వేళాకోళమే. వెటకారమే. వెక్కిరింతే.. గీతలో పెడితే చెల్లిపోతుంది. రాతలో పడితేనే ఒళ్ళు మండుతుంది. వ్యంగ్య చిత్రాన్ని(కార్టూన్ని)చూసి మురిసిన వాళ్ళే, వ్యంగ్య పద్యాన్ని చదివి అరుస్తారు. కాబట్టి గీత గీతే. రాత రాతే. కార్టూన్లకూ గొడవకొస్తారు. కానీ, ‘వాక్టూన్ల’కు వచ్చినంత దూకుడుగా రారు. మాట మరీ ఈటెలా దిగుతుందో ఏమో? మొదటి పేజీలో పాఠకుడి కళ్లు ముందు కార్టూన్‌నే వెతుకుతాయి. మరీ మీద కొచ్చేటంత పెద్ద కార్టూను లేకపోయినా, మూలన ఒదిగి కూర్చునే ‘పాకెట్ కార్టూన’యినా ఉండాలి. అది కూడా నడుస్తున్న రాజకీయం మీద ఉండాలి. అందుకే పాఠకుడికి ఎడిటర్ పేరు తర్వాత కార్టూనిస్టు పేరే తెలిసేది.
కొంతమేరకు స్వతంత్రంగా నడిచిన రోజుల్లో తెలుగు పత్రికల్లో వ్యంగ్య చిత్రాలతో పాటు, వ్యంగ్య పద్యాలు కూడా వచ్చేవి. దేవీప్రియ, గజ్జెల మల్లారెడ్డీ ఇలాంటివి రాసి మెప్పులూ పొందారు. తిట్లు కూడా తిన్నారు. (అడపా దడపా.. పతంజలీ, నేనూ మేం సంపాదకత్వం వహించిన పత్రికల్లో ఈ స్వీకార, తిరస్కారాలకు నోచుకున్న వాళ్లమే.) ఇలా రాయొచ్చని శ్రీశ్రీ కూడా భరోసా ఇచ్చేశాడు.
‘పత్రికలో కార్టూనులు..పడడం చూళ్ళేదూ?..పద్యంలో ఆ మాదిరి పద్ధతి వీల్లేదూ? ’(ప్రాసక్రీడలు.. శ్రీశ్రీ)
దేవీప్రియ చాలాకాలం ఈ ‘వ్యంగ్య పద్య’ రచనను ‘రన్నింగ్ కామెంటరీ’ పేరు మీద నడిపారు. దాంతో తర్వాత ఎవరు ఇలా రాసినా, ఆ రాసే ప్రక్రియను ‘వ్యంగ్య పద్యం’ అనకుండా ‘రన్నింగ్ కామెంటరీ’ అంటూ వచ్చారు. క్రికెట్‌ను వినటం తప్ప, చూడలేని రోజులు ఉండేవి.
టీమిండియా ఆడుతుంటే క్రికెట్ అభిమానులు దేశమంతటా పాకెట్ రేడియోలను చెవి దగ్గర పెట్టుకుని ‘రన్నింగ్ కామెంటరీ’ వినేవారు. ఆ క్రీడకేనా కామెంటరీ? రాజకీయ క్రీడకు ఉండవద్దా? అని భావించారో ఏమో దేవీప్రియ తన దైనందిన ‘వ్యంగ్య పద్య’ రచనకు ఈ పేరు పెట్టుకున్నారు.
ఇందుకు అందరూ ‘మాత్రా ఛందస్సు’ను అనుసరించిన వారే. పాఠకుడు గుర్తుపెట్టుకోవటానికో, ధారణ చెయ్యటానికో కాదు. తనలో తాను అనుకోవటానికి సౌకర్యంగా ఉండటానికి. ‘ఛందోబందోబస్తులను చట్ ఫట్ మని తెంచేసిన’ శ్రీశ్రీ కూడా ఈ ‘మాత్రా ఛందస్సు’తో క్రీడించాడు. (మొదటి పాదంలో 12 మాత్రలు, రెండో పాదంలో 11 లేదా 10 మాత్రలు ఉండేవి. లేదా ప్రతీ పాదంలోనూ 12 మాత్రలు ఉండేవి.)
