స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్‌‌‌‌కు ఓటమి తప్పదు : ఎంపీ మల్లు రవి

స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్‌‌‌‌కు ఓటమి తప్పదు : ఎంపీ మల్లు రవి
  • కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి కామెంట్ 

న్యూఢిల్లీ, వెలుగు: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్‌‌‌‌కు ఓటమి తప్పదని ఎంపీ మల్లు రవి అన్నారు. ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే.. తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని బిల్లును ప్రవేశపెట్టి.. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ దగ్గరకు పంపిందని గుర్తు చేశారు. తెలంగాణ హైకోర్టు కూడా.. అక్టోబర్ 30 లోపే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పిందని, ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం 29వ తేదీన లోకల్ బాడీ ఎలక్షన్లు నిర్వహించడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు.  

సీఎం రేవంత్ రెడ్డి.. చిత్తశుద్ధితో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సంకల్పించారని చెప్పారు. అచ్చంపేట మీటింగ్‌‌‌‌లో  రిజర్వేషన్ల  విషయంలో సీఎంపై  కేటీఆర్ చేసిన  వ్యాఖ్యలను ఖండించారు.  రెచ్చగొట్టే మాటలు మానుకోవాలని ఆయనకు హితవు పలికారు. అధికారం పోయి.. ప్రజలు ఛీకొట్టినా.. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు రాక‌‌‌‌పోయినా వారిలో మార్పు రావడం లేదన్నారు.