
హైదరాబాద్: హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్ నిర్వహించింది. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ నిర్వహించారు. అన్ని జిల్లాల జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. అనంతపురం జూనియర్ NTR ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ నరేందర్ చౌదరి మాట్లాడుతూ.. ఈ ప్రెస్ మీట్ను అడ్డుకోవాలని కుట్రలు చేశారని చెప్పాడు.
తమ అభిమాన హీరో జూనియర్ NTR, కళ్యాణ్ రామ్లను కలవాలని అనుకున్నామని, అయితే వారు అందుబాటులో లేరని తెలిపాడు. తాము జూనియర్ NTRకి ఈ సమయంలో అండగా ఉంటామని ఫ్యాన్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ సమయంలో సైలెంట్గా ఉంటే తమ చేతగాని తనం అనుకుంటారని, తమకు తల్లి లాంటి జూనియర్ NTR తల్లి షాలినిపై ఈ విధంగా మాట్లాడడం దారుణం అని ఫ్యాన్స్ అసోసియేషన్ ఖండించింది. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారని, ఏ తల్లిపై ఇలా మాట్లాడకూడదని జూనియర్ NTR ఫ్యాన్స్ హితవు పలికారు.
దగ్గుబాటి ప్రసాద్ వెనకాల తమ నందమూరి టీడీపీ జెండా ఉందని, అందుకే కొంత ఆలోచిస్తున్నామని.. లేదంటే తగిన బుద్ధి చెప్పేవాళ్ళమని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. తనకు ప్రాణహాని ఉందని దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అంటున్నాడని, అది అవాస్తవమని అనంతపురం జూనియర్ NTR ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ నరేందర్ చౌదరి చెప్పారు.
ALSO READ : ఎయిర్టెల్, జియో ప్రీపెయిడ్ యూజర్లకు బిగ్ షాక్ !
ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలతో ఫ్యాన్స్కు పార్టీకి గ్యాప్ వచ్చే అవకాశం ఉందని, మళ్ళీ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్పష్టం చేశారు. సిగ్గు తెచ్చుకొని దగ్గుబాటి క్షమాపణ చెప్పాలని, అభిమానుల అందరి సమక్షంలో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర, దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని, ఆయన ఇంటి ముందు ధర్నాలు చేసి ముట్టడిస్తామని హెచ్చరించారు.