తలుపులు ఇరగవట్టె.. కిటికీలు పలగవట్టె..ఇండ్లియ్యరాయె!

తలుపులు ఇరగవట్టె.. కిటికీలు పలగవట్టె..ఇండ్లియ్యరాయె!
  • పడావువడుతున్న డబుల్​ బెడ్రూం ఇండ్లు
  • మంజూరు సుమారు 3 లక్షలు ఆరేండ్లలో లక్ష కూడా కట్టలే
  • కట్టడం పూర్తయినా 85% ఇండ్లు ఖాళీనే 
  • లబ్ధిదారులు ఆందోళన చేస్తున్నా స్పందించని సర్కారు 

వెలుగు, నెట్​వర్క్:  గూడు లేని పేదల కండ్లు కాయలు కాస్తున్నా డబుల్​ బెడ్రూం ఇండ్లు మాత్రం వస్తలేవు. గ్రేటర్​ హైదరాబాద్​తో కలిపి సుమారు 3 లక్షల ఇండ్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఆరేండ్లలో కట్టిన ఇండ్లు కేవలం లక్ష లోపే! వాటిని సైతం లబ్ధిదారులకు కేటాయించడంలో సర్కారు తీవ్ర జాప్యం చేస్తోంది. కొన్నిచోట్ల ఇండ్లు పూర్తయ్యి ఏడాది, రెండేళ్లు గడుస్తున్నా కేటాయించకపోవడంతో మెయింటెనెన్స్​ లేక దెబ్బతింటున్నాయి. చాలాచోట్ల క్వాలిటీ లేక గోడలు నెర్రెలు బారుతున్నాయి.  డోర్లు విరిగి, కిటికీ అద్దాలు పగిలి, ఊడి అధ్వానంగా తయారవుతున్నాయి. మరోవైపు అన్నిచోట్ల అర్హుల నుంచి అప్లికేషన్లు తీసుకున్న ఆఫీసర్లు ఇండ్లను మాత్రం అలాట్​ చేస్తలేరు. చాలాచోట్ల అప్లికేషన్లు ఎక్కువగా ఉండడం, ఇండ్లు తక్కువగా ఉండడం వల్ల, కొన్నిచోట్ల రాజకీయ జోక్యం వల్ల పెండింగ్​లో పెడుతున్నారు. దీంతో పూర్తయిన ఇండ్లను తమకు వెంటనే కేటాయించాలని డిమాండ్​ చేస్తూ జనం రోజుకోచోట ఆందోళనకు దిగుతున్నారు. 
మూడు జిల్లాల్లో ఒక్క ఇల్లూ కట్టలే..
నాగర్​కర్నూల్, వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క ఇల్లూ కంప్లీట్​ కాలేదు. నాగర్​కర్నూల్​ జిల్లాలో 3,201 ఇండ్లు మంజూరు చేయగా 1,167 చోట్ల మాత్రమే కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు.  వికారాబాద్ జిల్లాలో​4,323 ఇండ్లు సాంక్షన్​ చేయగా, 1,977 చోట్ల, నారాయణపేట్​ జిల్లాలో1,803 ఇండ్లు మంజూరు చేయగా 900 చోట్ల టెండర్లు ఫైనల్​ అయ్యాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో​ 1,223 ఇండ్లు మంజూరు చేయగా కేవలం 5 ఇండ్లు,  మంచిర్యాల జిల్లాలో 3,992 ఇండ్లు మంజూరు చేయగా,  72 ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయి.

రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు 5.74 లక్షల డబుల్ బెడ్‍రూం ఇళ్లను నిర్మిస్తామని 2 014 ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్​ఎస్​ ప్రకటించింది. కానీ గడిచిన ఆరేండ్లలో గ్రేటర్​ హైదరాబాద్​లో లక్ష, జిల్లాల్లో 1,91,057.. మొత్తంగా 2లక్షల 91వేల 57 ఇండ్లను రాష్ట్రప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో ఇప్పటి వరకు 98,978 ఇండ్లను మాత్రమే నిర్మించగలిగింది. వీటిలో 15శాతం ఇండ్లను  కూడా లబ్ఢిదారులకు కేటాయించలేదు. గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో 51,346 ఇండ్లు కంప్లీట్​ కాగా, ఇప్పటివరకు 3,466 ఇండ్లనే అందజేశారు. అటు జిల్లాల్లో, ఇటు జీహెచ్​ఎంసీ పరిధిలో పూర్తయిన ఇండ్లను అర్హులకు కేటాయించేందుకు సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది. ఎలాగోలా ఫీల్డ్​ ఎంక్వైరీ చేసి  లిస్టులు తయారు చేశాక అధికార పార్టీ లీడర్ల జోక్యం మొదలవుతోంది. అర్హత లేకున్నా తమ అనుచరులు, టీఆర్‌ఎస్ మద్దతుదారుల పేర్లను లిస్టుల్లో చేర్చాలని ఒత్తిడి తెస్తున్నారు. ఇలా లీడర్ల ఒత్తిళ్లకు లొంగి అనర్హులను లిస్టుల్లో చేరిస్తే అర్హులు ఎదురు తిరుగుతున్నారు. దీంతో ఆఫీసర్లు ఇండ్ల అలాట్​మెంట్​ను వాయిదా వేస్తూ వస్తున్నారు. ఫలితంగా చాలాచోట్ల పేదలు తమకు ఇండ్లు ఇవ్వాలంటూ ఆందోళనకు దిగడమే గాక తాళాలు పగలగొట్టి గృహప్రవేశాలు చేస్తున్నారు. ఆఫీసర్లూ పోలీసుల సాయంతో జనాన్ని  బయటకు పంపి మళ్లీ తాళాలు వేయిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా​ డబుల్ ఇండ్ల వద్ద ఇటీవల ఇలాంటి సీన్లే కనిపిస్తున్నాయి. సమస్యకు పరిష్కారం చూపాల్సిన సర్కారేమో  తమాషా చూస్తోంది. 
ఏ జిల్లాలో చూసినా.. 
కరీంనగర్ జిల్లాలో 789 ఇండ్లు పూర్తయితే ఇప్పటివరకు 267 ఇండ్లను మాత్రమే లబ్ధిదారులకు అందజేశారు. మెయింటనెన్స్​లేక కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్​లో నిర్మించిన ఇండ్ల కిటికీలు ఊడిపోతున్నాయి. తిమ్మాపూర్ మండలం అల్గునూరు గ్రామంలో కట్టిన16 ఇండ్లు నిర్మాణంలో ఉండగానే పగుళ్లు పెడుతున్నాయి. స్లాబ్‌లు సరిగ్గా పోయకపోవడంతో ఇండ్ల మీదే నీళ్లు నిలిచి లోపలికి ఉరుస్తున్నాయి.  జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని భూపాలపల్లి మున్సిపాలిటీలో 500 కు పైగా డబుల్ బెడ్ రూం ఇండ్లు కంప్లీట్​ అయ్యాయి. మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి హయాంలో నిర్మించడం వల్ల ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి  ఈ ఇళ్లను ప్రారంభించడంలో జాప్యం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరులో 536 ఇండ్లు కంప్లీట్ అయినప్పటికీ ప్రారంభించట్లేదు. ములుగులో కాంగ్రెస్​ ఎమ్మెల్యే సీతక్క ఉండటం వల్ల ఆమె చేత ఓపెన్​ చేయించేందుకు ఆఫీసర్లు ముందుకు రావట్లేదని ప్రచారం జరుగుతోంది.  మెదక్ టౌన్​లో 800, తూప్రాన్‌లో 350, రామాయంపేటలో 300, నర్సాపూర్ లో 200 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం  పూర్తయ్యి ఏడాదిన్నర, రెండేళ్లు అవుతున్నా లబ్ధిదారులను ఎంపిక చేయట్లేదు. నిర్మించిన ఇండ్లు తక్కువగా ఉండడం, లబ్ధిదారులు ఎక్కువ ఉండడంతో ఎవరికి అలాట్​ చేసినా  ఇబ్బందులు ఎదురవుతాయని ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు  ఇండ్ల అలాట్​మెంట్​ను  పక్కనపెట్టేశారు. 

సూర్యాపేట జిల్లా జమునా నగర్‌లో రూ.2.62 కోట్లతో 52 ఇండ్లను 2018లో మొదలుపెట్టారు. రెండేళ్లలో దాదాపు 80 శాతం పనులు పూర్తి కాగా, బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్  మధ్యలోనే పనులను నిలిపివేశాడు. దీనితో ఇండ్ల కోసం ఆశలు పెట్టుకున్న స్థానికులు డబుల్ బెడ్ రూం ఇండ్ల పక్కనే రెండేళ్లుగా ఇలా గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు.

జిల్లా    పూర్తయిన ఇళ్లు     పంపిణీ చేసిన ఇళ్లు 
గ్రేటర్​ హైదరాబాద్​     51,346    3,466
సంగారెడ్డి     2,301    90
మెదక్     1,742    269
సిద్దిపేట     8,647    3,356
ఆదిలాబాద్    504    ––
నిర్మల్     2,207    145
మంచిర్యాల    962     30
నిజామాబాద్     1,534    526
కామారెడ్డి    3,490    885
సూర్యాపేట    2,493    414
యాదాద్రి     670    ––
వరంగల్  రూరల్​    536    210
జిల్లా    పూర్తయిన ఇళ్లు     పంపిణీ చేసిన ఇళ్లు
వరంగల్ అర్బన్     860    208
మహబూబాబాద్    1,482    895
జయశంకర్​ భూపాలపల్లి    800    ––
ములుగు     604    30
జనగామ     652    163
కరీంనగర్    789    267
పెద్దపల్లి     262    ––
జగిత్యాల    1,700     620
మహబూబ్​నగర్     2,456    1,150
జోగులాంబ గద్వాల    605    ––
వనపర్తి    680    314 
భద్రాద్రి కొత్తగూడెం    2,008    1,164