టికెట్ల కోసం ఢిల్లీకి కాంగ్రెస్​, బీజేపీ లీడర్లు

టికెట్ల కోసం ఢిల్లీకి కాంగ్రెస్​, బీజేపీ లీడర్లు
  • కాంగ్రెస్​ స్క్రీనింగ్​ కమిటీ అంతా హస్తినలోనే మకాం
  • కమిటీ సభ్యులు, ఏఐసీసీ నేతలతో ఆశావహుల భేటీ
  • లిస్టులో తమ పేరు చేర్చాలంటూ విజ్ఞప్తులు
  • కొన్నిరోజులుగా బీజేపీ రాష్ట్ర పెద్దలూ ఢిల్లీలోనే
  • వారిని కలిసి టికెట్లు కోరుతున్న ఆశావహులు

హైదరాబాద్​, వెలుగు : కాంగ్రెస్​, బీజేపీ నుంచి టికెట్​ ఆశిస్తున్న నేతలు ఢిల్లీ బాట పట్టారు. ఆయా పార్టీల ముఖ్య నేతలంతా కొన్నిరోజులుగా ఢిల్లీలో ఉండటంతో ఆశావహులు కూడా అక్కడికే వెళ్తున్నారు. అభ్యర్థుల లిస్టులను వీలైనంత త్వరలో ప్రకటించేందుకు కాంగ్రెస్​, బీజేపీ ఏర్పాట్లు చేస్తుండటంతో.. అందులో తమకు అవకాశం దక్కించుకునేందుకు ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద లీడర్ల దృష్టిలో పడేందుకు కొందరు సొంత పనులను కూడా పక్కనపెట్టి ఢిల్లీకి వెళ్లారు.

గాంధీభవన్​ నుంచి షిఫ్ట్​!

ఇన్నాళ్లూ ఏదో ఒక మీటింగ్​తో కిటకిటలాడిన కాంగ్రెస్​ పార్టీ ఆఫీస్​ గాంధీభవన్​.. ప్రస్తుతం వెలవెలబోతున్నది. పార్టీ ఆఫీసుకు లీడర్లు పెద్దగా రావడం లేదు. ప్రస్తుతం కాంగ్రెస్​ టికెట్ల కేటాయింపు, అభ్యర్థుల వడపోతకు సంబంధించి రాజకీయాలన్నీ ఢిల్లీకి షిఫ్ట్​ అయ్యాయి. 

అక్కడే స్క్రీనింగ్​కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. బుధవారం సమావేశం జరిగినా.. ఎటూ తేలకుండానే ముగిసింది. గురువారం మరోసారి స్క్రీనింగ్​ కమిటీ సమావేశం నిర్వహించారు. దీంతో పెద్ద నేతలందరూ ఢిల్లీలోనే మోహరించారు. స్క్రీనింగ్​ కమిటీలో మెంబర్లయిన  పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, మధుయాష్కీ గౌడ్  ఢిల్లీ లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టికెట్​ ఆశిస్తున్న నేతలంతా ఢిల్లీకి పయనమయ్యారు.

ఎటువంటి వివాదం లేని 35 సీట్లను కాంగ్రెస్​ తొలి జాబితాలో భాగంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరో 70 స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉన్నట్టు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా చోట్ల నేతలు టికెట్​ పొందేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. రేవంత్, భట్టి, ఉత్తమ్​, కోమటిరెడ్డి, మధుయాష్కీ  స్క్రీనింగ్​ కమిటీలో మెంబర్లుగా ఉండడంతో వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. పార్టీ రాష్ట్ర పెద్ద లీడర్లతో పాటు ఏఐసీసీ నేతల వద్ద కూడా ఆశావహులు అర్జీలు పెట్టుకుంటున్నట్టు తెలుస్తున్నది.

