
- కలెక్టర్ రాహుల్రాజ్
మెదక్టౌన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారితే లక్ష్యంగా పని చేస్తోందని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ధృడ సంకల్పంతో ముందుకు సాగుతోందని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం ఆయన మెదక్ మండలం రాజ్పల్లి, చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి, మెదక్ పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 7,668 యూనిట్ల ద్వారా మహిళా సంఘాలకు ఆర్థిక చేయూత అందిస్తున్నట్టు చెప్పారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి సంస్థల క్రమబద్ధీకరణ పథకం కింద మహిళలు 150 యూనిట్లు నెలకొల్పినట్టు తెలిపారు. మూగజీవాలకు ప్రభుత్వ పశువైద్య సేవలు సమర్థవంతంగా అందాలని అధికారులను ఆదేశించారు.
మెదక్ తో పాటు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని పశు వైద్యశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ పనితీరును, పశువైద్యుల హాజరు, ఔషధాల నిల్వలు, రోగ నిర్ధారణ, పరికరాల వినియోగం, రికార్డుల నిర్వహణ, పశువులకు వ్యాక్సినేషన్ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా వాటర్ ట్యాంకులు, డ్రైనేజీలను క్లీనింగ్ చేయాలని, ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో అధికారులు, సిబ్బంది ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. మున్సిపాలిటీలు, జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో తప్పనిసరిగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం
నిర్వహించాలన్నారు.