కరోనా గురించి ఆందోళన అవసరం లేదు : డా.కిరణ్​మాదాల

కరోనా గురించి ఆందోళన అవసరం లేదు : డా.కిరణ్​మాదాల
  • బాడీలో సెల్​ మెడియటేడ్ ఇమ్యూనిటీతో మనం భద్రం 
  • మన దేశంలో ఇమ్యూనిటీ పవర్​ ఎక్కువే 
  • ఒమిక్రాన్​ వేరియంట్​ వ్యాప్తి చెందుతున్న వార్తలో నిజం లేదు 
  • డబ్ల్యూహెచ్ఓ నిర్ధారించలేదు
  • గాంధీ క్రిటికల్ కేర్​ మెడిసిన్​హెచ్ఓడీ ప్రొఫెసర్​ కిరణ్ ​మాదాల

పద్మారావునగర్, వెలుగు: కొవిడ్​భూతం ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మళ్లీ వ్యాప్తి చెందుతోందన్న వార్తలు కలవరపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గాంధీ దవాఖాన క్రిటికల్​కేర్​మెడిసిన్​హెచ్ఓడీ ప్రొఫెసర్​డా.కిరణ్​మాదాల కరోనా వ్యాప్తి, కొత్త వేరియంట్లు, నివారణ చర్యలు, ముందస్తు జాగ్రత్తలపై మాట్లాడారు. కొవిడ్–​19 ఒకటి, రెండో దశల్లో ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిన తర్వాత పలు వేరియంట్లతో దాని వ్యాప్తి కొనసాగుతునే ఉందన్నారు. 2021లో డెల్టా, 2022లో ఒమిక్రాన్​వేరియంట్ల తర్వాత కరోనా వైరస్​ప్రభావం బాగా తగ్గిందన్నారు. తర్వాత కొవిడ్ కేసులు నమోదైనప్పటికీ ప్రారంభ దశలో ఉన్నంత ప్రభావం లేదన్నారు. ఇంటర్నేషనల్​కనెక్టివిటీ బాగా ఉన్నటువంటి హాంకాంగ్, సింగపూర్​దేశాల్లో ఇప్పుడు కరోనా కేసులు నమోదవుతున్నాయనే వార్తలు వస్తున్నాయని, మనదేశంలో ఎక్కడా కొవిడ్​కేసులు పెరగలేదన్నారు. 

గతంలో జేఎన్​-వన్, ఎక్స్​బీబీ వేరియంట్ కేసులు నమోదయ్యాయన్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్ ​వేరియంట్​జాతికి సంబంధించిన వేరియంట్లు​తిరిగి వ్యాప్తి చెందుతున్నాయని వైద్య నిపుణులు భావిస్తున్నారని, కానీ డబ్ల్యూహెచ్ఓ ఇంకా నిర్ధారించలేదన్నారు. ప్రజల్లో రెండు రకాల ఇమ్యూనిటీ ఉంటుందని, గతంలో మనం తీసుకున్న వ్యాక్సిన్లతో వచ్చిన ఇమ్యూనిటీ బాడీలో నుంచి వెళ్లిపోయినప్పటికీ సెల్​మెడియటేడ్​ఇమ్యూనిటీ ఎప్పటికీ మన బాడీలో ఉంటుందన్నారు. 

మన దేశంలో సాధారణంగా ఇమ్యూనిటీ పవర్​ఎక్కువ అన్నారు. కొవిడ్​ కేసులు, శ్వాస సంబంధిత సమస్యల్లో కొవిడ్​శాతంపై ఎప్పటికప్పుడు ఐసీఎమ్ఆర్​డేటా మెయింటెయిన్​చేస్తోందన్నారు. తాజాగా ఐసీఎంఆర్​విడుదల చేసిన గణాంకాల ప్రకారం శ్వాసకోశ సంబంధిత ఇన్​ఫెక్షన్లలో కొవిడ్ కేసులు కనీసం 60 శాతంపైన ఉంటున్నాయని తెలిపారు. పోస్ట్​కొవిడ్​సమయంలో మనం వాడిన స్టెరాయిడ్స్​కారణంగా తర్వాత ఇమ్యూనిటీ తగ్గి బ్లాక్​ఫంగస్​కేసులు నమోదయ్యాయన్నారు. కానీ, బ్లాక్​ఫంగస్​అనేది వేవ్​కాదన్నారు. ప్రజలు శుభ్రంగా ఉంటూ, మాస్కులు ధరిస్తే వైరస్​ల ప్రభావాన్ని తగ్గించవచ్చని డాక్టర్​కిరణ్​మాదాల పేర్కొన్నారు.