కీలక పోరులో పంజా విసిరిన ఢిల్లీ

కీలక పోరులో పంజా విసిరిన ఢిల్లీ

నవీ ముంబై:ప్లేఆఫ్స్ రేసులో ముందడుగు వేసేందుకు కీలకమైన మ్యాచ్‌‌‌‌లో -ఢిల్లీ క్యాపిటల్స్ పంజా విసిరింది.  సోమవారం జరిగిన మ్యాచ్​లో 17 రన్స్ తేడాతో పంజాబ్ కింగ్స్‌‌ను ఓడించింది.  లీగ్ లో ఏడో విక్టరీతో పాటు మంచి రన్‌‌రేట్‌‌తో పాయింట్ల పట్టికలో నాలుగో ప్లేస్‌‌ కు చేరుకుంది. ఇంకోవైపు ఏడోసారి ఓడిన  పంజాబ్ ప్లేఆఫ్స్‌‌ చేరాలంటే తమ ఆఖరి మ్యాచ్‌‌లో నెగ్గడంతో పాటు ఇతర జట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. ఈ మ్యాచ్‌‌లో  టాస్ ఓడిన  ఢిల్లీ 20 ఓవర్లలో 159/7 స్కోరు చేసింది. మిచెల్ మార్ష్ (48 బాల్స్ లో 4 ఫోర్లు, 3 సిక్స్ లతో 63) హాఫ్ సెంచరీతో మెరిశాడు. పంజాబ్ బౌలర్లలో లివింగ్ స్టోన్ (3/27),  అర్షదీప్ సింగ్(3/37) రాణించారు. అనంతరం శార్దూల్ ఠాకూర్ (4/36)  కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ తో పాటు కుల్దీప్ యాదవ్  (2/14), అక్షర్ పటేల్ (2/14) బౌలింగ్‌‌ ధాటికి  ఓవర్లన్నీ ఆడిన పంజాబ్‌‌  142/9 స్కోరు మాత్రమే చేసి ఓడింది. జితేశ్ శర్మ (34 బాల్స్ లో 3 ఫోర్లు, 2 సిక్స్ లతో 44) కాసేపు పోరాడాడు.   శార్దుల్​కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.  

ఆదుకున్న మార్ష్

ఢిల్లీ ఇన్నింగ్స్​లో మార్ష్​ హీరోగా నిలిచాడు. మిగతా బ్యాటర్లు విఫలమైనా హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. పంజాబ్‌‌ ఆల్ రౌండర్ లివింగ్‌‌స్టోన్ ఇన్నింగ్స్ తొలి బంతికే వార్నర్ (0)ను ఔట్ చేసి కెప్టెన్ మయాంక్ నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇక తర్వాతి ఓవర్లోనే రెండు సిక్సర్లు బాదిన మార్ష్.. మరో ఓపెనర్ సర్ఫరాజ్ ఖాన్ (32)తో కలిసి స్కోర్ బోర్డులో వేగం పెంచాడు. ఐదో ఓవర్లో సర్ఫరాజ్ ఔటయ్యాడు. ఆపై లలిత్ యాదవ్ (24)తో కలిసి మార్ష్ జట్టును ఆదుకున్నాడు. దీంతో సగం ఓవర్లకు 86/2తో నిలిచిన ఢిల్లీ భారీ స్కోరు దిశగా సాగింది. ఆపై పంజాబ్ బౌలర్లు పుంజుకున్నారు. 11వ ఓవర్లో లలిత్ ను అర్షదీప్ ఔట్ చేయగా.. వరుస ఓవర్లలో పంత్ (7), పావెల్ (2)ను పెవిలియన్ పంపిన లివింగ్ స్టోన్.. క్యాపిటల్స్ ను మరోసారి దెబ్బకొట్టాడు. ఇక చివర్లో 17వ ఓవర్లో ఫోర్ తో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న మిచెల్ కు అక్షర్ అండగా నిలిచాడు. ఆఖరి రెండు ఓవర్లలో మార్ష్, శార్డూల్ (3) వికెట్లు కోల్పోయిన ఢిల్లీ 10 రన్సే చేసింది.

వికెట్లు ఢమాల్‌‌.. జితేశ్ పోరాటం..  

బౌలర్లు సత్తాచాటిన వేళ బ్యాటింగ్ లో పంజాబ్ నిరాశపర్చింది. ఛేజింగ్ లో పూర్తిగా డీలాపడింది. ఓపెనర్ బెయిర్ స్టో (28) కాసేపు మెరుపులు మెరిపించగా శిఖర్ ధవన్ (19) అతడికి సపోర్ట్ ఇవ్వడంతో ప్రారంభంలో దూకుడు చూపించింది. కానీ నాలుగో ఓవర్లో బెయిర్ స్టోను అన్రిచ్ ఔట్ చేయడంతో కింగ్స్ వికెట్ల పతనం ప్రారంభమైంది. కాసేపటికే రాజపక్స (4), ధవన్ ను శార్దూల్ పెవిలియన్ పంపి డబుల్‌‌ స్ట్రోక్‌‌ ఇవ్వగా..  తర్వాతి ఓవర్లో మయాంక్ (0)ను అక్షర్ డకౌట్ చేశాడు. భారీ అంచనాలున్న లివింగ్ స్టోన్ (3), హర్ ప్రీత్ బ్రర్ (1)ను కుల్దీప్ వరుస ఓవర్లలో ఔట్ చేయడంతో సగం ఓవర్లకు 68/6తో పంజాబ్ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. ఈ దశలో రిషి ధవన్ (4) విఫలమైనా రాహుల్ చహర్ (25 నాటౌట్‌‌)తో కలిసి జితేశ్ శర్మ విరుచుకుపడ్డాడు. 17వ ఓవర్లో చహర్‌‌ 6, 4 బాదడంతో 121/7తో పంజాబ్ రేసులోకి వచ్చింది. 18 బాల్స్ లో 39 రన్స్ అవసరమైన దశలో 18వ ఓవర్లో జితేశ్, రబాడ (6)ను ఔట్ చేసిన శార్దూల్ పంజాబ్‌‌ ఆశలపై నీళ్లు కుమ్మరించాడు. చహర్, అర్షదీప్ (2 నాటౌట్‌‌) చివరి వరకు ఉన్నా ఫలితం లేకపోయింది.