలు, వడ్డీ చెల్లింపులు ఇప్పుడు సక్రమంగా నిర్వహించకపోతే రాష్ట్ర పురోగతిపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో రుణాల సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణకు తగిన సహాయం, మద్దతు ఇవ్వాలని కోరారు రేవంత్
రుణాన్ని రీ స్ట్రక్చర్ చేసే అవకాశం ఇవ్వండి.. లేదా అదనపు ఆర్ధిక సహాయాన్ని అందించాలని సీఎం రేవంత్ కోరారు. కేంద్ర పన్ను ల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41% నుంచి 50%కి పెంచాలని కోరారు.. అన్ని రాష్ట్రాల తరపున ఈ డిమాండ్‌ను మీ ముందు ఉంచుతున్నామని తెలిపారు. ఈ డిమాండ్ ను మీరు నెరవేర్చితే.. దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ ఎంచుకున్న లక్ష్య సాధనకు తాము సంపూర్ణంగా సహకారిస్తామన్నారు.
Also Read:-వచ్చే వారం అంతా ఎండలే..వర్షాలు లేవు
తెలంగాణను ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణకు తగినంత సహాయం అందిస్తే... దేశాన్ని ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో తమ వంతు బాధ్యతను నేరవేరుస్తామని చెప్పారు. తెలంగాణ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు మీ సిఫారసులు ఉపయోగపడతాయన్నారు రేవంత్ రెడ్డి.