మినియేచర్ పెయింటింగ్స్ లో మేటి!

మినియేచర్ పెయింటింగ్స్ లో మేటి!

సంస్కృతీ సంప్రదాయాలను ప్రతి కళలోనూ ఇనుమడింపజేసి ప్రపంచానికి చాటుతున్నారు మన కళాకారులు. అందులోనూ ఏడోతరం కళాకారుడిగా సహజమైన రీతిలో పెయింటింగ్స్ వేస్తూ తరతరాలు గుర్తుపెట్టుకునేలా పాపులర్ అయ్యాడు ఈ రాజస్థానీ మినియేచర్ ఆర్టిస్ట్ శమ్మి బన్ను శర్మ.

మనదేశంలోని సంప్రదాయ కళలు అనేక శతాబ్దాలుగా వారసత్వంగా కొనసాగుతున్నాయి. అలాంటి అద్భుతమైన కళా రూపాల్లో చెప్పుకోదగిన రాజస్థానీ మినియేచర్ పెయింటింగ్స్, పిచ్వాయ్ కళను ఏడో తరంగా కొనసాగిస్తున్న ప్రముఖ కళాకారుడు శమ్మి బన్ను శర్మ.

 
1970లో జన్మించిన శమ్మి బన్ను శర్మది జైపూర్‌‌. ఆయన కుటుంబం జైపూర్ స్థాపకుడు మహారాజా సవాయి జైసింగ్ II కాలం నుంచి ఆస్థాన చిత్రకారులుగా పనిచేస్తుంది. ఈ వారసత్వం ఏడు తరాలుగా కొనసాగుతోంది. ఆయన తండ్రి వేద్ పాల్ శర్మను ‘బన్నూజీ’ అని పిలిచేవారు. ఆయన మినియేచర్ ఆర్టిస్ట్, రిస్టోరేషన్ ఎక్స్​పర్ట్. తండ్రి దగ్గరే ‘గురు-–శిష్య పరంపర’లో శిక్షణ పొందాడు శమ్మి. ఈయన పేరు వెనక ‘బన్ను’ అనేది తండ్రి పేరు నుంచి వచ్చిందే.

కెరీర్ బిగినింగ్

రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేశాడు. వాల్ పెయింటింగ్స్, ఫ్రెస్కోస్‌‌లో స్పెషలైజేషన్‌‌తో పాటు1992లో రాజస్థాన్ స్టేట్ స్టూడెంట్ అవార్డ్ అందుకున్నాడు. 1990ల నుంచే తండ్రితో కలిసి జైపూర్‌‌లో మినియేచర్ పెయింటింగ్ స్టూడియో చూసుకునేవాడు.

సహజంగా.. సంప్రదాయంగా..శమ్మి బన్ను శర్మ ఇప్పటికీ సంప్రదాయ ఖనిజ రంగులు (mineral pigments), సహజ పిగ్మెంట్స్ అయిన గొగులి లేదా ఇండియన్ యెల్లో/పియోరి వంటివి ఉపయోగిస్తాడు. ఇది ఆధునిక కళాకారుల్లో అరుదు. రాజస్థానీ మినియేచర్, కిషన్‌‌గఢ్ శైలి, పిచ్వాయ్ పెయింటింగ్స్, మ్యూరల్స్ వంటి వివిధ రూపాల్లో ఆయన నైపుణ్యాన్ని చూడొచ్చు. 

రాధా-కృష్ణుడు, తామర పూలు, గోవులు, పురాణ కథలు ఆయన చిత్రాల్లో ప్రధానం. ఈ పద్ధతులు ఓపిక, భక్తి, సాంప్రదాయ జ్ఞానం కలిగి ఉంటాయి. ఒక చిత్రం పూర్తి చేయడానికి వారాలు లేదా నెలలు పట్టొచ్చు. పిచ్వాయ్ కేవలం కళ కాదు.. ఇది భక్తి, సంస్కృతి, ఆధ్యాత్మికతల అద్భుతమైన వ్యక్తీకరణ.
సంప్రదాయాన్ని ఆధునిక డిజైన్‌‌లతో మేళవించడమే ఆయన ప్రత్యేకత! 

