
- సోషల్ మీడియాలో ప్రముఖుల డీప్‌ఫేక్ వీడియోలతో ప్రచారం
- గుర్తుపట్టలేనంతగా ముఖ కవళికలు, భాష, హావభావాలు క్రియేట్
- ప్రభుత్వ పథకాల పేరుతో పెట్టుబడులకు ఎర
- వీడియోల కింద లింకులు ఇస్తూ కోట్లలో మోసాలు
- ఇటీవల నిర్మలా సీతారామన్ డీప్‌ఫేక్ వీడియో తెగ వైరల్
- నమ్మి రూ.20 లక్షలు పోగొట్టుకున్న హైదరాబాద్ వాసి
- అంబానీ ప్రమోట్ చేసినట్టుగా ఫేక్ షేర్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్
యూట్యూబ్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్.. ఇలా ఏ సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసినా ఇటీవల పెట్టుబడులకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వీడియో తెగ వైరల్ అవుతున్నది. ‘‘చాలామంది నకిలీ వెబ్‌సైట్‌లలో డబ్బు పెట్టి మోసపోతుంటారు. ఇకపై అలాంటి తప్పు చేయొద్దు. ఈ వీడియో కింద ఇచ్చిన లింక్ ద్వారా అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వండి. మీరు 21 వేలతో అకౌంట్ ప్రారంభించగానే ఏఐ ఆధారిత ట్రేడింగ్ సిస్టమ్ రంగంలోకి దిగి మీ డబ్బును ఉత్తమమైన మార్గాల్లో పెట్టుబడులు పెట్టి, మీకు మంచి రిటర్న్స్ ఇస్తుంది. ఆరు నెలలుగా చాలామంది నెలకు రూ.10 లక్షల చొప్పున సంపాదిస్తున్నారు’’ అంటూ అత్యంత నమ్మకంగా చెబుతుంటారు. నిజానికి అందులో ఉన్నది నిర్మలా సీతారామన్ కాదు. సైబర్ నేరగాళ్లు ఏఐతో సృష్టించిన డీప్‌ఫేక్ వీడియో. ఈ ఫేక్ వీడియోను చూసి హైదరాబాద్‌కు చెందిన 71 ఏండ్ల రిటైర్డ్ డాక్టర్ రూ.20 లక్షలు పెట్టి మోసపోయాడు.
హైదరాబాద్, వెలుగు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వచ్చాక సోషల్ మీడియాలో ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చుకోలేని పరిస్థితి. ఇదే అదనుగా ఏఐని వాడుకుంటూ సోషల్ మీడియా అడ్డాగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవల ‘డీప్ ఫేక్’ను అస్త్రంగా చేసుకుని ప్రముఖుల ముఖాలను, మాటలను వాడుకుంటూ జనాన్ని నమ్మించి కోట్లు కొల్లగొడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయంటూ నకిలీ స్కీములను ప్రచారంలోకి తెస్తూ పెట్టుబడుల పేరుతో నిలువునా ముంచుతున్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, షేర్‌మార్కెట్ నిపుణులు, పారిశ్రామికవేత్తలు, సినీ నటుల డీప్‌ఫేక్ వీడియోలను వాట్సాప్, ఇన్‌స్టా, ఎక్స్, ఫేస్‌బుక్, స్నాప్‌చాట్ తదితర ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోల్లో ఆయా ప్రముఖుల ముఖ కవళికలు, భాష, హావభావాలు ఏమాత్రం ఫేక్ అని గుర్తుపట్టలేనట్టుగా ఉంటున్నాయి.దీంతో సామాన్యులు మొదలుకొని విద్యావంతుల దాకా వారు చెప్పిన వెబ్‌సైట్‌లలో డబ్బులు పెట్టి మోసపోతున్నారు. ఈ తరహా మోసాలపై ఇటీవల ఫిర్యాదులు పెరగడంతో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌సీఆర్‌పీ) అలర్ట్ అయింది. 2022 నుంచి----2024 మధ్య కాలంలో తమకు 12 వేల ఫిర్యాదులు అందాయని వెల్లడించింది. ఇటీవల వస్తున్న డీప్ఫేక్వీడియోల్లో నిజానిజాలను గుర్తించడం తమకు సైతం కష్టంగా మారిందని చెబుతున్నది. ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరోలో ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ చెక్ యూనిట్ కూడా 2019 నుంచి 2025 మధ్య కాలంలో సుమారు 50 వేల ఫేక్‌న్యూస్‌ను గుర్తించినట్లు ఇటీవల స్పష్టం చేసింది. రాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగంలో 2023--–25 మధ్య డీప్ ఫేక్ సంబంధిత ఫిర్యాదులు 300 నమోదయ్యాయి.
