పెండింగ్ దరఖాస్తులను వారంలో పరిష్కరించాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

పెండింగ్ దరఖాస్తులను వారంలో పరిష్కరించాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం టౌన్, వెలుగు : ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న185 ప్రజావాణి దరఖాస్తులను 7 రోజుల్లో పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంపై ప్రజలలో నమ్మకం కలిగించాలన్నారు. ఫిర్యాదుదారుల సమస్యలను స్వయంగా విని వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు ప్రతీ వారం మండల అధికారులతో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై సమీక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ వో ఏ. పద్మశ్రీ, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవోకే శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

కేఎంసీలో.. 

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇంటిపన్నులు, ఇంటి నెంబర్లు, శానిటేషన్ ఇతరేతర సంస్థలపై ఆయా డివిజన్ ప్రజల నుంచి వచ్చిన సమస్యలను పరిష్కరించాలని  కమిషనర్ అభిషేక్ అగస్త్య సంబంధిత అధికారులను ఆదేశించారు. కేఎంసీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో కమిషనర్ కు ప్రజలు అర్జీలను అందజేశారు. సోషల్ వెల్ఫేర్, మైనార్టీ, బీసీ వెల్ఫేయిర్ గురుకుల హాస్టల్స్ ను సోమవారం ఆయన విజిట్ చేసి వసతులపై సమీక్షించారు. 

కొత్తగూడెంలో.. 

భద్రాద్రికొత్తగూడెం  : కొత్తగూడెంలోని కలెక్టరేట్​లో నిర్వహించిన గ్రీవెన్స్​లో అడిషనల్​ కలెక్టర్​ డి. వేణుగోపాల్​ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీవెన్స్​లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఆఫీసర్లను ఆదేశించారు. తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో దూరం నుంచి ప్రజలు గ్రీవెన్స్​కు వస్తున్నారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాలని సూచించారు. ఈ ప్రోగ్రాంలో స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్​ విద్యాచందన పాల్గొన్నారు.