జూబ్లీహిల్స్ కాంగ్రెస్‌‌దే!.. అన్ని ఎగ్జిట్ పోల్స్‌‌లోనూ అధికార పార్టీకే అనుకూలం

జూబ్లీహిల్స్ కాంగ్రెస్‌‌దే!..  అన్ని ఎగ్జిట్ పోల్స్‌‌లోనూ అధికార పార్టీకే అనుకూలం
  • 46 నుంచి 55 శాతం ఓట్లు వస్తాయని సర్వేల అంచనా
  • సిట్టింగ్ సీటు కోల్పోనున్న బీఆర్ఎస్.. సెకండ్ ప్లేసుకే పరిమితం
  • ఆ పార్టీకి 39 – 45% ఓట్లు వచ్చే చాన్స్
  • మూడో స్థానంలో బీజేపీ..ఓట్ల శాతంలో సింగిల్ డిజిటే    
  • బీజేపీ ఓట్లు బీఆర్ఎస్‌‌కు మళ్లాయనే చర్చ

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్​ విజయం ఖాయమని తెలుస్తున్నది. ఎగ్జిట్‌‌ పోల్స్ అంచనాలన్నీ అధికార పార్టీకే అనుకూలంగా వచ్చాయి. జూబ్లీహిల్స్​ ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థికే పట్టం కట్టారని స్మార్ట్‌‌పోల్, పీపుల్స్‌‌ ఓటింగ్​ వంటి ప్రముఖ సంస్థలు తేల్చి చెప్పాయి. కాంగ్రెస్​ 8 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ‘చాణక్య స్ట్రాటజీస్’ వంటి సర్వే సంస్థలు ప్రకటించాయి. హెచ్‌‌ఎంఆర్‌‌ వంటి సంస్థలు సైతం కాంగ్రెస్సే గెలుస్తుందని స్పష్టం చేశాయి. 

ఇలా ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ కాంగ్రెస్‌‌కే అనుకూలంగా ఉండడంతో, ఇప్పుడు మెజారిటీ ఎంత అనే అంశంపైనే చర్చ జరుగుతున్నది. మొత్తంగా ఈ బైపోల్‌‌లో కాంగ్రెస్‌‌కు 46% నుంచి 55% వరకు ఓట్​షేర్​ లభించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ గెలిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమనే నినాదాన్ని క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్లడం, బీసీ సామాజిక వర్గానికి చెందిన యువ నేత నవీన్​ యాదవ్‌‌కు ఉన్న ప్రజాదరణ అధికార పార్టీకి అనుకూలించగా.. గత పాలనపై ఉన్న అసంతృప్తి బీఆర్ఎస్ పార్టీకి ప్రతికూలంగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి.  ‘స్మార్ట్‌‌పోల్’ సర్వే ప్రకారం కాంగ్రెస్ 48.2% ఓట్​షేర్​సాధించనుండగా, బీఆర్‌‌ఎస్‌‌ 42.1% ఓట్లకే పరిమితం కానుంది. 

ఇరు పార్టీల మధ్య దాదాపు 6.1% ఓట్ల తేడా ఉంటుందని ఈ సర్వే అంచనా వేసింది. ఎస్ఏఎస్ గ్రూప్ నివేదిక ప్రకారం కాంగ్రెస్‌‌కు 46.5% ఓట్లు,  బీఆర్‌‌ఎస్‌‌కు 44.5% ఓట్లు రానున్నాయి. కాంగ్రెస్ 2% ఓట్ల ఆధిక్యంతో గెలుస్తుందని ఈ సర్వే పేర్కొంది.  కాంగ్రెస్‌‌కు 47.85% ఓట్లు , బీఆర్‌‌ఎస్‌‌కు 41.46% ఓట్లు వస్తాయని పీపుల్స్‌‌ ఓటింగ్​సర్వే అంచనా వేసింది. చాణక్య స్ట్రాటజీస్‌‌ సంస్థ కూడా కాంగ్రెస్‌‌కు స్పష్టమైన లీడ్​వస్తుందని చెప్పింది. కాంగ్రెస్‌‌కు 46%, బీఆర్‌‌ఎస్‌‌కు 43% ఓట్లు లభిస్తాయని పేర్కొంది. కాంగ్రెస్‌‌కు 47.5 శాతం, బీఆర్ఎస్‌‌కు 39.25 శాతం, బీజేపీకి 9.31 శాతం ఓట్లు వస్తాయని ఆరా సంస్థ అంచనా వేసింది. కాంగ్రెస్​ఏకంగా 8శాతానికి పైగా ఓట్లతో విజయం సాధించనుందని పేర్కొంది.  