రూ.14.47 కోట్లు హుష్ కాకి..
ప్రముఖులతో రూపొందిస్తున్న డీప్ ఫేక్ వీడియోల ద్వారా మోసాలు ఇటీవల పెరుగుతున్నాయి. గతేడాది జనం రూ.14.47 కోట్లు నష్టపోయారని నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ గణాంకాలు చెప్తున్నాయి. ఈఏడాది వివరాలు ఇంకా బయటకు రానప్పటికీ ఈ మొత్తం అనేక రెట్లు పెరిగిఉంటుందని అంచనా. ఈ డీప్ఫేక్వీడియోల్లో ఏ మాత్రం గుర్తించలేని ‘జనరేటివ్ అడ్వర్షియల్ నెట్‌వర్క్ టెక్నా లజీ’ని సైబర్‌నేరగాళ్లు వినియోగిస్తున్నట్లు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలను సైబర్ నిపుణులు, అత్యాధునిక టూల్స్ వాడే వాళ్లు తప్ప ఇతరులు గుర్తించే అవకాశాలు లేవంటున్నారు. ఈ క్రమంలో సైబర్‌నేరగాళ్లు ఎస్‌బీఐ సహా పలు జాతీయ బ్యాంకుల పేర్లతో డీప్‌ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. బ్యాంక్ లోగోను వాడుకుంటూ అనేక రకాల స్కీమ్స్ఆఫర్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇటీవల ప్రముఖుల పేర్లతో వచ్చే వీడియోలు, ఫొటోలు, ఈ మెయిల్స్, టెక్స్ట్, కాల్స్, వీడియో కాల్స్.. నిజమైనవా? కాదా? అని గుర్తించడం సైబర్క్రైమ్విభాగాలకు సాధ్యం కావడం లేదు. ఒకదానిని గుర్తించి, వెరిఫై చేసుకొని తొలగించేసరికి వందల్లో కొత్త వీడియోలు అప్లోడ్అవుతున్నాయి. ప్రస్తుతం షేర్‌మార్కెట్, మ్యూచ్‌వల్‌ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్చేసే వారి సంఖ్య భారీగా పెరుగుతున్నది. సోషల్ మీడియా పుణ్యమా అని షేర్మార్కెట్మీద ఎలాంటి అవగాహన లేని సామాన్యులు సైతం
పెట్టుబడులకు ఆసక్తిచూపుతున్నారు. ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్‌కు తెర తీశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి సెలబ్రెటీల వీడియోలను డీప్ ఫేక్ చేసి సోషల్ మీడియా ద్వారా వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోల కిందే క్యూఆర్ కోడ్స్, హ్యాకింగ్ చేసేందుకు అవసరమైన లింకులు పెట్టి తాము చెప్పిన కంపెనీల అకౌంట్లలో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని సూచిస్తున్నారు. ఒక్కసారి వారు చెప్పిన అకౌంట్లలో డబ్బులు వేయగానే భారీగా లాభాలు వచ్చినట్టు చూపి మళ్లీ మళ్లీ డిపాజిట్ చేసేలా రెచ్చగొడుతున్నారు. తాము చెప్పే దాకా ఆయా అకౌంట్ల నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవద్దని, సైబర్‌నేరగాళ్లు కండీషన్పెడుతుండడంతో నిజమేనని నమ్ముతున్న బాధితులు పెద్దమొత్తంలో కోల్పోయేదాకా మోసాన్ని గుర్తించలేకపోతున్నారు.
డీప్ ఫేక్‌తో వీడియో కాల్స్ కూడా..
