
- విప్‌తో ప్రొటోకాల్ రగడ, హైకోర్టు ఆగ్రహంతో బిగుస్తున్న ఉచ్చు
- విప్, కలెక్టర్ వివాదంలో డీపీఆర్‌వో ఔట్
- కలెక్టర్‌పై సర్కార్ తీసుకోబోయే చర్యలపై సర్వత్రా ఉత్కంఠ
కరీంనగర్, వెలుగు: రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఇటీవల తరచూ ఏదో ఓ వివాదంలో చిక్కుకుంటున్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విషయంలో ప్రొటోకాల్ పాటించలేదని, జాతీయ గీతాన్ని అవమానించారనే వివాదంలో చిక్కుకోవడం, భూసేకరణకు సంబంధించిన కేసుల్లో హైకోర్టు వరుసగా ఆయనపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. కలెక్టర్ ఝా, విప్ ఆది శ్రీనివాస్ మధ్య వివాదంలోకి తలదూర్చి ఇప్పటికే డీపీఆర్‌వో శ్రీధర్ సస్పెన్షన్‌కు గురికావడంతో.. జిల్లాలోని అధికారులు ఆందోళనకు గురవుతున్నారు.
కలెక్టర్ వ్యవహారంపై విప్ వారం క్రితమే సీఎస్ కు, మూడు రోజుల కింద సీఎంకు ఫిర్యాదు చేశారు. మరోవైపు కలెక్టర్‌ను తీవ్రంగా మందలించాలని హైకోర్టు సీఎస్‌ను ఆదేశించిన నేపథ్యంలో సందీప్ కుమార్ ఝాపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ప్రభుత్వ విప్‌ను కించపరిచేలా ప్రవర్తన..
ఈ నెల 17న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేసేందుకు చీఫ్ గెస్ట్ గా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వచ్చారు. అప్పటికి కలెక్టర్ వేదిక వద్దకు చేరుకోలేదు. ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం విప్ రావడానికి 5 నిమిషాల ముందే కలెక్టర్ చేరుకోవాల్సి ఉంది. దీంతో విప్ కొద్దిసేపు కలెక్టర్ కోసం చూసినా రాకపోవడంతో అక్కడున్న జిల్లా అధికారులను అడిగి సరిగ్గా ఉదయం 10 గంటలకు జెండా ఎగురవేశారు. అందరూ జాతీయ గీతాలాపన చేస్తుండగా.. కలెక్టర్ తన వాహనంలో సైరన్ మోతతో రావడం, జాతీయ గీతం పాడుతుండగానే వేదికపైకి రావడం వివాదాస్పదంగా మారింది.
ఇలా తనను అవమానించాలని కలెక్టర్ ముందే డిసైడ్ అయ్యారనేది విప్ వాదన. అందుకే సెప్టెంబర్ 16న రాత్రి వరకు తనకు స్పీచ్ లేదని చెప్పారని, తాను సీఎంవోలో, ఇతర జిల్లాల్లో తెలుసుకుంటే స్పీచ్ ఉంటుందని తెలిసిందని విప్ గుర్తుచేస్తున్నారు. తర్వాత సీఎంవో నుంచి మళ్లీ కలెక్టర్‌కు ఫోన్ రావడంతో డీపీఆర్‌వో తనకు స్పీచ్ కాపీ ఇచ్చారని, ఇదంతా తనను కించపరిచే ఉద్దేశంతోనే చేశారని ఆది శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై ఆయన సీఎస్, సీఎంకు ఫిర్యాదు చేయగా.. కలెక్టర్‌ను సీఎస్ వివరణ కోరారు. అయితే తననే ఓవర్ టేక్ చేసి.. విప్ ఆది శ్రీనివాస్ నిర్ణీత సమయానికంటే ముందే వచ్చారని కలెక్టర్ ప్రభుత్వానికి వివరణ ఇచ్చినట్లు తెలిసింది.
