
- ట్రేడర్ల కోసం ఐఆర్‌ఆర్‌ఏ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి..
- బ్రోకర్ల ప్లాట్‌ఫామ్ పనిచేయకపోతే ఇందులోకి వెళ్లి పొజిషన్లు క్లోజ్ చేసుకునే వీలు
ముంబై: ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడర్లలో 90 శాతం మందికి నష్టాలే వస్తున్నా రిటైల్ ఇన్వెస్టర్లకు వీటిపై మోజు తగ్గడం లేదని సెబీ చైర్‌పర్సన్ మాధవి పురి బుచ్ పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల ఆసక్తి చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందని చెప్పారు. ఇన్వెస్టర్లు లాంగ్ టెర్మ్ కోసం చూసుకోవాలని, ఇన్‌ఫ్లేషన్‌ను ఎదుర్కొని లాభాలు పొందాలంటే ఇదే సరైన స్ట్రాటజీ అని చెప్పారు. ఇన్వెస్టర్ రిస్క్ రిడక్షన్ యాక్సెస్ (ఐఆర్‌ఆర్‌ఏ) ప్లాట్‌ఫామ్ లాంచ్ చేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ చేస్తున్న 45.24 లక్షల మందిలో కేవలం 11 శాతం మంది మాత్రమే లాభపడుతున్నారని సెబీ చేసిన రీసెర్చ్ రిజల్ట్స్‌ను ఉదహరిస్తూ పేర్కొన్నారు. ఈ రిపోర్ట్ ప్రకారం, కరోనా సంక్షోభం టైమ్‌లో ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ చేస్తున్న వారు భారీగా పెరిగారు. 2019 లో 7.1 లక్షల మంది ఎఫ్ అండ్ ఓ ట్రేడర్లు ఉంటే 2023 నాటికి ఈ నెంబర్ 500 శాతం పెరిగిందని మాధవి అన్నారు. ‘లాభాలు రావడం కష్టమని తెలిసినా ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ చేస్తున్న వారు పెరుగుతుండడం చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదు కూడా’ అని ఆమె వివరించారు. ఎఫ్ అండ్ ఓ సెగ్మెంట్‌లో నష్టపోవడానికి 90 శాతం అవకాశం ఉందని అన్నారు. మరోవైపు లాంగ్ టెర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసుకుంటే లాభపడే ఛాన్స్ ఎక్కువుందని డేటా కూడా చెబుతోందన్నారు. లాంగ్ టెర్మ్‌లో సంపద క్రియేట్ చేయడానికి అవకాశం ఉందని, ఇన్‌ఫ్లేషన్‌ను మించి రిటర్న్స్ పొందొచ్చని చెప్పారు. లాభాలొచ్చే లాంగ్ టెర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ వైపు చూడాలని, నష్టాలొచ్చే ఎఫ్ అండ్ ఓ వైపు కాదని సలహా ఇచ్చారు. సెబీ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం, 2021-–22 లో 89 శాతం మంది ఎఫ్ అండ్ ఓ ట్రేడర్లు నష్టాలు మూటగట్టుకున్నారు. యావరేజ్‌గా రూ.1.1 లక్షలు నష్టపోయారు. మిగిలిన 11 శాతం మంది సగటున రూ.1.5 లక్షలు లాభపడ్డారు. ఎఫ్ అండ్ ఓ ట్రేడర్లలో మూడో వంతు 20 నుంచి 30 ఏళ్ల లోపు ఉన్నవారేనని సెబీ రిపోర్ట్ వెల్లడించింది.
ట్రేడర్ల కోసం మరో ప్లాట్‌ఫామ్..
