బస్వాపురం నిర్వాసితులకు పరిహారం అందించాలి : ఎస్.వీరయ్య

బస్వాపురం నిర్వాసితులకు పరిహారం అందించాలి : ఎస్.వీరయ్య
  • సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య  

యాదాద్రి, వెలుగు:  బస్వాపురం రిజర్వాయర్​పూర్తి చేయడానికి నిధులు విడుదల చేయడంతోపాటు నిర్వాసితులకు పరిహారం అందించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య డిమాండ్ చేశారు. రిజర్వాయర్ నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ముంపు గ్రామాల నిర్వాసితులతో ముఖాముఖి మాట్లాడారు. అనంతరం విలేకరుల సమావేశంలో వీరయ్య మాట్లాడుతూ రిజర్వాయర్​ నిర్మాణంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. నిర్మాణం కోసం వెంటనే రూ.500 కోట్లు విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. రిజర్వాయర్ పూర్తయితే కొత్త ఆయకట్టు ఏర్పడి సాగు పెరుగుతుందన్నారు. రిజర్వాయర్​ కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులు ఇప్పటికే ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 

పైగా వారికి పరిహారం మొత్తం అందించకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ముంపు నిర్వాసితులందరికీ పరిహారం అందించడంతోపాటు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్​ చేశారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూమికి భూమి ఇవ్వడంతోపాటు  భూమి మీద ఆధారపడిన వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులకు కూడా పరిహారం చెల్లించాలని కోరారు. ఆయన వెంట సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా లీడర్లు కల్లూరి మల్లేశం, దాసరి పాండు, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దయ్యాల నర్సింహ, సిర్పంగి స్వామి, మాయ కృష్ణ, గడ్డం వెంకటేశ్, మద్దేపురం రాజు, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య ఉన్నారు.