కేసీఆర్ ఫాం హౌజ్ లో వరి సాగుపై రచ్చ

కేసీఆర్ ఫాం హౌజ్ లో వరి సాగుపై రచ్చ
  • నిలదీస్తున్న విపక్షాలు, రైతులు
  • డిఫెన్స్ లో టీఆర్ఎస్ నేతలు

హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఫాం హౌజ్ లోని 150 ఎకరాల్లో వరి సాగు చేయటంపై విమర్శలు చుట్టుముడుతున్నాయి. రైతులను వరి వేయొద్దని చెప్పిన కేసీఆర్ తన ఫాంహౌస్ లో మాత్రం వరి పంటనే సాగు చేస్తుండడం జనంలో చర్చనీయాంశమైంది. మొన్నటి వరకు యాసంగిలో రైతులు వరేస్తే ఉరే అన్న టీఆర్ఎస్ నేతలు.. ఫాంహౌస్ లో వరిసాగు బయటపడటంతో ఏం చెప్పాలో అర్ధంకాక తలలు పట్టుకుంటున్నారు.  
వరి వేస్తే ఉరే.... రైతులు యాసంగిలో వరేస్తే మాకైతే జిమ్మిదారి లేదు.. మీ పంటకు మీరే బాధ్యులని రాష్ట్ర రైతులకు సీఎం కేసీఆర్ ఇటీవల వార్నింగ్ ఇచ్చారు. కానీ తన ఫాంహౌస్ లో మాత్రం 150ఎకరాల్లో వరి వేయటం రాష్ట్రంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైతులందరినీ ప్రశ్నార్థకంలోకి నెట్టి సీఎం మాత్రం వరి వేసిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఇదేం విడ్డూరం.. మమ్మల్ని వద్దని.. తను వరి వేయటం ఏంటని రాష్ట్ర రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఫాంహౌస్ లో వరిసాగు.. టీఆర్ఎస్ నేతలను ఇరుకున పెడుతోంది. మొన్నటివరకు యాసంగిలో వరి వేయొద్దని బల్లగుద్ది చెప్పిన టీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు డైలమాలో పడ్డారు. 
ఫాంహౌస్ లో సాగు బయటపడే వరకు వరి ఎవరైనా వేసుకోవచ్చు కానీ ప్రభుత్వం కొనదంటూ కవర్ చేసుకునే పనిలో పడ్డారని విమర్శలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్ పంటను సర్కార్ కొంటే తప్పుగానీ ఆయన వడ్లు వేసుకోవటంలో తప్పేమీ లేదన్నట్లు టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు.సీఎం కేసీఆర్ వరి వేయడంపై ప్రతిపక్షాలకు మంచి అస్త్రం దొరికనట్లైంది. ఏ కంపెనీతో ఒప్పందం చేసుకొని సీఎం కేసీఆర్ వరి వేశారో చెప్పాలని టార్గెట్ చేశాయి కాంగ్రెస్, బీజేపీ. దీంతో టీఆర్ఎస్ నేతలు ఏం సమాధానం చెప్పాలో అర్థంకాక తలో సమాధానం చెప్తున్నారు. అసలు ఫామ్ హౌస్ లో 150 ఎకరాల భూమి లేదని కొందరు.. సీఎం తన కుటుంబం తినేందుకు వరి వేసుకున్నారని మరికొందరు చెబుతున్నారు. కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకున్న వాళ్లు ఎవరైనా వరి వేసుకోవచ్చని ఇంకొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇవన్నీ... ఏదో కవర్ చేసుకునే ప్రయత్నాలే తప్ప.. మరొకటి లేదని.. టీఆర్ఎస్ నేతలు రైతుల్ని ఆగం చేశారని విమర్శలు చేస్తున్నారు విపక్ష నేతలు. 
చాలా మంది టీఆర్ఎస్ నేతలైతే సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో వరిసాగుపై స్పందించేందుకు వెనకాముందు ఆలోచిస్తున్నారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వీడియోలు, ఫోటోలు బయట పెట్టినా.. ఏమో ఫాం హౌస్ చూసింది లేదు.. అక్కడ ఎన్ని ఎకరాల భూమి ఉందో తెలిసింది లేదు. అయితే కేసీఆర్ వరి వేయటం వెనక ప్లాన్ ఏంటో తెలియదని కొందరు నేతలు అంటున్నారు. ఈ విషయంపై ఏం మాట్లాడితే ఏమవుతుందొనని అంటున్నారు. కానీ కేసీఆర్ వరి వేయటంపై రైతులకు ఏం సమాధానం చెప్పాలని కొందరు నేతలు అంటున్నారు. 
కేసీఆర్ చేసుకున్నట్లు రైతులకు కూడా కంపెనీలతో అగ్రిమెంట్ చేయించే బాధ్యత టీఆర్ఎస్ నేతలకు లేదా అనే ప్రశ్నలు రైతాంగం నుంచి వినిపిస్తున్నాయి. మా దగ్గర వరికొని కేంద్రానికి రా రైస్ ఇస్తారో.. బాయిల్డ్ రైస్ ఇస్తారో మీ ఇష్టం అని చాలామంది రైతులు ఇప్పటికే వరి వేసుకుంటున్నారు. వీరికి ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలో తెలియక టీఆర్ఎస్ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. గతేడాది కూడా రైతులందరిని సన్నవడ్లు వేసుకోండని చెప్పి.. సీఎం కేసీఆర్ మాత్రం దొడ్లు వేసుకున్నారు. రైతులు తక్కువ రేటుకు అమ్ముకొని నష్టపోయినా.. ప్రభుత్వం ఒక్కరూపాయి కూడా బోనస్ ఇవ్వక విమర్శలపాలైంది. ఇప్పుడు.. యాసంగిలో రైతుల్ని వరి సాగు చేయొద్దని పదే పదే చెప్పి... సీఎం కేసీఆర్ వరి వేయడంతో టీఆర్ఎస్ డిఫెన్స్ లో పడింది. కేంద్రంపై నెపం వేసి యాసంగిలో వరి వేయొద్దన్న నేతలు ఇప్పుడు తెల్లమొహం వేస్తున్నారు.

 

 

ఇవి కూడా చదవండి

హలీం ప్రియులకు శుభవార్త.. 2 నిమిషాల్లో రెడీ

టీకాలు తీసుకోని వారిలో కోవిడ్ ప్రభావం ఎక్కువ

బంగారు గని కూలి 38 మంది మృతి