భూభారతితో రైతుల భూములకు రక్షణ : కలెక్టర్​ విజయేందిర బోయి

భూభారతితో రైతుల భూములకు రక్షణ :  కలెక్టర్​ విజయేందిర బోయి

నవాబుపేట,వెలుగు: భూభారతి చట్టంతో రైతుల భూములకు రక్షణ లభిస్తుందని కలెక్టర్​ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం నవాబుపేట మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. రైతులకు కొత్త చట్టంపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్​ను అడ్డం పెట్టుకొని చేసిన భూకబ్జాలను కొత్త చట్టంతో బయటపెడతామని పేర్కొన్నారు. 

 సోమవారం మండలంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో రోజంతా ఉండి, రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. అడిషనల్​కలెక్టర్ మోహన్​రావు, ఆర్డీవో నవీన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష్యుడు రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. 

భూ సమస్యలకు పరిష్కారం

ఆమనగల్లు, వెలుగు:  భూభారతి చట్టంతో భూ సమస్యలకు  పరిష్కారం లభిస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, రాష్ట్ర ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ నరసింహారెడ్డి, రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం కడ్తాల్, తలకొండపల్లిల్లో నిర్వహించిన సదస్సులకు హాజరై, మాట్లాడారు.  రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్​బోర్డు సభ్యుడు బాలాజీ సింగ్, ఏఎంసీ చైర్​పర్సన్ గీత, వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కేశవరెడ్డి, ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

భూధార్​ కార్డులు ఇస్తాం

అయిజ, వెలుగు: భూ సంబంధ సమస్యలు పరిష్కారానికే రాష్ట్ర  ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకువచ్చిందని గద్వాల కలెక్టర్ సంతోష్ తెలిపారు. మంగళవారం అయిజ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులకు భూధార్​కార్డులు ఇస్తామన్నారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీవో శ్రీనివాసరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడప్ప తదితరులున్నారు.

అధికారులు జాగ్రత్తగా పని చేయాలి

నారాయణపేట, వెలుగు:  భూ సమస్యలను పరిష్కరించడంలో భాగంగా అధికారులు జాగ్రత్తగా పని చేయాలని కలెక్టర్​సిక్తా పట్నాయక్​ ఆదేశించారు. మద్దూరు మండలంలోని 17 గ్రామాల్లో ఈ నెల 17 నుంచి 28 వరకు నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో రైతుల  నుంచి వచ్చిన దరఖాస్తులపై మంగళవారం కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష జరిపారు. ఎన్ని అర్జీలు వచ్చాయని అడగగా 1,341 వచ్చినట్లు తహసీల్దార్ మహేశ్ గౌడ్ తెలిపారు. ఆయా సమస్యలను మే  మొదటి వారంలోగా  పరిష్కరించాలని కలెక్టర్ ​సూచించారు. ఆర్డీవో రామచందర్ నాయక్, భూభారతి ప్రత్యేక అధికారి యాదగిరి, సర్వే ల్యాండ్ ఏడీ గిరిధర్ తదితరులున్నారు.