అయితే వ్యంగ్యం ఏమాత్రం లేకుండా, మాత్రా బద్ధంగా రాస్తే అది వ్యంగ్య పద్యం అయిపోదు. వ్యంగ్యం ఉండి అసలు ఛందస్సే లేకపోయినా పాఠకుడు పట్టించుకోడు. కానీ, అలా మెప్పించటం మరీ కష్టం. ఆ పని అలిశెట్టి ప్రభాకర్ చేశాడు. పూర్తిగా వచనకవితలా రాసి ‘ఓహో’ అనిపించుకున్నాడు. రెంటికీ మధ్యస్తంగా రాసే ప్రయత్నం చేశాడు పసునూరి రవీందర్. ‘పసునూరి పంచ్- పొలిటికల్ రన్నింగ్ కామెంటరీ’ పూర్తిగా ‘మాత్రా’బద్ధుడు కాలేదు. అలాగని శుద్ధ వచనకవిత్వాన్ని ఆశ్రయించలేదు.
‘బతకనేర్చినోళ్ళకే
కాలం దాసోహం
నిజాయితీ పరులకు
పేదరికమే బహుమానం
రాజకీయాలకు
అర్థాన్ని మార్చిన తరం
ఇవాళ పెట్టుబడి పెట్టి
రేపు కోట్లు మింగే వ్యాపారం.’
ఇలా సాగుతుంది రవీందర్ వ్యంగ్య పద్య రచన. పెట్టిన పెట్టుబడికి వందల, వేల రెట్ల లాభాలు వచ్చే వ్యాపారం ఒక్క రాజకీయం తప్ప మరేముంటుంది చెప్పండి? వర్తమాన రాజకీయాల మీద చరుపులు చరచాలన్నా, విరుపులు విరవాలన్నా కష్టమే. అనుకుంటాం కానీ, కాలమిస్టులకే కాలం తక్కువ. వారానికో సారి రాయమన్నా, వారం ముగిసేవరకూ రాయాల్సింది పలకదు.
రోజుకోసారి రాయమంటే మరీను. కాలం కుంచించుకుపోతుంది. చివరి గంటలోనే రచన పలుకుతుంది. చివరి క్షణంలో మెరిసిన మెరుపే కవిత కావాలి. బహుశా ఈ కష్టం పసునూరి కూడా పడ్డట్టున్నాడు. అయినా వర్తమాన విషయాలను వదలకుండా వ్యాఖ్యానించాడు. మూడోసారి అధికారంలోకి రావాలని కుతూహల పడే ప్రాంతీయ పార్టీ నుంచి, సకల అగ్రవర్ణ, అగ్రవర్గ జాతీయ పక్షాలకు రేవు పెట్టాడు. 33 శాతం మహిళ సీట్లలో మగపెత్తనాల తీరునూ ఎండగట్టాడు. అలాగే అప్పటికప్పుడే కాకుండా ఎప్పటికప్పుడు తలచుకునే వ్యాఖ్యలూ చేశాడు.
‘నటులూ, నేతలు
కవల పిల్లలవుతారు
జనం ముందు రెచ్చిపోయి
జబర్దస్త్‌గా నటిస్తారు’
ఈ వ్యాఖ్య ఆ కోవలోనిదే. నిజమే కదా? నటులూ, నేతలూ కవలలే కదా? కాకుంటే తేడా ఒక్కటే. నటనలో జీవించాలని నటులూ, జీవితంలో నటించాలని నేతలూ తాపత్రయపడతారు. వ్యంగ్యం స్థానం వ్యంగ్యానిదే. మరో రచనకు రాదు. ప్రపంచ సాహితీ వేత్తలే కాదు మన శ్రీశ్రీ కూడా ఇందుకు ఓటేశాడు.
‘ఆనాడూ ఈ నాడూ
హాస్యానికి విలువ కద్దు
సాహిత్యసభాంగణాన
వ్యంగ్యానిది మొదటి పద్దు’
పత్రికల్లో సరే, హద్దుల్లేని సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ పద్దు కనిపించటంలేదు. ‘వద్దు’ అనిపించే తిట్టో, బూతో, శాపనార్థమో’ రాసి వ్యంగ్యమని సరిపెట్టుకుంటున్నారు. జాలిగొలిపే తిట్టు, జోలపాడే పొగడ్త కన్నా హీనం- అని ఎప్పడు గ్రహిస్తారో ఏమో..! వ్యంగ్యం రాసే వాళ్ళే కాదు, రాయాలని కుతూహల పడేవాళ్ళూ తెలుగు సాహిత్యంలో తగ్గిపోతున్నారు. అలాంటప్పడు ‘ఏమయితే అదయ్యింది. నా పంచ్ నాదే’ అంటూ పసునూరి ముందుకు రావటం ముచ్చట వేస్తుంది.
- సతీష్ చందర్,ప్రముఖ కవి, కథకులు, సీనియర్ సంపాదకులు-
