మళ్లీ ఓడిన ఢిల్లీ...57 పరుగుల తేడాతో

 మళ్లీ ఓడిన ఢిల్లీ...57 పరుగుల తేడాతో

ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్  హ్యాట్రిక్ ఓటమి చవిచూసింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచులో వార్నర్ సేన 57 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 200 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ...రాజస్థాన్ బౌలర్ల దాటికి 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులే చేసింది. 

సున్నాకే రెండు వికెట్లు

200 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్..ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయింది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన పృథ్వీ షా డకౌట్ అయ్యాడు. వన్ డౌన్ లో వచ్చిన మనీష్ పాండే కూడా డకౌట్ గానే వెనుదిరిగాడు. దీంతో ఢిల్లీ సున్నాకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది.  ఈ సమయంలో కెప్టెన్ వార్నర్, రిలే రోస్సో కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే 14 పరుగులు చేసిన రోస్సోను అశ్విన్ పెవీలియన్ చేర్చాడు. 

ఆదుకున్న వార్నర్..లలిత్ యాదవ్..

ఈ దశలో కెప్టెన్ వార్నర్, లలిత్ యాదవ్ జట్టును ఆదుకున్నారు. చెత్త బంతులను బౌండరీలుగా మలుస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఇదే క్రమంలో వార్నర్ హాఫ్ సెంచరీ సాధించగా..లలిత్ యాదవ్ 38 పరుగులతో రాణించాడు. హాఫ్ సెంచరీ వైపు దూసుకెళ్తున్న లలిత్ యాదవ్ ను బౌల్ట్ బౌల్డ్ చేశాడు. 

వరుసగా వికెట్లు..

లలిత్ యాదవ్ ఔటయ్యాక ఢిల్లీ వరుసగా వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్ (2), పావెల్ (2), అభిషేక్ పోరెల్ (7) ఇలా వచ్చిన అలా వెళ్లారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా..వార్నర్ పోరాడాడు. అయితే అతనికి సహకరించే వారే కరువయ్యారు. చివరకు ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులే చేసి ఓడిపోయింది. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, చాహల్ చెరో మూడు వికెట్లు దక్కించుకున్నారు. అశ్విన్ రెండు వికెట్లు తీయగా..సందీప్ శర్మ ఒక వికెట్ పడగొట్టాడు. 

రాజస్థాన్ భారీ స్కోరు

అంతకుముందు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్కు ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, జోస్ బట్లర్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఢిల్లీ బౌలర్లను చితక్కొట్టారు. వీరిద్దరు తొలి వికెట్కు ఏకంగా 98 పరుగులు జోడించారు. ముఖ్యం యశస్వీ జైస్వాల్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. కేవలం 31 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సుతో 60 పరుగులు సాధించారు. అయితే 30 పరుగులు చేసిన యశస్వీ జైస్వాల్ను ముఖేష్ కుమార్ ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన సంజూ శాంసన్ డకౌట్ అయ్యాడు. అనంతరం వచ్చిన రియాన్ పరాగ్ 7 పరుగులే చేసి పావెల్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 126 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. 

బట్లర్ విధ్వంసం...

ఈ సమయంలో జోస్ బట్లర్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 51 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సుతో 79 పరుగులతో రెచ్చిపోయాడు. అతనికి సిమ్రన్ హెట్ మెయర్ ( 39: 21 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు)సంచలన బ్యాటింగ్ తో సహకరించాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 199 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో  ముఖేష్ కుమార్ 2 వికెట్లు తీయగా..కుల్దీప్ యాదవ్, పావెల్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.