ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ వెంకటేశ్  ధోత్రే
  • అధికారులకు కలెక్టర్ల ఆదేశాలు

ఆసిఫాబాద్/ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలని ఆసిఫాబాద్​జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్  ధోత్రే అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి సోమవారం కలెక్టరేట్​లో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు అందించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని, ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి విధులు నిర్వహించాలని ఆదేశించారు. హ్యాండ్ బుక్ ను క్షుణ్ణంగా చదివి ప్రతి అంశంపై అవగాహన పెంచుకోవాలన్నారు. ట్రైనింగ్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, డీపీఓ భిక్షపతి గౌడ్, డివిజనల్ పంచాయతీ అధికారి ఉమర్ తదితరులు 
పాల్గొన్నారు.

ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలి

ఎన్నికల అధికారులు ఎన్నికల నియమనిబంధనలు తప్పక పాటించాలని ఆదిలాబాద్​కలెక్టర్​రాజర్షి షా ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్​విడుదలైన నేపథ్యంలో సోమవారం జిల్లా పరిషత్​మీటింగ్​ హాల్​లో రిటర్నింగ్, అసిస్టెంట్​రిటర్నింగ్ అధికారులకు ఎన్నికలపై శిక్షణ నిర్వహించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించిన సూచనలు చేశారు.