ఐదేండ్లలోపు చిన్నారులను అంగన్వాడీల్లో చేర్పించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి  

ఐదేండ్లలోపు చిన్నారులను అంగన్వాడీల్లో చేర్పించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి  

 నల్గొండ అర్బన్, వెలుగు : ఐదేండ్లలోపు పిల్లలందరినీ అంగన్ వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి తల్లిదండ్రులకు సూచించారు. మంగళవారం నల్గొండ పట్టణంలోని గొల్లగూడ మూడో అంగన్​వాడీ కేంద్రంలో ‘అమ్మ మాట.. అంగన్​వాడీ బాట’  కార్యక్రమంపై అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, ఐదేండ్లలోపు పిల్లలు అంగన్​వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు.

చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం అంగన్​వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికారం అందజేస్తుందన్నారు. ఈనెల 10 నుంచి 17 వరకు ‘అమ్మ మాట.. అంగన్​వాడీ బాట’ కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. ర్యాలీలో ఐసీడీఎస్​ పీడీ కృష్ణవేణి, సీడీపీవో హరిత, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల నమోదుపై దృష్టి పెట్టాలి 

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదుపై దృష్టి పెట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. మంగళవారం నల్గొండలోని కలెక్టరేట్ లో విద్యాశాఖ అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మధ్యలో బడి మానేసే వారి శాతాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి పాఠశాల వారీగా గతేడాది, ఈ ఏడాదికి విద్యార్థుల నమోదు శాతంపై నివేదిక సమర్పించాలన్నారు.  భవిత  కేంద్రాల్లో అన్ని సౌకర్యాలను కల్పించాలని చెప్పారు. ఈనెల12 ,13 న టీచర్లు, తల్లిదండ్రులతో మెగా సమావేశాలు నిర్వహించాలని సూచించారు.