ఆ రోజు జెండావందనం ఫొటోలు తీసిన కెమెరాలు, వీడియోలను టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్‌తో చెక్ చేయిస్తే నిజానిజాలు బయటికొచ్చే అవకాశముంది. అలాగే వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం మొదటి నుంచి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి, కొట్లాడి తాను రూ.150 కోట్ల నిధులు తీసుకొస్తే.. ఆ క్రెడిట్ అంతా తనదే అన్నట్లుగా, వేములవాడను తానే అభివృద్ధి చేస్తున్నట్లుగా కలెక్టర్ ప్రెస్ నోట్లలో రాయించుకోవడం, ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలతో ప్రచారం చేసుకోవడంపైనా ఆది శ్రీనివాస్ మండిపడుతున్నారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతోపాటు స్థానిక ఎమ్మెల్యేనైనా తన పేరు ప్రస్తావించకపోవడాన్ని, ఫొటోలు వాడకపోవడాన్ని తప్పుపడుతున్నారు.
కోర్టులన్నా లెక్కలేదు..
ప్రజాప్రతినిధులంటే ఏ మాత్రం లెక్కలేని విధంగా వ్యవహరిస్తున్న కలెక్టర్‌కు కోర్టులన్నా, కోర్టు ఆర్డర్లు అన్నా లెక్క లేకుండాపోయింది. ఇటీవల హైకోర్టు వరుసగా చేస్తున్న సీరియస్ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా ఉన్నాయి. మిడ్ మానేరులో తన ఇంటిని కోల్పోయిన నిర్వాసితుడు వేల్పుల ఎల్లయ్యకు పరిహారం చెల్లించాలని గత జూన్‌లో హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఎలాంటి పరిహారం చెల్లించలేదు. దీంతో హైకోర్టు కలెక్టర్‌కు నోటీసులు ఇచ్చింది. దీనిపై ఆయన ఎలాంటి రిప్లై ఇవ్వకపోవడంతో ఆయనకు హైకోర్టు వారెంట్ ఇష్యూ చేసింది. అలాగే మిడ్ మానేరుకు సంబంధించి మరో నిర్వాసితురాలు వనబట్ల కవిత పరిహారం విషయంలోనూ హైకోర్టు ఉత్తర్వులను కలెక్టర్ అమలు చేయలేదు.
పైగా ఆర్డీవో, తహసీల్దార్‌కు చెప్పి ఆమెపై అక్రమ కేసులు బనాయించారు. ఈ కేసులో కోర్టుకు హాజరైన కలెక్టర్‌ను చూసి జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌కు డ్రెస్సింగ్ సెన్స్ సరిగ్గా లేదని.. ఆయన్ను చూస్తే తమకే భయంగా ఉందని వ్యాఖ్యానించడం సంచలనం కలిగించింది. కవిత విషయంలో కలెక్టర్ చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేశారని, భవిష్యత్ లో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా తీవ్రంగా మందలించాలని సీఎస్ ను ఆదేశించింది. విప్ ఫిర్యాదులు, హైకోర్టు అక్షింతల నేపథ్యంలో కలెక్టర్‌పై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
ఆందోళనలో జిల్లా ఆఫీసర్లు..
విప్, కలెక్టర్ వివాదంలో ఇప్పటికే ఆ జిల్లా డీపీఆర్‌వో శ్రీధర్ అత్యుత్సాహం ప్రదర్శించి.. విప్ ఆది శ్రీనివాస్ ను అవమానించేలా ఉన్న కార్టూన్‌ను వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేసి సస్పెన్షన్ కు గురైన విషయం తెలిసిందే. ఇద్దరి మధ్య వివాదం ఇలాగే కొనసాగితే.. ముందుముందు ఇంకెందరు బలి కావాల్సి వస్తుందోనని కొందరు జిల్లా ఆఫీసర్లు తలలు పట్టుకున్నట్లు సమాచారం. దీంతో లాంగ్ లీవ్ పెట్టి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే జిల్లాలో సుమారు 10కిపైగా జిల్లా స్థాయి ఆఫీసర్ల పోస్టులు ఇన్ చార్జీలతో నెట్టుకొస్తుండగా.. ఇదే జరిగితే మరిన్ని శాఖల్లో ఖాళీలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.