కాంగ్రెస్‌‌కు కలిసొచ్చిన అభివృద్ధి, అభ్యర్థి

కాంగ్రెస్ అభివృద్ధి నినాదం, అభ్యర్థి నవీన్​యాదవ్‌‌కు ఉన్న ఆదరణ, సీఎం రేవంత్​వ్యూహాలు ఆ పార్టీకి కలిసి వచ్చాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విషయంలో ఓటర్లు సానుకూలంగా ఉన్నారని స్మార్ట్‌‌పోల్ సర్వేలో వెల్లడైంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయనే బాగుంటారని 46% మంది ఓటర్లు అభిప్రాయపడగా, ఇది ఆయన ప్రత్యర్థి మాగంటి సునీత (39%) కంటే చాలా ఎక్కువ. ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలని అత్యధికంగా 48.1% మంది ఓటర్లు కోరుకోవడం గమనార్హం. ఇక ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి  పనితీరుపై 34.1% మంది ఓటర్లు 'చాలా బాగుంది' అంటూ సానుకూల అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలపై 30.4% మంది  సంతృప్తిగా ఉన్నట్లు చెప్పగా, 47.9% మంది 'ఫర్వాలేదు' అని సానుకూల ధోరణిని చూపించారు. 

ఈ సానుకూల అంశాలన్నీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపునకు ప్రధాన కారణాలుగా నిలిచాయని సర్వేల విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. డివిజన్ల వారీగా చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ పలు ప్రాంతాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించినట్లు స్పష్టమవుతోంది. స్మార్ట్‌‌పోల్ నివేదిక ప్రకారం రహమత్ నగర్ డివిజన్‌‌లో కాంగ్రెస్ అత్యధికంగా 52.7% ఓట్లను కైవసం చేసుకోనుండగా, వెంకట్రావు నగర్‌‌‌‌లో ఏకంగా 50.4% ఓట్లను సాధించనుంది. బోరబండ (48.4%), యూసుఫ్‌‌గూడ (48.5%) డివిజన్లలో కూడా కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపించనున్నట్లు స్మార్ట్​పోల్​నివేదిక స్పష్టం చేసింది. జన్​మైన్ సర్వే కూడా కాంగ్రెస్ విజయాన్ని ధ్రువీకరించినా, ఇరు పార్టీల మధ్య స్వల్ప ఓట్ల తేడా ఉంటుందని అంచనా వేసింది. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్‌‌కు 42.5% ఓట్లు, బీఆర్‌‌ఎస్‌‌కు 41.5% ఓట్లు లభిస్తాయని పేర్కొంది. ఈ రెండు పార్టీల నడుమ  1% ఓట్ల తేడాను మాత్రమే ఉంటుందని పేర్కొంది. ఈ ఒక్క సర్వేలోనే  బీజేపీకి అత్యధికంగా 11.5% ఓట్లు వస్తాయని అంచనా వేయడం విశేషం. 

బీజేపీకి సింగిల్ డిజిట్..

బీజేపీకి వచ్చే ఓట్ల శాతం సింగిల్ డిజిట్‌‌కే పరిమితమవుతుందని అన్ని సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఆ పార్టీకి 6% నుంచి 7.6% ఓట్లు మాత్రమే లభిస్తాయని పేర్కొన్నాయి. జూబ్లీహిల్స్​ ఎన్నికలను మొదటి నుంచీ బీజేపీ సీరియస్‌‌గా తీసుకోకపోవడం, ఆశించిన స్థాయిలో ప్రచారం చేయకపోవడం వల్ల.. ఆ పార్టీకి చెందిన సంప్రదాయ ఓటర్లు చాలావరకు బీఆర్ఎస్​వైపు మొగ్గు చూపినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో 25,866 (14.11శాతం) ఓట్లు వచ్చినప్పటికీ ఈసారి భారీగా తగ్గడానికి ప్రధాన కారణం ఇదేనని భావిస్తున్నారు. బీజేపీ ఆత్మహత్య చేసుకుని బీఆర్ఎస్‌‌కు అవయవదానం చేస్తోందని ఇప్పటికే సీఎం రేవంత్​సహా కాంగ్రెస్​నేతలు విమర్శించగా, తాజాగా ఎగ్జిట్​పోల్స్​సరళి ఇందుకు ఊతమిస్తోంది.  

ఎగ్జిట్ పోల్స్ అంచనాలివీ (ఓట్ల శాతం)

సర్వే సంస్థ    కాంగ్రెస్    బీఆర్ఎస్    బీజేపీ    ఇతరులు
స్మార్ట్ పోల్             48.2          42.1             7.6            2.1 
హెచ్‌‌ఎంఆర్         48.31        43.18           5.84         2.67
పీపుల్స్ ఓటింగ్    47.84       41.46            8.71        1.99 
ప్రెవర్ మీడియా    47.41       43.13          7.91         1.65   
ఎస్‌‌ఏఎస్ గ్రూప్     46.5        44.5              6.5           2.5 
చాణక్య స్ట్రాటజీస్    46         43                 6              -
జన్‌‌మైన్                   42.5        41.5             11.5           4.5  
ఆరా                          47.49     39.25           9.31             3.95 
వీ6 వెలుగు               50-55     40-45            7-8