పాట్నా: సీఎం నితీష్ కుమార్ ఓ మహిళా డాక్టర్ హిజాబ్ లాగడం బీహార్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. సీఎం నితీష్ కుమార్ తీరుపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. తాజాగా ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ పార్టీ.. నితీష్ కుమార్ చర్యను సిగ్గులేని, నీచమైన ఘటనగా అభివర్ణించింది. ఈ దుర్మార్గం క్షమించరానిదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ అసహ్యకరమైన ప్రవర్తనకు నితీష్ కుమార్ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బీహార్‌లో అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి బహిరంగంగా ఇలాంటి నీచమైన చర్యకు పాల్పడుతున్నాడంటూ రాష్ట్రంలో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళలు ఎంత సురక్షితంగా ఉంటారో ఆలోచించాలని ప్రశ్నించింది.
సోమవారం (డిసెంబర్ 15) పాట్నాలో ముఖ్యమంత్రి నివాసంలో ఆయుష్ డాక్టర్ల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. సీఎం నితీష్ కుమార్ కొత్తగా నియమితులైన ఆయుష్ వైద్యులకు అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు. ఈ క్రమంలో అపాయింట్మెంట్ లెటర్ అందుకోవడానికి వచ్చిన ఒక ముస్లిం మహిళా వైద్యురాలి హిజాబ్ను ఆమె వద్దని నిలువరించినా సీఎం నితీష్ బలవంతంగా లాగారు.
సీఎం చేసిన ఈ పనితో యువ వైద్యురాలు తీవ్ర అసౌకర్యానికి గురైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో సీఎం నితీష్ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మానసిక స్థితి పూర్తిగా గతి తప్పిందని.. తన ప్రవర్తనతో నితీష్ బాబు 100 శాతం సంఘీ అనిపించుకున్నారని ప్రతిపక్ష ఆర్జేడీ ఎద్దేవా చేసింది.
