ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి : కుమార్ దీపక్

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి :  కుమార్ దీపక్
  • కలెక్టర్ కుమార్ దీపక్

జైపూర్, వెలుగు: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. బుధవారం జైపూర్​మండలం గంగిపల్లిలోని పల్లె దవాఖానాను పరిశీలించారు. హాస్పిటల్​లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. డాక్టర్లు, సిబ్బంది విధుల సమయపాలన పాటించాలన్నారు. రహదారి నుంచి ఆస్పత్రికి వెళ్లే అటాచ్ రోడ్డుకు రిపేర్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 

గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించి స్పీడప్​ చేసేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. కుందారం గ్రామంలోని పీహెచ్ సీని సందర్శించి రిజిస్టర్లు, మందుల నిల్వలు, వార్డులను పరిశీలించారు. డాక్టర్లు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. మండల కేంద్రంలోని కేజీబీవీ స్కూల్ ను సందర్శించి క్లాస్​రూమ్​లు, కిచెన్, రిజిస్టర్లు, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలున్న ఆహారం అందించాలని, కూరగాయలు, నిత్యవసర సరుకులు నాణ్యమైనవి వినియోగించాలన్నారు. ఇంటర్​సెకండియర్​ స్టూడెంట్లకు దిశానిర్దేశం చేశారు.

వరద ఇన్ ఫ్లోను నిత్యం పర్యవేక్షించాలి

నస్పూర్, వెలుగు: జిల్లాలో ఎడతెరిప లేకుండా వర్షాలు కురుస్తుండడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తోందని, నీటి ఇన్ ఫ్లోను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. హాజీపూర్ మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుతున్న వరదను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భారీ వర్షాల కారణంగా ఎగువనున్న ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ప్రవాహం పెరుగుతోందన్నారు.

వాగులు, చెరువుల నుంచి సైతం వరద ప్రాజెక్టులోకి రావడంతో ఇన్ ఫ్లో అధికంగా ఉంటోందన్నారు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, నీటి అవుట్ ఫ్లో వివరాలను అందించాలని తెలిపారు. అధికారులు సమన్వయంతో లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేయాలని, రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్​వెంట సంబంధిత అధికారులున్నారు.