నలభై నాలుగు సంవత్సరాల క్రితం ప్రచురితమైన కవితని ఓ సాహిత్య అభిమాని యూనివర్సిటీ లైబ్రరీలో చదివి నోటుబుక్‌లో దాన్ని రాసుకుని భద్రంగా దాచుకున్నాడు. 44 సంవత్సరాల తరువాత దాన్ని రాసిన కవికి పంపిస్తే ఎలా ఉంటుంది? గొప్ప ఆనందంగా ఉంటుంది.అద్భుతంగా వుంటుంది. కవిత్వాన్ని ఎవరు చదువుతారు? కథలని ఎవరు వింటారు?
ఇలాంటి ప్రశ్నలకు ఈ అనుభవం జవాబుని ఇస్తుంది. ఇది నా అనుభవంలోకి వచ్చింది. ఆ అనుభవాన్ని కలిగించింది రామాచారి గారు. ఆయన నాకు ఓ పది పదిహేను సంవత్సరాల నుంచి పరిచయం. అయితే ఈ విషయం ఎప్పుడూ నాకు చెప్పలేదు.
మొన్న ఆదివారం వాట్సప్ ద్వారా చెప్పి ఆనందపరిచారు. 1981 డిసెంబర్ ‘భారతి’ మాసపత్రికలో ప్రచురితమైన ‘రాత్రి కొమ్మల్లో ఒదిగి’అన్న నా కవిత రాత ప్రతి ఆయన రాసుకున్న కవిత.
ఆ రాత ప్రతిని 26 డిసెంబర్ 2021వ రోజు నాకు పంపించి నన్ను ఆశ్చర్యపరిచారు. ఆనందంలోకి నెట్టేశారు.
ఇంతకీ ఎవరీ బంగారు రామాచారి?ఆ కవిత ఎందుకు ఆయన్ని ఇంతగా ఆకర్షించింది?ఇన్నాళ్లు భద్రంగా దాన్ని దాచుకోవడానికి కారణాలు ఏమిటి? సూర్యాపేట జిల్లాలో జన్మించిన రామాచారి ఉస్మానియా యూనివర్సిటీలో చదివి కమర్షియల్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత కోదాడలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. తన ఇంటిలో వాళ్ల నాన్న పేరుతో పెద్ద లైబ్రరీ ఏర్పాటు చేయాలనేది ఆయన కోరిక. జయశంకర్ గారి పేరుతో ఓ నాలెడ్జ్ సెంటర్‌ని కూడా ఏర్పాటు చేయాలి అనుకున్నారు. కొన్ని కంప్యూటర్లు కూడా కొన్నారు. ఆయన దగ్గర దాదాపు పదివేల వరకు పుస్తకాలు ఉన్నాయి.
ఒక ఫ్లోర్‌ని పూర్తిగా ఆ నాలెడ్జ్ సెంటర్‌కి కేటాయించాలని కూడా అనుకున్నారు. అయితే కరోనా తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల ఆ పనిని పూర్తి చేయలేకపోయారు. ఆయనకి ఇప్పటికీ చేద్దామనే ఉంది.
ఈ రోజు ఉదయం నా కవిత గురించి, ఆయన రాసిన కవిత గురించి కాసేపు మాట్లాడాను. ఆయన భార్య మీద ఆయన రాసిన కవిత మన మనసుని హత్తుకుంటుంది. ఆనందపరుస్తుంది.
ఆమె అతనికి నవంబర్ 81లో పరిచయం. ఓ రోజు వాళ్ల నానమ్మ, వాళ్ల బంధువు ఒకరు కలిసి సూర్యాపేట బస్టాండ్‌లో కాలేజీకి వెళ్తున్న ఆమెను చూశారు. పరిచయం చేసుకొని కాసేపు ఆమెతో మాట్లాడారు. మాటల్లో ఆమె వాళ్ల బంధువుల అమ్మాయి అని తెలిసింది.
ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ల నానమ్మ ఆ అమ్మాయి గురించి రామాచారికి చెప్పి ‘‘నీకు బాగుంటుంది రా అమ్మాయి” అన్నది. ఆ తర్వాత 1981 నవంబర్ ప్రాంతంలో రామాచారి అనుకోకుండా ఒక రోజు ఆమెను ఒక హోటల్‌లో చూశారు. ఆమె అతన్ని బాగా ఆకర్షించింది. ఆ తర్వాత డిసెంబర్ 81లో ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో ఆయన ‘‘భారతి” మాసపత్రికలో నా కవిత ‘‘రాత్రి కొమ్మల్లో ఒదిగి” చూసి చదివారు. ఆయన హృదయానికి ఆ కవిత బాగా హత్తుకుంది.
నేను కవిత్వం గురించి ఆ కవిత రాస్తే ఆయనకి ఆయన మణి ఆ కవితలో కనిపించింది. ఆ కవితని చేతితో ఒక నోట్‌బుక్‌లో రాసుకొని పెట్టుకున్నారు. దాన్ని ఇప్పటికీ భద్రంగా దాచుకున్నారు. ఆయన మాటల్లో ఆ సందర్భం గురించి.. ‘‘ఆమె పరిచమయ్యాక ఆర్ట్స్ కాలేజీ లైబ్రరీలో చదివిన కవిత మీది. అందులో ఆమె సర్వస్వం అని అనుకున్నాను. మీరు కవితగా తలచారు. నేను మణిగా తలచాను.
ఆమె భార్యామణిగా నాజీవితం మొదలైంది. 28 ఏళ్ల దాంపత్య జీవితాన్ని ఈ క్రింది కవితలో పేర్కొన్నాను.
95శాతం వాస్తవం” (21–4–13 నాటికి 28 సంవత్సరాలు) ఆమె ముందు అతనుగా నేను(బంగారు రామాచారి)--అతనుగా మారి నిశ్చలమనస్సుతోఆమె ముందు మోకరిల్లి అన్నాను
‘‘నిజంగా నువ్వు నేను పొగొట్టుకున్న
అమ్మలా వరమై దొరికావు
ఆమె కళ్ళలో నేను దాచుకున్న
పసితనపు ప్రాయం గలగల నవ్వింది.
లేమిలోను తపనలను తీర్చే
ఆమె మనసెరిగి మసలుకునే
నేను తాయిలంకోసం మారాడే
పసివాడి భావనల మోముతో
ఈ చీకటి జీవితంలో వెలుగు చూపే
నువ్వే నా కంటి పాపవు అన్నాను.
ఆమె కళ్లతోనే ముసిముసిగా నవ్వింది.
బాల భానుని నులివెచ్చని
లేత కిరణాలు కిటికీని వంచి
మరీ లోపలికి వచ్చి ముద్దాడినప్పుడు
రెండు చేతుల్లో ఆమె రూపమే
కమనీయంగా కనిపించింది
కంపన, ప్రకంపనల లోకంలో
వెలుగు, చీకటులేమైన ఉండనివ్వు కాని
ఒంటి చేత్తో ఇంటినిలాగుతూ
నా బ్రతుకులో సూర్యోదయాలు,
చంద్రోదయాలు విరజిమ్ముతున్న
సూర్యుడు, చంద్రుడు, వెన్నెల
వెలుగు నీవే కదా అన్నాను.
ఆమె అటువైపుకు మరలింది.
అంతలోనే తిరిగి కళ్ళతో నవ్వింది
అతనికి తాయిలం దొరికింది.
బ్రతుకు కల(త)బడినప్పుడు
ముడుచుకున్న తాబేలుగా
భారజలనయనాలతో నేను
లాలించి పాలించే భూమికగా ఆమె
సమస్యను సాగదీయవు, కానీ
ఘడియలోపే రాజీకి రప్పిస్తావుగా
నీ మోములో పూచే ఆనందవర్ణాలు
లెక్కింప నాతరమా అని నవ్వాను.
‘నాకింకా బుద్దిపెరగలేదన్నావు’ నిజమే
అతనుగా ఎల్లకాలం ఆమెకు ఉపగ్రహాన్నే మరి
వర్తమానంలోను, అనంత(ర)కాలంలోను
ఆమె వెన్నెల, వెలుగులు పంచే మణిదీపమే.
