
గద్వాల, వెలుగు: మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్పారు. మంగళవారం గద్వాల టౌన్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సంబురాలకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మహిళా సంఘాలకు రూ.50.61 లక్షల వడ్డీ లేని, 53 సంఘాలకు రూ.7.87 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులు అందించారు.
గద్వాల మండలానికి 1,587 కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయని, 4,877 మంది పేర్లు పాత కార్డుల్లో చేర్చినట్లు తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ప్లాంట్, క్యాంటీన్ల ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సోలార్ విద్యుత్ ప్లాంట్ కోసం నాలుగెకరాల స్థలం కేటాయించినట్లు తెలిపారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కమిటీ సంతకం లేకుండా భోజనం వండొద్దు
ఫుడ్ కమిటీ సంతకం లేకుండా భోజనం వండొద్దని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల హాస్టల్ ను మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పరిష్కరించాలని అధికారులకు సూచించారు. బీసీ సంక్షేమ శాఖ అధికారి నిషిత, వార్డెన్ రజిత పాల్గొన్నారు.
సకాలంలో పౌష్టికాహారం అందించాలి
అంగన్ వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సకాలంలో పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ సంతోష్ చెప్పారు. మంగళవారం గద్వాల టౌన్ లోని గంజిపేట అంగన్ వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పిల్లలతో అక్షరాభ్యాసం చేయించారు.
యూనిసెఫ్ సూచనలు పాటించాలి
బాలల సంక్షేమం కోసం యూనిసెఫ్ సూచనలను పాటిస్తున్నామని కలెక్టర్ సంతోష్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లో సప్లిమెంటరీ ఫీడింగ్ ప్రోగ్రాం అమలు తీరుపై యూనిసెఫ్ బృందం, అధికారులతో సమీక్ష
నిర్వహించారు.