బ్రోకర్ల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చాక అప్స్ట్రీమింగ్ ఆఫ్ ఫండ్స్ ( క్లయింట్స్ ఫండ్స్‌ను క్లియరింగ్ కార్పొరేషన్‌కు పంపడం) పై రివైజ్డ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మాధవి అన్నారు. కార్యకలాపాలు సులభతరం చేసేందుకు తీసుకొచ్చిన రూల్స్‌లో 50 ఐటెమ్స్‌కు బ్రోకింగ్ ఇండస్ట్రీ, ఎక్చేంజిలు ఓకే చెప్పాయని పేర్కొన్నారు. ఐఆర్‌ఆర్‌ఏ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొస్తామని కిందటేడాది డిసెంబర్‌లోనే సెబీ ప్రకటించింది. తాజాగా లాంచ్ చేసింది. బ్రోకరేజ్ ప్లాట్‌ఫామ్ సరిగ్గా పనిచేయకపోతే కస్టమర్లకు ఐఆర్‌ఆర్‌ఏకి సంబంధించిన లింక్ ఒకటి పంపుతారు. ఈ ప్లాట్‌ఫామ్‌లోకి వెళ్లి తమ ఓపెన్ పొజిషన్లు క్లోజ్ చేసుకోవచ్చు. కానీ కొత్త పొజిషన్లు తీసుకోవడానికి వీలుండదు. అధ్వాన పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్ విధానాన్ని అందించడానికి, ఇందుకోసం అయ్యే ఖర్చుకు మధ్య పర్‌ఫెక్ట్ బ్యాలెన్స్ సాధించేందుకు చర్యలు చేపడుతున్నామని మాధవి అన్నారు.
సహారా ఫండ్స్ ప్రభుత్వానికి?
సహారా–సెబీ రిఫండ్ అకౌంట్‌లోని ఫండ్స్‌ను కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకు ట్రాన్స్‌ఫర్ చేయాలని ప్రభుత్వం చూస్తోంది. ఫండ్స్ ట్రాన్స్‌ఫర్‌కు న్యాయ పరమైన చిక్కులేమైనా ఉన్నాయా? అని పరిశీలిస్తోంది. రిఫండ్ క్లయిమ్స్ తక్కువగా ఉన్నాయని, అందుకే ప్రభుత్వం ఈ ఫండ్స్‌ను షిఫ్ట్ చేయాలని చూస్తోందని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి సహారా గ్రూప్ నుంచి రికవరీ చేసి, ప్రభుత్వ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన అమౌంట్ రూ.25,163 కోట్లు. ఇప్పటి వరకు 48,326 అకౌంట్లకు చెందిన 17,526 మంది అప్లికేషన్లకు రూ.138 కోట్లు రిఫండ్ చేశారు. సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు సహారా గ్రూప్ ఆఫ్ కో–ఆపరేటివ్ సొసైటీ డిపాజిటర్లకు రిఫండ్ చేయడానికి ఈ ఏడాది ప్రారంభంలో రూ.5 వేల కోట్లు సెంట్రల్ రిజిస్ట్రర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్‌కు పంపారు. రిఫండ్స్ కోసం సపరేట్‌గా వెబ్‌సైట్‌ని కూడా ప్రభుత్వం లాంచ్ చేసింది. కాగా, సహారా గ్రూప్ కంపెనీలు బాండ్లను ఇష్యూ చేయడం ద్వారా ఫండ్స్ సేకరించాయి. తమ పర్మిషన్ లేకుండా ఫండ్స్ రైజ్ చేశారని, డిపాజిటర్లకు వెంటనే రిఫండ్ చేయాలని సెబీ ఆదేశించింది. ఆ తర్వాత ఈ ఇష్యూ సుప్రీం కోర్టుకి వెళ్లగా, సెబీకి ఫేవర్‌గా 2012 లో తీర్పు వచ్చింది. ఫండ్స్ సెబీ దగ్గర డిపాజిట్ చేయాలని, రిఫండ్ ప్రాసెస్‌ను ఈ సంస్థ చూసుకుంటుందని రెండు సహారా గ్రూప్ కంపెనీలకు సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.