డీప్ ఫేక్ వీడియోలే కాదు.. ఏఐ టెక్నాలజీతో ఫేక్ ఆడియో, వీడియో కాల్స్ చేసి సైబర్‌నేరాలకు పాల్పడుతున్నారు. ఇందుకోసం డార్క్‌వెబ్ సహా వివిధ మార్గాల్లో ఫోన్ నంబర్లను కొనుగోలు చేస్తున్నారు. ఆయా నంబర్లతో వాట్సప్, ఇతర సోషల్ మీడియా అకౌంట్లను యాక్సెస్ తీసుకొని వీడియో, ఫొటోలతో డీప్ ఫేక్‌లు క్రియేట్ చేస్తున్నారు. వాటి ద్వారా ర్యాండమ్‌గా వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు. అచ్చుగుద్దినట్టు ఫ్రెండ్స్, రిలేటివ్స్, కొలిగ్స్లా మాట్లాడుతూ హెల్త్ ఎమర్జెన్సీ పేరుతో డబ్బులు అడుగుతున్నారు. తాము ఇచ్చిన నంబర్‌కు గూగుల్‌పే లేదా ఫోన్‌పే చేయాలని కోరుతున్నారు. ఇలా తమ ట్రాప్‌లో చిక్కిన వారి నుంచి రూ.10 వేల నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఇలాంటి మెసాల్లో ఐటీ, ప్రభు త్వ ఉద్యోగులు ఎక్కువగా ఉంటున్నారు. ఇందుకు కారణం వీరంతా బిజీగా ఉన్న సమయంలో డీప్ ఫేక్ కాల్స్‌ను అంతగా పరిశీలించే అవకాశాలు లేకపోవడమే. గత రెండేండ్లలో దేశవ్యాప్తంగా సుమారు 50 వేల డీప్ ఫేక్ వీడియోలు, ఆడియోల ద్వారా సైబర్‌నేరగాళ్లు మోసాలకు పాల్పడినట్లు ఎన్‌సీఆర్‌పీ గుర్తించింది.
బాధితులు 1930కి ఫిర్యాదు చేయాలి
ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్‌లో డీప్ ఫేక్ కీలకంగా మారింది. ప్రముఖులు ప్రమోట్ చేస్తున్నట్టు క్రియేట్ చేసిన వీడియోలను చూసి చాలా మంది మోసపోతున్నారు. నిజమేనని నమ్మి పెట్టుబడులు పెడుతున్నారు. షేర్ మార్కెట్, బ్యాంకులు, ప్రభుత్వ పథకాల పేరుతో ట్రాప్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే వీడియో నకిలీదా, నిజమైనదా? అని నిర్ధారించుకునేందుకు రాష్ట్రంలో ఫ్యాక్ట్ చెక్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. మోసపోయిన బాధితులు 1930 లేదా cybercrime.gov.in లో రిపోర్ట్ చేయాలి. 87126 72222 వాట్సాప్ నంబర్ ద్వారా సమాచారం అందించాలి.
- శిఖాగోయల్, డైరెక్టర్, టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో
రాజీవ్‌శర్మ ట్రేడ్గ్రూప్నకు చెందిన ‘బీసీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అకాడమీ’లో పెట్టుబడులు పెడితే పెద్దమొత్తంలో లాభాలు వస్తాయంటూ ముఖేష్ అంబానీ ప్రమోట్ చేస్తున్నట్టుగా ఇన్‌స్టాలో ఓ వీడియో వైరల్ అయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అప్‌లోడ్ చేసిన ఆ వీడియో చూసి ముంబైకి చెందిన డాక్టర్ కేకే హెచ్ పాటిల్ అట్రాక్ట్ అయ్యారు. ఆ అకాడమీని ముఖేష్ అంబానీ ప్రమోట్ చేస్తునట్టుగా నమ్మి మరిన్ని వివరాల కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేశారు. లండన్, ముంబైలోని బాంద్రాలో షేర్‌ట్రేడింగ్ అకాడమీ ఆఫీస్లున్నట్టు తెలుసుకుని మే 28 నుంచి జూన్ 10 మధ్య రూ.7.1 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లోని ఆమె అకౌంట్లో రూ.30 లక్షలు లాభం వచ్చినట్టు చూపారు. దీంతో పాటిల్ అమౌంట్ విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించారు. వీలుకాకపోవడంతో మోసపోయానని గుర్తించి ముంబై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.