శమ్మి బన్ను శర్మ కేవలం కళాకారుడే కాదు. భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ, భక్తి, సౌందర్యం, సాంప్రదాయాన్ని ఒకచోట చేర్చి ప్రపంచానికి పరిచయం చేస్తున్న గొప్ప వ్యక్తి.
గుర్తింపు2014లో రాజస్థానీ మినియేచర్ పెయింటింగ్స్, పిచ్వాయ్‌‌లలో అసాధారణ సేవలకు నేషనల్ ప్రెసిడెంట్ అవార్డ్ అందుకున్నాడు. 

లండన్‌‌లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో రిస్టోరేషన్ వర్క్‌‌షాప్ నిర్వహించాడు. ఫ్రాన్స్​లోని నాన్సీ ఇండియన్ ఆర్ట్ ఫెయిర్, ఆక్స్‌‌ఫర్డ్, యూనివర్సిటీ ఆఫ్ అయోవాలలో లెక్చర్లు ఇచ్చారు. స్విట్జర్లాండ్, స్పెయిన్ వంటి దేశాల్లో ఎగ్జిబిషన్​లు ఏర్పాటు చేశాడు. 

పిచ్వాయ్ పద్ధతి 

సంప్రదాయంగా మందమైన నేత ఉన్న కాటన్ క్లాత్ లేదా సిల్క్ ఉపయోగిస్తారు. క్లాత్​ను చెక్క ఫ్రేమ్‌‌పై సాగదీసి ఉంచుతారు. గమ్, చాక్ లేదా సున్నం మిశ్రమాన్ని క్లాత్​పై పూసి, బాగా ఆరబెట్టి మృదువుగా అయ్యేలా చేస్తారు. ఇది రంగులు బాగా అంటుకునేలా చేస్తుంది. క్లాత్ చిరిగిపోకుండా ఉంటుంది.

 దానిపై చార్‌‌కోల్, పెన్సిల్ లేదా సన్నని బ్రష్‌‌తో ముందుగా రఫ్ స్కెచ్ గీస్తారు. తర్వాత ఆభరణాలు, గోవులు, లోటస్ ఫ్లవర్స్, గోపికలు, పుష్పాలు, స్వర్ణ ఆకృతులు వంటి సంప్రదాయ మోటిఫ్‌‌లను జాగ్రత్తగా రూపొందిస్తారు. ఈ స్కెచ్ చాలా సూక్ష్మంగా, సమతుల్యంగా ఉండాలి. 

ఆ స్కెచ్​కు సంప్రదాయ ఖనిజ రంగులు (mineral pigments), కూరగాయల నుంచి తీసిన రంగులు (vegetable dyes), సహజ రంగులు ఉపయోగిస్తారు. ఇవి గమ్‌‌తో కలిపి బ్రష్‌‌తో అప్లై చేస్తారు. ఇందులో లేయరింగ్ టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. ఒక్కో రంగును పొరలు పొరలుగా పూయడంతో రిచ్‌‌నెస్ తెస్తారు. 

ఇది చిత్రానికి 3డీ ఎఫెక్ట్ ఇస్తుంది. చాలా సన్నని బ్రష్‌‌లతో ఆభరణాలు, రత్నాలు, గోల్డ్ వర్క్, బీడ్స్, ఫ్లోరల్ ప్యాటర్న్స్ గీస్తారు. తరచుగా గోల్డ్ లేదా సిల్వర్ లీఫ్ ఉపయోగించి ఆభరణాలకు మెరుపు ఇస్తారు. ఇది చిత్రానికి దైవిక ఆకర్షణ ఇస్తుంది. చివరగా షేడింగ్, హైలైట్స్, బ్యాక్‌‌ గ్రౌండ్ డీటెయిల్స్ పూర్తి చేసి, సహజ వార్నిష్ లేదా గమ్ లేయర్ అప్లై చేస్తారు.