
- ఆ ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభించండి
- అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
- హైదరాబాద్‌లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన
- వందేండ్ల అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికలు
- మూసీకి చెరువులు, కుంటలు, నాలాలు అనుసంధానం
- అధికారులతో అత్యవసర సమావేశంలో సీఎం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసినప్పుడల్లా తలెత్తే వరద సమస్యను పరిష్కరించడానికి మూసీ పునరుజ్జీవమే శాశ్వత మార్గమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ‘‘నగరంలో డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. అన్ని వైపుల నుంచి వచ్చే వరద మూసీకి చేరేలా చూడాలి. 55 కిలోమీటర్ల పొడవునా మూసీని పునరుద్ధరించడం వల్ల నది పరీవాహక ప్రాంతాలు, కాలనీలు ముంపునకు గురికాకుండా ఉంటాయి. వరద నీటి నిర్వహణకు వీలుగా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును డిజైన్ చేయాలి. వందేండ్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ప్రణాళికలు రూపొందించాలి” అని సూచించారు.
ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వెంటనే శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో అధికారులతో సీఎం రేవంత్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల తలెత్తిన ఇబ్బందులు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై చర్చించారు. వాతావరణ మార్పుల కారణంగా తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురుస్తున్నదని, 5 సెంటీమీటర్ల వర్షం కురిసినా.. ఆ వరదను తట్టుకునేలా ప్రస్తుత డ్రైనేజీ వ్యవస్థ లేదని సీఎం అన్నారు. గురువారం రాత్రి కేవలం 4 గంటల్లోనే కొన్ని ప్రాంతాల్లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు వివరించగా.. ఇలాంటి విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు విపత్తుల నివారణ, నిర్వహణ ప్రణాళికను అమలు చేయాలని ఆదేశించారు.
త్వరగా నాలాల విస్తరణ..
మూసీని పునరుద్ధరించి, అందులో స్వచ్ఛమైన నీళ్లు ప్రవహించేలా చేస్తే హైదరాబాద్ నీటి కష్టాలు తీరుతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కలుషితమైన మూసీ నీటితో నది పరీవాహక ప్రాంతాల్లోని రైతులు పంటలు పండిస్తున్నారని, దీంతో ప్రజలు అనారోగ్యం బారినపడుతున్నారని పేర్కొన్నారు. ఇకపై ఈ పరిస్థితి తలెత్తకుండా శుద్ధి చేసిన నీళ్లే మూసీలోకి చేరేలా శాశ్వత ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. డ్రైనేజీల ద్వారా వచ్చే నీటిని సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల (ఎస్టీపీ) ద్వారా శుద్ధి చేసి మూసీలోకి పంపించాలని సూచించారు.
శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలు, ఇతర అవసరాలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా వినియోగించుకునే వీలుంటుందన్నారు. హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు, మీరాలం చెరువుతో పాటు అన్ని చెరువులను, కుంటలను నాలాల ద్వారా మూసీకి అనుసంధానం చేయాలని సూచించారు. చెరువుల పునరుద్ధరణ, నాలాల విస్తరణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ట్రాఫిక్ సమస్యపై ఫోకస్..
నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు కూడా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించడానికి చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం, హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి ప్రాంతాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ జోన్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. దీనివల్ల రోడ్లపై వాహనాల రద్దీ తగ్గి, పార్కింగ్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ సెక్రటరీ ఇలంబర్తి తదితరులు పాల్గొన్నారు.