ఇంతకీ ఆయన శ్రీమతి పేరు కవిత కాదు. ఆమె పేరు నాగమణి.నేను ఓ కవితగా ఆ కవితని చూశాను. ఆయన మణిగా చూశారు. ఆయన జీవితం మొదలైంది. 28 సంవత్సరాల దాంపత్య జీవితాన్ని ఆయన కవిత రూపంలో చెప్పారు.ఆయన దాచుకోవడం ఎంత అద్భుతంగా ఉందో ఆయన తన భార్య మీద రాసిన కవిత్వము అంతకన్నా అద్భుతంగా ఉంది. అది 95 శాతం వాస్తవమని రామాచారి గారు అన్నారు. నాకు మాత్రం 100 శాతం వాస్తవం అని అనిపించింది.
రామాచారి గారు ఒకటిరెండు సార్లు హిమాయత్‌నగర్‌లోని మా ఇంటికి వచ్చారు. కానీ, నేను వారి ఇంటికి వెళ్లడం తటస్థించలేదు. కానీ, ఆయన భార్య మణి గురించి కవిత చదివాక, ఈ కవిత ఇంకా భద్రంగా దాచుకోవడం చూసిన తరువాత ఆయన ఇంటికి వెళ్లి వాళ్లను కలవాలన్న కోరిక కలిగింది.
2023లో విజయవాడ నుంచి వస్తూ కోదాడలో వాళ్ల ఇంటికి వెళ్లి కలిశాను. ఆయన సత్కరాన్ని స్వీకరించాను. ఇలాంటి వ్యక్తిని భర్తగా పొందినందుకు ఆయన భార్య నాగమణి అదృష్టవంతురాలు. అలాంటి భార్యని పొందినందుకు రామాచారి గారు అదృష్టవంతులే.
రామాచారి గారు నా కవిత్వాన్ని అంత భద్రంగా దాచుకోవడం నా కవితదో నాదో అదృష్టమే.
కవిత్వం, కథలు ఎవరు చదువుతారు?ఏమిటి ఉపయోగం అన్న ప్రశ్నలకి విలువ లేదు.
శ్రద్ధగా చదివిన వాళ్లు ప్రభావితం అవుతారన్నది యధార్థం!!
ఆయన దాచుకున్న నా కవిత
రాత్రి కొమ్మల్లో ఒదిగి
నిన్ను నేను పిలుస్తున్నానో
లేక నువ్వే రెక్కలు కట్టుకొని నా దగ్గర వాలుతున్నావో
నాకు గుర్తు ఉండటంలేదు ప్రేయసీ
రోడ్డు నౌక మీద నడుస్తున్నప్పుడు
వలవేసి నీకోసమే ఆలోచిస్తున్నానో
లేక నువ్వే నా మెదడు వృక్షాన్ని
వడ్రంగిపిట్టవై కదిలిస్తున్నావో
నాకు గుర్తు ఉండటం లేదు ప్రేయసీ
నువ్వు నా మనసులో
చోటు చేసుకున్నప్పుడల్లా
నా కళ్ళు మూతలు పడతాయి
నా చెవులు మూగవైపోతాయి
అప్పుడు నన్ను నేనే మర్చిపోతాను
ఏవో నాలుగు గీతలు
నా మెదడు కాగితం మీద ప్రింటైపోతాయి
నువ్వు రాగానే
ఈ బాధామయ ప్రపంచాన్ని
ఈ గాలి శోక గీతాలని
నీలో దాచేస్తాను.
నువ్వు రాగానే
నా కంటి మీద జ్వరం తెర కరిగిపోతుంది
నువ్వు రాగానే
నా నిరాశామయ ఆలోచనలన్నీ తొలగిపోయి
రేపటి తేనె మీద ఆశ పెరిగిపోతుంది
నువ్వు నన్ను చేరిన తర్వాత
ఆకాశంలా గొప్పగా ఫీల్ అవుతాను నేను
అప్పుడు
నా మనసు ఆనంద సరస్సులో
తేలియాడే తామరపువ్వవుతుంది
నన్నింత ఉద్వేగపరిచే
నన్నింత ఆశామయుని చేసే
ఓ కవితా
నువ్వెంత గొప్పదానివి!!
- డా. మంగారి రాజేందర్ ,కవి, రచయిత, 9440483001-
