దసరా రోజు గృహ ప్రవేశాలు జరుపుకోండి : కలెక్టర్ హనుమంతరావు

 దసరా రోజు గృహ ప్రవేశాలు జరుపుకోండి : కలెక్టర్ హనుమంతరావు

యాదగిరిగుట్ట, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పనులు త్వరగా పూర్తి చేసి, దసరా రోజు గృహ ప్రవేశాలు జరుపుకోవాలని లబ్ధిదారులకు కలెక్టర్ హనుమంతరావు సూచించారు. బొమ్మలరామారం మండలం రంగాపురంలో నిర్మాణంలోని ఇండ్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. గ్రామానికి మొత్తం ఎన్ని ఇండ్లు మంజూరయ్యాయి.. ఎన్ని నిర్మాణంలో ఉన్నాయని అధికారులను ఆరా తీశారు. ఇంకా పనులు మొదలు పెట్టని వారుంటే వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటివరకు పూర్తయిన పనులకు సంబంధించి డబ్బులు వచ్చాయా.. అని లబ్ధిదారులను అడిగారు. ఇండ్లు నిర్మిస్తున్న మేస్త్రీలకు స్క్వేర్ ఫీట్ కు రూ.300 కంటే ఎక్కువ ఇవ్వొద్దని చెప్పారు. 

అకౌంట్లలో డబ్బులు జమయ్యేటప్పుడు ఎవరైనా డబ్బులు అడిగితే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఇటుక, సిమెంట్, స్టీల్ తదితర మెటీరియల్ తక్కువ ధరకు వచ్చేలా అధికారులు చూడాలన్నారు. అనంతరం తహసీల్దార్ ఆఫీస్​ను తనిఖీ చేశారు. భూభారతి దరఖాస్తులను పరిశీలించారు. నిర్ణీత గడువులోపు అన్ని దరఖాస్తులు పరిష్కరించాలని సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో బూత్ లెవెల్ ఆఫీసర్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు.