
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
మధిర, వెలుగు: ఆర్థిక అసమానతలు లేని సమాజం కోసం కృషి చేస్తున్నది కమ్యూనిస్టులేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. సీపీఐ ఖమ్మం జిల్లా 23వ -మహాసభలు శనివారం మధిరలోని ఓ గార్డెన్లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ బీజేపీ నేతలు మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ప్రశ్నించే వారిని లేకుండా చేయాలని చూస్తున్నారన్నారు. ప్రజల పక్షాన పని చేసే కమ్యూనిస్టులను లేకుండా చేయడం ఎవరి తరం కాదన్నారు. బూర్జువా పార్టీల అంతిమ లక్ష్యం అధికారమేనని, కమ్యూనిస్టులకు మాత్రం ప్రజాభ్యుదయం, సమాజంలో మార్పు, ఆర్థిక అసమానతలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యమని గుర్తు చేశారు.
స్థానిక ఎన్నికల్లో తమ బలానికి అనుగుణంగా పొత్తులు కుదిరితే కలిసి పోటీ చేస్తామని, లేదంటే ఒటరి పోరుతో సత్తా చాటుతామని తెలిపారు. ఓటమి తరువాత కొందరు నాయకులు వేరే దారులు -వెతుక్కుంటారని, బీఆర్ఎస్ నేత కవిత అదే దారిలో పయనిస్తోందని చెప్పారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, పువ్వాడ నాగేశ్వరరావు, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహ్మద్ మౌలానా, జమ్ముల జితేందర్ రెడ్డి, మందడపు రాణి, అజ్మీరా రామ్మూర్తి, దొండపాటి రమేశ్, మేకల శ్రీనివాసరావు పాల్గొన్నారు.