ఇక్కడ నియోజకవర్గాల్లో తమకు అధిష్టానం అప్పగించిన పనులను కూడా వదిలేసి మరీ టికెట్​ కోసం ఢిల్లీ బాటపట్టారు. వాస్తవానికి విజయ భేరి సభ అయిపోయిన తెల్లారి నుంచే నియోజకవర్గాల్లో గ్యారంటీ కార్డులను ఇంటింటికీ పంచే కార్యక్రమాన్ని పార్టీ అధిష్టానం తీసుకున్నది. పీసీసీ చీఫ్​లు, సీఎల్పీ నేతలు, పార్లమెంట్​ అబ్జర్వర్లు ఆయా నియోజకవర్గాల్లోనే మకాం వేసి కార్డులను ఇంటింటికీ పంచుతున్నారు. అయినా సరే.. పార్టీ పెద్దలు అత్యంత కీలకంగా భావిస్తున్న ఆ కార్యక్రమాన్ని పలువురు నేతలు పక్కనపెట్టి.. టికెట్ల గురించి ప్రయత్నిస్తున్నారు. 

సర్ది చెప్తున్న నేతలు

కాంగ్రెస్​ పార్టీ టికెట్​ కోసం 1,025 మంది అప్లై చేసుకున్నారు. అందరికీ టికెట్లు ఇవ్వడం కుదిరే పని కాదని పార్టీలోని పెద్దలు ఇదివరకే ఆశావహు లకు తేల్చి చెప్పారు. కొందరు పెద్ద నేతలకు టికెట్​ రాకున్నా.. వారికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చా రు. టికెట్ల విషయం తమ చేతుల్లో ఏమీ లేదని, అంతా సెంట్రల్​ కమిటీ చేతుల్లోనే ఉందని అంటున్నారు. ఇప్పుడు టికెట్​ కోసం ఢిల్లీకి వచ్చిన నేతలకు ఇదే విషయాన్ని చెప్పి బుజ్జగిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్​ రాకుంటే.. అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ స్థానమో, లేదా ఎంపీ టికెట్టో, నామినేటెడ్​ పదవో ఇస్తామని సర్ది చెప్తున్నారు.

పార్టీలోని ముఖ్య నేతలెవరినీ వదులుకోబోమని, అందరికీ న్యాయం చేస్తామని అంటున్నారు. మరోవైపు పలువురు నేతలు.. ఇతర నేతలతో పోటీ విషయంపై బేరాలకు దిగుతున్నట్లు తెలుస్తున్నది. ఎమ్మెల్యే టికెట్​ వదులుకుంటే.. 2024లో జరిగే లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇప్పిస్తామని బేరసారాలు కుదుర్చుకుంటున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం కాంగ్రెస్​లో ఎంపీలుగా ఉన్న రేవంత్, ఉత్తమ్, వెంకట్​ రెడ్డి ఎమ్మెల్యేగా బరిలో నిలిచేందుకు అప్లయ్​ చేసుకున్నారు.

దీంతో ఆయా లోక్​సభ స్థానాలకు వేరే అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుందన్న ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎంపీ సీట్లపైనా కొందరు నేతలు లాబీయింగ్​ చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాని అభ్యర్థులకు కనీసం లోక్​సభ ఎలక్షన్లకైనా అవకాశం ఇవ్వాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. 

బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలూ ఢిల్లీలోనే..!

బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే ఉండడంతో ఆ పార్టీ టికెట్ ఆశావహులు పలువురు ఢిల్లీ బాట పట్టారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండడంతో రాష్ట్రానికి చెందిన ఆ పార్టీ నలుగురు లోక్​సభ సభ్యులు కిషన్​రెడ్డి, బండి సంజయ్​, ధర్మపురి అర్వింద్​, సోయం బాపూరావు ఢిల్లీలోనే ఉన్నారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్​ కూడా అక్కడే ఉన్నారు.

ఇక రాష్ట్ర బీజేపీ వ్యవహారాలు చూసే తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ సైతం ఢిల్లీలోనే ఉండడంతో వాళ్లను కలిసి తమ టికెట్ విషయం మాట్లాడేందుకు సెకండ్ క్యాడర్ నాయకులు గురువారం ఢిల్లీ వెళ్లారు. వీరిలో అందరూ ఏదో ఒక నియోజకవర్గం నుంచి పార్టీ తరఫున పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న వారే. సుమారు పది మంది సెకండ్ క్యాడర్ నాయకులు గురువారం ఢిల్లీలో బండి సంజయ్, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్​ను కలిశారు.