సీపీఆర్ పై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం : కలెక్టర్ ఆదర్శ్ సురభి

సీపీఆర్ పై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం : కలెక్టర్  ఆదర్శ్  సురభి

వనపర్తి, వెలుగు: అత్యవసర సమయంలో సీపీఆర్  చేసేలా ప్రతి ఒక్కరికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని వనపర్తి కలెక్టర్  ఆదర్శ్  సురభి ఆదేశించారు. సోమవారం తన ఛాంబర్ లో  సీపీఆర్, క్యాన్సర్, క్షయ, సీజనల్  వ్యాధులు, మధుమేహం, ఆర్బీఎస్కే ప్రోగ్రాంపై రివ్యూ చేశారు.  ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ ఇటీవల అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి చాలా మంది చనిపోతున్నారని, దీనిని నివారించేందుకు సీపీఆర్ పై జిల్లాలో సాధ్యమైనంత ఎక్కువ మందికి శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్​వోను ఆదేశించారు. 

ముందుగా జిల్లా అధికారులు, పోలీసులు, జిమ్  ట్రైనర్లు, పీఈటీలు, ఆశా వర్కర్లు, ల్యాబ్  టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాటరాక్ట్  సర్జరీలు చేసేందుకు అవసరమైన డాక్టర్లు, థియేటర్  అందుబాటులోకి వచ్చాయని, దీనిని సద్వినియోగం చేసుకునేలా ప్రచారం చేయాలన్నారు. క్యాన్సర్  వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు పరీక్షలు నిర్వహించాలన్నారు. డీఎంహెచ్​వో శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్​వో శ్రీనివాస్, ప్రోగ్రాం ఆఫీసర్​ సాయినాథ్ రెడ్డి, డాక్టర్లు పరిమళ, రియాశ్రీ పాల్గొన్నారు.